Netflix Crime Thriller: నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డులు తిరగరాస్తున్న క్రైమ్ థ్రిల్లర్.. ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమా
Netflix Crime Thriller: నెట్‌ఫ్లిక్స్‌లో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రికార్డులు తిరగరాస్తోంది. 2024లో ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమాగా నిలవడం విశేషం. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా ఇప్పటికీ ఆ ఓటీటీలో దూసుకెళ్తూనే ఉంది.
Netflix Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలకు ఓటీటీల్లో ఉండే డిమాండ్ ఎలాంటిదో చాటి చెబుతోంది తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన మహారాజా. అతని కెరీర్లో 50వ సినిమాగా రిలీజైన ఈ మూవీ.. థియేటర్లలోనే రూ.100 కోట్లకుపైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచీ రికార్డులను తిరగరాస్తూనే ఉంది.
మహారాజా రికార్డు
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో 2024లో ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమా, సౌత్ ఇండియన్ సినిమాగా ఈ మహారాజా రికార్డు క్రియేట్ చేసింది. నిథిలన్ సామినాథన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టి ఆరు వారాలు అవుతున్నా ఇప్పటికీ 8 దేశాల్లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ జాబితాలో ఉండటం విశేషం.
ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ లో ఈ ఏడాది రికార్డులు క్రియేట్ చేసిన క్రూ, లాపతా లేడీస్ సినిమాలను మహారాజా వెనక్కి నెట్టింది. ఇప్పటి వరకూ మహారాజా మూవీకి ఏకంగా 1.86 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇంతకుముందు క్రూ మూవీకి 1.79 కోట్ల వ్యూస్, లాపతా లేడీస్ సినిమాకు 1.71 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ రెండు బాలీవుడ్ సినిమాలు కూడా ఈ ఏడాది థియేటర్లలో రికార్డులు క్రియేట్ చేశాయి.
అలాంటి సినిమాలను మహారాజా వెనక్కి నెట్టింది. విజయ్ సేతుపతి కెరీర్లో ఇది 50వ సినిమా. ఇందులో అతనితోపాటు బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టీ, భారతీరాజా, అభిరామ్ లాంటి వాళ్లు నటించారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించాడు.
మహారాజాలో అంతగా ఏముంది?
మహారాజా మూవీ ఓ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాలో ఓ సాధారణ బార్బర్ గా నటించాడు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. తన ఇంట్లో ఓ దొంగతనం జరిగిందని, తమ జీవితాల్లో ఎంతో ముఖ్యమైన లక్ష్మిని ఎవరో ఎత్తుకెళ్లారని మహారాజా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాడు. అసలు ఆ లక్ష్మి ఎవరు అన్నది ఓ ట్విస్ట్ కాగా.. దాని చుట్టూ తిరిగే కథ, అందులో భాగంగా వచ్చే ట్విస్టులకు మైండ్ బ్లాంక్ అవుతుంది.
ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకుల ఊహకు అందని ట్విస్టులతో తీస్తే ఎలా ఉంటుందో ఈ మహారాజా మూవీ నిరూపిస్తోంది. మొదటి సీన్ నుంచి క్లైమ్యాక్స్ వరకు ప్రతి సీన్లోనూ సినిమా ఎంతో ఉత్కంఠ రేపుతోంది. తెలిసిన స్టోరీయేగా అని అనుకునే ప్రతిసారీ ఓ ట్విస్ట్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. ఇదే ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది.
థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ మహారాజా మూవీ దూసుకెళ్లడానికి ప్రధాన కారణం ఈ సినిమాలోని ఊహించని ట్విస్టులే. మూవీలో విలన్ పాత్రలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్.. విజయ్ సేతుపతితో పోటీ పడి నటించాడు. ఈ ఇద్దరే సినిమాకు ప్రధాన బలం. ఓ చిన్న మిస్ అండర్‌స్టాండింగ్ ఈ ఇద్దరి జీవితాలను ఎలా పూర్తిగా మార్చేసిందన్నది మూవీలో చూడొచ్చు.