Most Liked Telugu Web Series: ఇండియాలో ఎక్కువ మంది లైక్ చేసిన తెలుగు వెబ్ సిరీస్ ఇదే.. స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ఓటీటీ
Most Liked Telugu Web Series: ఇండియాలో ఎక్కువ మంది లైక్ చేసిన తెలుగు వెబ్ సిరీస్ గా #90's-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ నిలిచింది. ఈ సందర్భంగా ఈటీవీ విన్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.
Most Liked Telugu Web Series: ఈ ఏడాది తెలుగులో ఎన్నో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వచ్చాయి. అయితే వాటిలో ఇండియాలో ఎక్కువ మంది మెచ్చిన సిరీస్ ఒకటుంది. దాని పేరు #90's-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్. ప్రముఖ తెలుగు ఓటీటీ ఈటీవీ విన్ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ చాలా మందికి నచ్చేసింది. ఆర్మాక్స్ మీడియా ప్రకారం.. తమ సిరీసే నంబర్ వన్ అని సదరు ఓటీటీ వెల్లడించింది.
ఎక్కువ మంది మెచ్చిన వెబ్ సిరీస్ ఇదే
ఆర్మాక్స్ మీడియా 2024 తొలి అర్ధభాగంలో తెలుగులో ప్రేక్షకులు మెచ్చిన వెబ్ సిరీస్ ల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో తాము రూపొందించిన #90's వెబ్ సిరీస్ నంబర్ వన్ గా నిలిచినట్లు ఈటీవీ విన్ ఓటీటీ తెలిపింది. తెలుగు ఓటీటీల్లో రికార్డు బ్రేకింగ్ హిట్ గా తమ మిడిల్ క్లాస్ బయోపిక్ నిలిచినట్లు సదరు ఓటీటీ సోషల్ మీడియా ద్వారా చెప్పింది.
ఇండియాలో బెస్ట్ షో తమదే అని, ఓ తెలుగు వెబ్ సిరీస్ ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి అని కూడా ఈటీవీ విన్ వెల్లడించింది. తెలుగులో వచ్చిన ఎన్నో సిరీస్ లను దాటి దేశంలోనే ఎక్కువ మంది మెచ్చిన వెబ్ సిరీస్ గా #90's నిలిచిందని ఆర్మాక్స్ మీడియా తెలిపింది. ఈ సందర్భంగా ఈ సిరీస్ ను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులు, నటీనటులు, సాంకేతిక సిబ్బందికి ఈటీవీ విన్ థ్యాంక్స్ చెప్పింది.
"ఈ అద్భుతమైన సిరీస్ ను క్రియేట్ చేసిన ఆదిత్య హసన్ కు స్పెషల్ థ్యాంక్స్. ఈ సిరీస్ లో శివాజీ, వాసుకి, మౌళి, స్నేహల్, రోషన్ దివ్య నటించారు. మీకు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే సిరీస్ ఇదే. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ రోజుల్లో ఎలా ఉండేదో కళ్లకు కట్టేలా చూపించింది. నవీన్ మేడారం సిరీస్ ప్రొడ్యూస్ చేశాడు" అని ఈటీవీ విన్ తమ ప్రకటనలో తెలిపింది.
#90's సీజన్ 2 వచ్చేస్తోంది
ఆర్మాక్స్ మీడియా వెబ్ సిరీస్ లకు రేటింగ్ ఇవ్వగా.. అందులో ఈ #90's అత్యధిక రేటింగ్ సాధించింది. ఇక ఈ మధ్యే వచ్చిన బుజ్జి అండ్ భైరవ కూడా మంచి రేటింగ్ సాధించింది. ఆర్మాక్స్ పవర్ రేటింగ్ (ఓపీఆర్) ప్రకారం సిరీస్ కు ర్యాంకులు ఇచ్చారు. ఇందులో #90's 83 ఓపీఆర్ తో టాప్ లో నిలిచింది.
ఇక బీ అండ్ బీకి 80 ఓపీఆర్ వచ్చింది. ఈ సందర్భంగా #90's కొత్త సీజన్లను కూడా ఈటీవీ విన్ అనౌన్స్ చేసింది. సీజన్ 2, సీజన్ 3 రెండూ వచ్చే ఏడాది రానున్నట్లు సదరు ఓటీటీ వెల్లడించింది.
ఏంటీ #90's స్టోరీ?
ఉపాధ్యాయుడిగా చేసే మధ్య తరగతి తండ్రి.. పిల్లలకు వందకు వంద మార్కులు రావాలనుకునే ఆయన మనస్తత్వం - పిల్లల భవిష్యత్తు గురించి.. కుటుంబ బాధ్యతల గురించి నిత్యం ఆలోచించే తల్లి - తమ ఆకాంక్షల కోసం, తండ్రి అంచనాలను నిలబెట్టేందుకు తపించే పిల్లలు - ఇలా 1990 దశకాల్లో సగటు మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే పరిస్థితుల చుట్టూ ఈ కథను దర్శకుడు ఆదిత్య హసన్ రాసుకున్నారు.
ఈ సిరీస్‍లో కనిపించే వస్తువులు, చిన్నచిన్న విషయాలు, పరిస్థితులు, అందరి ఆలోచనలు.. నైంటీస్ కిడ్స్ (1990 దశకంలో పుట్టిన వారికి)కు రిలేట్ అవుతాయి. జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. నైంటీస్ కిడ్స్ చాలా మంది.. ఇది మనకు కూడా జరిగింది కదా అనుకునేలా కొన్ని సన్నివేశాలైనా టచ్ అవుతాయి.