Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అందుకునేందుకు ముహూర్తం ఖరారు.. హాజరుకానున్న రామ్‍చరణ్
Chiranjeevi - Padma Vibhushan: మెగాస్టార్ చిరంజీవి.. పద్మవిభూషణ్ అవార్డు అందుకునేందుకు ముహూర్తం ఖరారైంది. ఇందుకోసం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రామ్‍చరణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
Padma Vibhushan Chiranjeevi: టాలీవుడ్ నట దిగ్గజం, మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డు అందుకోనున్నారు. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ గౌరవం దక్కించుకున్న రెండో టాలీవుడ్ నటుడిగా చిరూ ఘనత సాధించారు. చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డును ఈ ఏడాది జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చిరంజీవి ఇప్పుడు ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ అపూర్వ ఘటానికి ముహూర్తం ఖరారైంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‍లో రేపు (మే 9) చిరంజీవి ఈ అవార్డు స్వీకరించనున్నారు.
రాష్ట్రపతి భవన్‍లో రేపు (మే 9) పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డును మెగాస్టార్ చిరంజీవి స్వీకరించనున్నారు.
ఢిల్లీకి పయనం
పద్మ విభూషణ్ అవార్డు స్వీకరించే కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెగాస్టార్ చిరంజీవి నేడు (మే 8) దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు.
చిరంజీవి.. పద్మవిభూషణ్ స్వీకరించే ఈ కార్యక్రమానికి ఆయన భార్య సురేఖ, గ్లోబల్ స్టార్, ఆయన కుమారుడు రామ్‍చరణ్, కోడలు ఉపాసన కూడా హాజరుకానున్నారు. వారు రేపు (మే 9) ఢిల్లీ బయలుదేరనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అందుకునే ఘట్టాన్ని చూసేందుకు అభిమానులు కూడా సంతోషంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్న చిరూ.. ఇప్పుడు దేశ రెంతో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ స్వీకరించనున్నారు.
చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించిన సందర్భంగా ఆయనను తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరిలోనే సత్కరించింది. ఈ కార్యక్రమంలో చిరూ ఎమోషనల్‍గా మాట్లాడారు. ప్రజలు, అభిమానుల గుండెల్లో ప్రేమ కంటే ఏ అవార్డు తనకు పెద్దది కాదని, మిగిలిన జీవితమంతా సినిమాలు చేస్తానని చిరూ అన్నారు. పద్మవిభూషణ్ ప్రకటించినప్పుడు తనకు ఎక్కువ ఆనందంగా అనిపించలేదని, అయితే అందరి శుభాకాంక్షలు, ప్రశంసలతో సంతోషం అనిపించిందని అన్నారు.
ఈ ఏడాది పద్మ అవార్డులను జనవరి 25న కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే ఏప్రిల్‍లో జరిగిన ప్రదానోత్సవంలో కొందరు అవార్డులను అందుకున్నారు. మిగిలిన వారికి రేపు (మే 9) ప్రదానం చేయనున్నారు రాష్ట్రపతి ముర్ము.
‘విశ్వంభర’తో బిజీ
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో చిరూ కొంతకాలంగా బిజీగా ఉంటున్నారు.
2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విశ్వంభర చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో అప్పటికల్లా ఈ మూవీ సిద్ధమయ్యేలా షూటింగ్‍ను వేగంగా చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం భారీ ఇంటర్వెల్ సీక్వెన్స్ చిత్రీకరణ జరిగింది. ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసమే 26 రోజుల పాటు షూటింగ్ జరిగింది. విశ్వంభరలో చిరంజీవి సరసన హీరోయిన్‍గా త్రిష నటిస్తున్నారు.
విశ్వంభర చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. సుమారు రూ.100కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందనుందని అంచనా. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కూడా భారీ స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది.