Chiranjeevi: సత్యదేవ్‌ నాపై ఉన్న అభిమానంతో.. అనస్తీషియా లేకుండానే గాయానికి 5-6 కుట్లు వేయించుకున్నాడు: చిరంజీవి-mega star chiranjeevi recalls memories with satya dev at zebra movie mega event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi: సత్యదేవ్‌ నాపై ఉన్న అభిమానంతో.. అనస్తీషియా లేకుండానే గాయానికి 5-6 కుట్లు వేయించుకున్నాడు: చిరంజీవి

Chiranjeevi: సత్యదేవ్‌ నాపై ఉన్న అభిమానంతో.. అనస్తీషియా లేకుండానే గాయానికి 5-6 కుట్లు వేయించుకున్నాడు: చిరంజీవి

Galeti Rajendra HT Telugu
Nov 12, 2024 10:42 PM IST

Zebra Movie Event: చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన సత్యదేవ్.. చాలా రోజుల తర్వాత మళ్లీ హీరోగా జీబ్రా మూవీలో నటించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుండగా.. మంగళవారం రాత్రి ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది.

చిరంజీవి
చిరంజీవి

చిరంజీవి అంటే అమితంగా ఇష్టపడే నటుడు సత్యదేవ్ త్వరలోనే జీబ్రా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా నవంబరు 22న ఈ జీబ్రా సినిమా విడుదల కాబోతుండగా.. మంగళవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవి.. సత్యదేవ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

సత్యదేవ్ సరసన జెన్నిఫర్‌ పిసినాటో, ప్రియా భవానీ శంకర్ నటించగా.. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించారు. ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌ పద్మజ, బాలసుందరం, దినేష్‌ సుందరం సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఇందులో పుష్ప ఫేమ్ జాలిరెడ్డి డాలీ ధనంజయ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. జీబ్రా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా వచ్చారు.

పిలిచి ఛాన్స్

జీబ్రా హీరో సత్యదేవ్ మాట్లాడుతూ .. ‘‘వైజాగ్‌లో చిరంజీవి గారిని చూద్దామని వెళ్లి లాఠీ దెబ్బలు తిన్నాను. ఆయన సినిమాలు చూస్తూ కిందా మీద పడుతూ.. హైదరాబాద్‌కి వచ్చాను. అన్నయ్యతో నేను చాలా దగ్గరగా ట్రావెల్ అయ్యాను. కనీసం 100 సార్లు కలిసి ఉంటాను. నేను కొన్ని సినిమాల్లో హీరోగా చేశాను. కానీ.. అవి నిరాశపరిచాయి. ఆ సమయంలో గాడ్‌ ఫాదర్ సినిమాలో పిలిచి చిరంజీవి గారు అవకాశమిచ్చారు. ఆ నమ్మకంతోనే ఇప్పుడు జీబ్రా సినిమాని నాకు ప్రొడ్యూసర్లు ఇచ్చారు’’ అని వెల్లడించారు.

సత్యదేవ్ గాయం వెనుక స్టోరీ

చిరంజీవి మాట్లాడుతూ ‘‘జీబ్రా సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను. సత్యదేవ్ నాకు తమ్ముడి లాంటోడు. బ్లఫ్ మాస్టర్ సినిమాలో సత్యదేవ్ నటన చూసి నేను ఇంప్రెస్ అయ్యి.. అతనితో మాట్లాడాలని అనుకున్నాను. ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో.. తన గాయం గురించి ఇలా చెప్పాడు.

‘కొదమ సింహం సినిమాలో మీరు రోప్‌తో జంప్ చేశారు.. నేను కూడా ఇంట్లో యాంటీనా వైర్‌తో ఆ స్టంట్ చేయడంతో ఈ గాయమైంది. అప్పట్లో ఆ గాయానికి కుట్లు వేయడానికి డాక్టర్ వద్దకు మా నాన్న గారు తీసుకెళ్లారు. గాయానికి కుట్లు వేస్తున్న సమయంలో నేను నొప్పితో ఏడుస్తుంటే.. చిరంజీవి అయితే నవ్వుతూ కుట్లు వేయించుకుంటాడు అని డాక్టర్ చెప్పాడు. దాంతో ఆ 5-6 కట్లు వేసేవరకూ నేను నవ్వుతూనే ఉన్నాను.. నాకు నొప్పి తెలియలేదు. అది మీ మహిమ’ అని సత్యదేవ్ ఆరోజు నాతో చెప్పాడు’’ అని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.

‘‘నేను ఏమైనా.. మైకమా.. అనస్తీషియా లాంటివాడినా ఏంటి..’’ అంటూ చిరంజీవి నవ్వేశారు.

Whats_app_banner