Kill Movie Review: యానిమల్‍ను మించిన వైలెన్స్.. లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్ ఎలా ఉందంటే?
Kill Movie Review: బాలీవుడ్ సినిమా కిల్ ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయింది. ఇంటెన్స్ వైలెన్స్, ప్యూర్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం వచ్చింది. కరణ్ జోహార్ నిర్మించటంతో హైప్ వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
సినిమా: కిల్ (హిందీ), రిలీజ్ డేట్: జూలై 5, 2024
ప్రధాన నటీనటులు: లక్ష్య, తాన్య మానిక్తలా, రాఘవ్ జుయెల్, అద్రిజా సిన్హా, అభిషేక్ చౌహాన్, ఆషిశ్ విద్యార్థి తదితరులు
సంగీతం: విక్రమ్ మంతోర్సే, సశ్వంత్ సచ్‍దేవ్, హరూన్-గవిన్
బ్యానర్లు: ధర్మ ప్రొడక్షన్స్, శిఖ్యా ఎంటర్‌టైన్‍మెంట్, నిర్మాతలు: కరణ్ జోహార్, గునీత్ మోంగా, అపూర్వ మెహతా, అచింత్ జైన్
దర్శకుడు: నిఖిల్ నగేశ్ భట్
కిల్ చిత్రానికి ట్రైలర్‌తో మంచి హైప్ వచ్చింది. కరణ్ జోహార్ బ్యానర్ ధర్మ ప్రొడక్షన్ నిర్మించటంతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‍లోనూ ఈ చిత్రం ప్రదర్శితమైంది. ఇంగ్లీష్ రీమేక్ హక్కులు కూడా ఇప్పటికే అమ్ముడవటంతో మరింత క్రేజ్ వచ్చింది. ఈవారమే ఈ కిల్ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది, అంచనాలకే తగ్గట్టుగా ఉందా అనేది ఇక్కడ చూడండి.
కథ
అమిత్ రాథోడ్ (లక్ష్య లల్వానీ) ఎన్‍ఎస్‍జీ కమాండోగా పని చేస్తుంటాడు. అతడి ప్రేమికురాలు తులికా (తాన్య మనక్తిలా)కు ఆమె తండ్రి వేరే అబ్బాయితో ఎంగేజ్‍మెంట్ చేస్తాడు. దీంతో తనతో వచ్చేయాలని తులికాను అమిత్ అడుగగా.. ఆమె నిరాకరిస్తుంది. ఆ తర్వాత తులికా కుటుంబం, అమిత్.. ఢిల్లీ నుంచి రాంచీకి ఒకే ట్రైన్‍లో బయలుదేరుతారు. అమిత్‍తో పాటు తన స్నేహితుడు వీరేశ్ (అభిషేక్ చౌహాన్) కూడా ఉంటాడు. ఆ రైలుపై ఫణి (రాఘవ్ జుయల్), బేని (ఆశిష్ విద్యార్థి) సారథ్యంలోని బందిపోట్ల ముఠా దాడి చేస్తుంది. ప్రయాణికులను ఆ బందిపోట్లు దోచుకునేందుకు వస్తారు. దీంతో తులికా కుటుంబంతో పాటు ప్రయాణికులు ప్రమాదంలో పడతారు. ఆ బందిపోట్లు దోచుకోవడమే కాకుండా ప్రయాణికుల ప్రాణాలు తీస్తుంటారు. జామర్లు పెట్టి ఎవరి ఫోన్లు పని చేయకుండా చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? బందిపోట్ల నుంచి తనికాను, ప్రయాణికులను లక్ష్య కాపాడగలిగాడా? అనేది కిల్ మూవీలో ఉంటుంది.
ప్యూర్ యాక్షన్.. ఎమోషన్ కూడా..
కిల్ చిత్రాన్ని ప్యూర్ యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్ తెరకెక్కించారు. ఎక్కువగా బ్యాక్‍స్టోరీలు, పక్కదోవ పట్టే సీన్లు లేకుండా యాక్షన్‍తోనే చిత్రాన్ని ముందుకు నడిపించారు. పాటలు లేకపోవటం కూడా ప్లస్. ఈ చిత్రంలో యాక్షన్ సీన్ల కొరియోగ్రఫీ, కెమెరా యాంగిల్స్ మెప్పిస్తాయి. యాక్షన్‍లో ఇంటెన్సిటీ కనిపిస్తుంది. దీంతోపాటు ఎమోషన్ కూడా మిస్ కాదు. దీంతో ప్రేక్షకులు కథతో కనెక్ట్ అయి ఉంటారు. తర్వాత ఏం జరుగుతుందో అనే టెన్షన్ కొనసాగుతూనే ఉంటుంది. మంచి యాక్షన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ మూవీ అందిస్తుంది.
అంతా ట్రైన్‍లోనే..
కిల్ సినిమా యాక్షన్ మొత్తం రైల్‍లో ఉంటుంది. అందుకే హీరో అమిత్ (లక్ష్య) వరుస పెట్టి బందిపోట్లను నరుకుతున్నా అతిశయోక్తిగా అనిపించదు. రైలు బోగీలు ఇరుకుగా ఉంటాయి కాబట్టి.. ఒకరు లేకపోతే ఇద్దరి కంటే ఎక్కువ మంది ఒకేసారి అతడిపై దాడి చేసే ఛాన్స్ ఉండదు. అందుకే అంతమంది బందిపోట్లను నరికేస్తున్నా ఓవర్ అని అనిపించదు. అందులోనూ అమిత్‍కు కూడా గాయాలవుతాయి. ఎదురుదెబ్బలు తగులుతాయి. ఈ చిత్రంలో ఎక్కువగా కత్తులతో నరుక్కునే, పొడుచుకునే సీన్లు ఉన్నాయి. హాలీవుడ్ మూవీ సిరీస్ జాన్‍విక్ ఛాయలు ఈ మూవీలో కాస్త కనిపిస్తాయి.
