Kalki 2898 AD OTT: ఓటీటీలోకి వచ్చిన గంటల్లోనే టాప్ 1 ట్రెండింగ్.. దుమ్ము రేపుతున్న కల్కి 2898 ఏడీ
Kalki 2898 AD OTT: ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టిన కొన్ని గంటల్లోనే టాప్ 1 ట్రెండింగ్ మూవీగా మారిపోయింది. గురువారం (ఆగస్ట్ 22) ఈ సినిమా ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. వచ్చీ రాగానే ఊహించినట్లే దుమ్ము రేపుతోంది.
Kalki 2898 AD OTT: ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ రికార్డులు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. డిజిటల్ ప్రీమియర్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఈ సినిమా టాప్ 1 ట్రెండింగ్ సినిమాగా నిలిచిందంటే ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి ఉన్న క్రేజ్ ఎంతో అర్థమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకుపైగా కొల్లగొట్టిన ఈ మూవీ.. ఒకేసారి రెండు ఓటీటీల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
ప్రైమ్ వీడియో టాప్ ట్రెండింగ్ మూవీ
కల్కి 2898 ఏడీ మూవీ గురువారం (ఆగస్ట్ 22) అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లలోకి వచ్చింది. ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్లు.. నెట్‌ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ మూవీస్ లో 5వ స్థానంలో అడుగుపెట్టిన కల్కి.. కొన్ని గంటల్లోనే టాప్ 1కి దూసుకెళ్లింది.
ఈ సినిమాటిక్ మాస్టర్ పీస్‌ను థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ ప్రేక్షకులు ఆదరిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం. అంతేకాదు రానున్న రోజుల్లో ఈ సినిమా ఓటీటీలో రికార్డులు కొల్లగొట్టడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ తెలుగు వెర్షన్ ట్రెండింగ్ మూవీస్ లో అగ్రస్థానంలో ఉంది. అటు నెట్‌ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ కూడా దూసుకెళ్తోంది.
అయితే ఆ ఓటీటీ తమ ప్లాట్‌ఫామ్ పై ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ జాబితాను ప్రతివారం అప్డేట్ చేస్తుంది. వచ్చే వారం రిలీజ్ కాబోయే ఆ లిస్టులో కల్కియే టాప్ లో ఉంటుందన్న అంచనా ఉంది.
తగ్గిన రన్‌టైమ్
ఇక కల్కి 2898 ఏడీ మూవీ రన్ టైమ్ ను ఓటీటీ కోసం తగ్గించారు. థియేటర్లలో 181 నిమిషాలు ఉన్న ఈ సినిమా.. ఓటీటీలోకి వచ్చేసరికి ఆరు నిమిషాలు తగ్గి 175 నిమిషాలకు చేరింది.
కల్కి 2898 ఏడీ ఓటీటీ స్ట్రీమింగ్ లో కొన్ని సీన్లను ట్రిమ్ చేయడంతో మూవీ ఆరు నిమిషాల పాటు తగ్గిపోయింది. ఆ సీన్లలో మొదటిది ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్. ఈ సీన్ నిడివి కాస్త ఎక్కువగా అనిపించడంతో దానిని తొలగించారు. ఇందులో ప్రభాస్ ను కప్ప అని పిలిచే సీన్ ఉంటుంది. దానిని తీసేసినట్లు ఓటీటీ వెర్షన్ చూస్తే తెలుస్తోంది.
ప్రభాస్ ఇంట్రడక్షన్ తర్వాత అతడు ఇద్దరు భారీ కాయులతో చేసే ఫైట్ సీన్ నిడివిని కూడా తగ్గించారు. ఇక కాంప్లెక్స్ లోకి వెళ్లిన తర్వాత అక్కడ దిశా పటానీతో ప్రభాస్ సాంగ్ ను కూడా కత్తిరించేశారు. బీచ్ సీన్లను తొలగించినట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ సీన్లో దీపికా మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చే సీన్ ను ట్రిమ్ చేయడంతో ఇంటర్వెల్ కార్డును తీసేశారు.
అక్కడ థీమ్ ఆఫ్ కల్కి కొత్త లిరిక్స్ ను జోడించారు. ఇక డబ్బింగ్ లోనూ అక్కడక్కడా పలు మార్పులు చేశారు. దీంతో ఓటీటీ వెర్షన్ థియేటర్ కంటే కాస్త మెరుగ్గా అనిపిస్తోంది. మొత్తానికి సినిమా నిడివి ఆరు నిమిషాలు తగ్గించడంతో కల్కి 2898 ఏడీ మరింత మందిని మెప్పించే అవకాశాలు ఉన్నాయి.