Malayalam Movie Premalu: బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న మరో మలయాళం లవ్ స్టోరీ ప్రేమలు.. హైదరాబాద్‌తో లింక్
Malayalam Movie Premalu: మలయాళం మూవీ ప్రేమలు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా.. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి మంచి వసూళ్లు సాధిస్తోంది.
Malayalam Movie Premalu: మలయాళం సినిమాలంటే తక్కువ బడ్జెట్ తో ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఒక్క కేరళలోనే కాదు.. ఈ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఇష్టపడతారు. అలాంటి వాళ్ల కోసం ఇప్పుడు మరో మలయాళ మూవీ వచ్చింది. ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైన ప్రేమలు అనే మూవీ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు సృష్టిస్తోంది.
మలయాళ లవ్ స్టోరీ ప్రేమలు
వాలెంటైన్స్ డేకు ముందు రిలీజైన ఈ ప్రేమలు అనే మలయాళ మూవీ బడ్జెట్ కేవలం రూ.3 కోట్లు. కానీ తొలి వారంలోనే ఈ సినిమా రూ.18 కోట్ల వరకూ వసూలు చేయడం విశేషం. ఈ మూవీకి మన హైదరాబాద్ కూ లింకు ఉండటం ఇక్కడ గమనించాల్సిన మరో విషయం. భాగ్యనగరం బ్యాక్ డ్రాప్ లో సాగే అందమైన లవ్ స్టోరీ ఈ ప్రేమలు మూవీ.
గిరీష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నస్లేన్ గఫూర్, మమితా బైజూ లీడ్ రోల్స్ లో నటించారు. చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటూ మంచి భవిష్యత్తు కోసం యూకే వెళ్లాలని కలలు కనే యువకుడు.. భవిష్యత్తుపై పూర్తి క్లారిటీతో సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం హైదరాబాద్ వచ్చిన యువతి మధ్య సాగే ప్రేమ కథ ఇది. యువతను ఆకట్టుకునే అన్ని ఎలిమెంట్స్ ఉండటంతో ప్రేమలు మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తోంది.
ఓ పెళ్లిలో కలిసే హీరోహీరోయిన్లు తర్వాత ఎలా ప్రేమలో పడతారు? ఆ ప్రేమ ఆ అబ్బాయి గేమ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కు, ఆ అమ్మాయి భవిష్యత్తు లక్ష్యాల సాధనకు ఎలాంటి అడ్డంకులు క్రియేట్ చేస్తుందన్నది ఈ ప్రేమలు మూవీ స్టోరీ. మలయాళ మూవీని భాషలకు అతీతంగా ప్రేక్షకులు ఎందుకు ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి నిరూపించింది.
ప్రేమలు.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ
ప్రేమలు మూవీకి తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రేక్షకులు ఐఎండీబీలో 8.5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం కేవలం మలయాళంలోనే ఈ సినిమా రిలీజైంది. తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తే ప్రేమలు మూవీ హిట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
మలయాళ ప్రేమ కథలు
మలయాళంలో గతంలో ఎన్నో లవ్ స్టోరీస్ వచ్చాయి. అవన్నీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రేమమ్ మూవీ గురించే. ఈ సినిమా ద్వారానే సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా పరిచయమయ్యారు. ఇక ఆ తర్వాత హృదయం పేరుతో 2022లోనూ మరో లవ్ స్టోరీ వచ్చింది.
ఇవే కాకుండా ఓమ్ శాంతి ఓశనా (డిస్నీ ప్లస్ హాట్ స్టార్), తన్నీర్ మాథల్ దినంగల్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), అన్నయుమ్ రాసూలూమ్ ( డిస్నీ ప్లస్ హాట్ స్టార్), బెంగళూరు డేస్ (డిస్నీ ప్లస్ హాట్ స్టార్), హండ్రెడ్ డేప్ ఆఫ్ లవ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో). రమంతే ఎడన్ తోట్టమ్ ( సన్ నెక్స్ట్) బ్యూటిఫుల్ లవ్‌స్టోరీగా మలయాళ ఆడియెన్స్‌ను మెప్పించాయి.