యానిమల్ కంటే ఎక్కువ వైలెన్స్
రణ్‍బీర్ కపూర్ హీరోగా గతేడాది వచ్చిన యానిమల్ సినిమాలో వైలెన్స్ విపరీతంగా ఉందనే కామెంట్లు వచ్చాయి. అయితే, ఈ కిల్ చిత్రంలో అంతకు మించిన హింస ఉంది. యానిమల్‍తో పోలిస్తే కథలో అంత డెప్త్ లేకపోయినా.. వైలెన్స్ మాత్రం కిల్‍లో ఎక్కువగా ఉంది. కెమెరా యాంగిల్స్, క్లోజప్ షాట్స్ చూస్తే ఉద్దేశపూర్వకంగానే ఇంటెన్స్‌గా హింసను మేకర్స్ చూపించినట్టు అనిపిస్తుంది.
ముఖ్యంగా ఓ ఘటన జరిగిన తర్వాత సెకండాఫ్‍లో హీరో అమిత్ ఇక హింసకే సై అంటాడు. బందిపోట్లను వరుసపెట్టి చంపుతూ వెళతాడు. కత్తులు, సుత్తులు తప్ప తుపాకులను చాలా తక్కువగా ఈ చిత్రంలో వాడారు. దీంతో వైలెన్స్ చాలా ‘రా’ గా ఉంటుంది. రక్తపాతం విపరీతంగా ఉంటుంది.
ఈ మూవీ కథ ఊహించే విధంగానే ఉంటుంది. ఒకటి మినహా పెద్దగా మలుపులు ఉండవు. ఫస్టాఫ్ కాసేపు సాగదీతగా అనిపించినా.. ఆ తర్వాత మూవీ వేగం పుంజుకుంటుంది.
సాంకేతికంగా ఉన్నతంగా..
కిల్ చిత్రం టెక్నికల్‍గా ఉన్నతంగా ఉంది. దర్శకుడు నిఖిల్ నాగేశ్ భట్ తాను ఏం తీయాలనుకున్నారో పర్‌ఫెక్ట్‌గా తెరకెక్కించారనిపిస్తుంది. కథనం ఎలాంటి పక్కదోవ పట్టకుండా యాక్షన్ యాంగిల్‍లోనే కథను కనిపించారు. లవ్ స్టోరీని తక్కువే సేపే చూపించినా ఎమోషన్ మిస్ కాలేదు. మంచి యాక్షన్ సినిమాటిక్ అనుభూతి వచ్చేలా రూపొందించారు. ఈ చిత్రంలో యాక్షన్ కొరియోగ్రఫీ కూడా మెప్పిస్తుంది. ఫైట్లను రూపొందించిన తీరు ఆకట్టుకుంటుంది. యాక్షన్‍ను ఇష్టపడే వారికి ఈ చిత్రం చాలా నచ్చుతుంది. సినిమాటోగ్రఫీ కూడా ఈ చిత్రానికి బాగా ప్లస్ అయింది. ఎలాంటి అనవసరమైన సీన్లు లేకుండా ఎడిటింగ్ కూడా క్రిస్ప్‌గా ఉంది. గంటా 55 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుంది. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంటెన్స్‌గా టెన్షన్‍ను మరింత పెంచింది.
యాక్టింగ్ పర్ఫార్మెన్స్ సూపర్
హీరోగా తనకు తొలి చిత్రమే అయినా కిల్‍లో లక్ష్య పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. అతడి బాడీ లాంగ్వేజ్, కండలు తిరిగిన దేహం, యాక్టింగ్ ఈ పాత్రకు సరిగ్గా సూటయ్యాయి. యాక్షన్ సీన్లలో అతడి ఇంటెన్సిటీ మెప్పిస్తుంది. మెచ్యూర్ యాక్టింగ్‍తో లక్ష్య ఆకట్టుకున్నాడు. తాన్య మనిక్తలా కూడా మెప్పించారు. ఈ మూవీలో బందిపోట్లుగా నటించిన వారు కూడా తమ పరిధి మేరకు బాగా చేశారు. ఈ చిత్రానికి యాక్టర్ల పర్ఫార్మెన్స్ మరింత ప్లస్ అయింది.
మొత్తంగా..: యాక్షన్‍ను ఇష్టపడే వారికి కిల్ చిత్రం బాగా నచ్చుతుంది. ఎలాంటి పక్కదోవ పట్టకుండా యాక్షన్ ఆధారంగానే ఈ చిత్రం ముందుకు సాగుతుంది. ఫస్టాఫ్‍లో కాస్త సాగదీత మినహా ఈ మూవీలో ఎక్కడా ఉత్కంఠ తగ్గదు. హింస కూడా ఎక్కువగా ఉంటుంది. ప్యూర్ యాక్షన్ చూడాలనుకుంటే ఈ సినిమా మంచి ఆప్షన్.
రేటింగ్: 3.5/5