Ka Producer: నా దగ్గరకు వచ్చేసరికే కుక్కపిల్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు.. కిరణ్ అబ్బవరం క మూవీ నిర్మాత కామెంట్స్
Ka Movie Producer Chinta Gopalakrishna Reddy: కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ క. పీరియాడిక్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 31న క రిలీజ్ సందర్భంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు మూవీ నిర్మాత.
Ka Movie Producer Chinta Gopalakrishna Reddy: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ క. ఈ మూవీలో హీరోయిన్స్‌గా నయన్ సారిక, తన్వీ రామ్ నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
క మూవీ ప్రమోషన్స్
సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకులు తెరకెక్కించిన క మూవీ విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. క మూవీ అక్టోబర్ 31న గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క మూవీ నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి ఆసక్తికర విశేషాలు చెప్పారు.
వ్యాపారవేత్తగా మారినా
- మా "క" సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. మాది రాజమండ్రి. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి పాటలు వినడం ఇష్టం. అలా సినిమాల మీద బాల్యం నుంచే ఆసక్తి ఏర్పడింది. వృత్తిపరంగా వ్యాపారవేత్తగా మారినా సినిమాల మీద ఇంట్రెస్ట్ అలా ఉండిపోయింది.
లాక్‌డౌన్ సమయంలో
- లాక్‌డౌన్ టైమ్‌లో "ఇప్పుడు కాక ఇంకెప్పుడు" అనే సినిమా ప్రొడ్యూస్ చేశాను. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనే ఆ మూవీ చేశాను. వాళ్లు పేరు తెచ్చుకున్న తర్వాత ఫలానా ప్రొడ్యూసర్ మాకు అవకాశం ఇచ్చారని చెప్పుకుంటే చాలు. నాకు ఇందులో డబ్బులు సంపాదించాలని కాదు. పైగా ముందు చిన్న సినిమా నిర్మిస్తే ఈ రంగంలో అనుభవం తెచ్చుకోవచ్చు. మంచి సినిమా చేశామనే గుర్తింపు వస్తే చాలు.
సమంత సినిమాకు
- నా సినిమా కోట్ల మంది చూశారనే సంతృప్తి ఎంతో విలువైనదిగా భావిస్తా. ఆ సినిమా తర్వాత సమంత నటించిన యశోద సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాను. ఆ సినిమాతో ఇండస్ట్రీలో కొద్దిగా గుర్తింపు తెచ్చుకున్నా. పదిమందికి మంచి చేయాలనే ఉద్దేశంతో, ఉపాధి కల్పించాలనే కోరికతో వచ్చాను కాబట్టి నిర్మాతగా నాకు నష్టం జరగదు అని భావిస్తాను. నా వ్యాపారాలు నేను చేసుకుంటూనే మధ్య మధ్యలో సినిమాలు చేస్తున్నాను.
చిన్న చిన్న డైలాగ్స్‌తో
- హీరో కిరణ్ అబ్బవరంపై నాకు మంచి అభిప్రాయం ఉంది. ఆయన ద్వారా ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది. "క" సినిమా కథ విన్నప్పుడు కంటెంట్ చాలా కొత్తగా ఉంది అనిపించింది. ఇందులో సస్పెన్స్, సెంటిమెంట్ ఉన్నాయి. చివరలో చిన్న చిన్న డైలాగ్స్‌తో ఎంతో అర్థాన్నిచ్చేలా మాటలు రాసుకున్నారు.
రిలీజ్‌కు ముందే ఛాన్స్‌లు
- ఇద్దరు దర్శకులు సుజీత్, సందీప్ స్క్రిప్ట్ బాగా నెరేట్ చేశారు. వాళ్లు చెబుతుంటే బాగా చేయగలరు అనే నమ్మకం కుదిరింది. నా దగ్గరకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికే వాళ్లు ఈ సినిమాలో రాము అనే కుక్కపిల్లకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అంతగా డైరెక్టర్స్ ప్రిపేర్ అయి ఉన్నారు. ఇప్పుడు క సినిమా రిలీజ్‌కు ముందే మా కాస్ట్ అండ్ క్రూకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. వాళ్లకు అవకాశాలు వస్తున్నాయంటే నాకు సంతోషమే. వాళ్లను ఫస్ట్ మెట్టు ఎక్కించేది నేనే కావాలని కోరిక.