Nag Ashwin: రక్తపాతం లేకుండా అంటూ ఆ సినిమాపై నాగ్ అశ్విన్ పంచ్.. ఇది పద్ధతి కాదంటున్న ఫ్యాన్స్
Nag Ashwin: కల్కి 2898 ఏడీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ యానిమాల్ సినిమాపై పరోక్షంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇది పద్ధతి కాదంటూ అభిమానులు అతనికి క్లాస్ పీకుతున్నారు.
Nag Ashwin: నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి 2898 ఏడీ మూవీ మొత్తానికి రూ.1000 కోట్ల మైలురాయిని అందుకుంది. ఈ సక్సెస్ అందించిన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ.. నాగ్ అశ్విన్ చేసిన పోస్ట్ ఇప్పుడు అభిమానులను రెండుగా చీల్చింది. అతడు పరోక్షంగా యానిమల్ సినిమాపై పంచ్ వేశాడని కొందరు.. అలాంటిదేమీ లేదని మరికొందరు సోషల్ మీడియాలో వాదించుకుంటున్నారు.
యానిమల్ మూవీపై పంచ్ వేశాడా?
తాజాగా కల్కి 2898 ఏడీ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం (జులై 14) డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూనే హింస, రక్తపాతం లేకుండానే ఈ మార్క్ అందుకున్నట్లు అతడు చెప్పడం గమనార్హం. దీంతో అతడు పరోక్షంగా యానిమల్ మూవీని టార్గెట్ చేసినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.
"ఈ మైలురాయి.. ఈ నంబర్.. మాలాంటి యంగ్ టీమ్ కు చాలా చాలా పెద్దది. కానీ మేము దీనిని ఎలాంటి రక్తపాతం, హింస, అశ్లీలత, రెచ్చగొట్టే కంటెంట్ లేకుండా సాధించడం చాలా గొప్ప విషయం. మాకు అండగా నిలబడిన ప్రేక్షకులు, నటీనటులకు థ్యాంక్స్. ఇండియన్ సినిమా రేపటి కోసం" అని నాగ్ అశ్విన్ ఆ పోస్టులో రాశాడు.
నాగ్ అశ్విన్‌పై ఫ్యాన్స్ సీరియస్
నాగ్ అశ్విన్ పరోక్షంగా యానిమల్ మూవీపైనే పంచ్ వేశాడని కొందరు అభిమానులు అతన్ని తప్పుబడుతూ పోస్టులు చేశారు. "యానిమల్ సక్సెస్ ను నాగ్ అశ్విన్ ద్వేషిస్తున్నట్లు అనిపిస్తోంది. నిజానికి కల్కి 2898 ఏడీ రిలీజ్ కు ముందు సందీప్ రెడ్డి వంగా మూవీకి అండగా నిలిచాడు. మరి నాగ్ అశ్విన్ ఇలాంటి కామెంట్ ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు" అని ఓ అభిమాని కామెంట్ చేశాడు.
ఇక మరొకరు స్పందిస్తూ.. "నాగ్ అశ్విన్ ఇలా కామెంట్ చేయడం సరికాదు. విజయం గొప్పదే. కానీ ఇతరుల పద్ధతులను తక్కువ చేయడం మంచిది కాదు. సందీప్ రెడ్డిని టార్గెట్ చేసి ఉండాల్సింది కాదు. నిరాశ కలిగించింది" అని అన్నారు. నాగ్ అశ్విన్ బోల్డ్ స్టేట్మెంట్ కు హ్యాట్సాఫ్ అంటూ మరో అభిమాని కామెంట్ చేశారు.
అయితే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం ఇది యానిమల్ మూవీని లక్ష్యంగా చేసుకొని చేసిన కామెంట్ కాదని అంటున్నారు. ఇది కేవలం యానిమల్ మూవీని మాత్రమే లక్ష్యంగా చేసుకొని చేసిన కామెంట్ కాదని, అలాంటి ఎన్నో సీన్లు జైలర్, లియో, సలార్ లాంటి సినిమాల్లోనూ ఉన్నాయంటూ ఓ అభిమాని గుర్తు చేశారు.
నిజానికి యానిమల్ లాంటి సినిమాలు లక్ష్యంగా నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ ను న్యూట్రల్ ప్రేక్షకులు స్వాగతిస్తున్నారు. హింస, రక్తపాతం ఎక్కువగా ఉన్న సినిమాలపై క్రమంగా ఓ వర్గం ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ నాగ్ అశ్విన్ ఈ కామెంట్స్ చేయడం వాళ్లను ఆకర్షించింది. యానిమల్ ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకుపైగా వసూలు చేసినా.. ఈ మూవీపై అప్పట్లోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి.