Animal Movie Review: యానిమల్ మూవీ అంచనాలను అందుకుందా? ఎంగేజింగ్‍గా సాగిందా?: రివ్యూ-animal review ranbir kapoor movie is emotional with high voltage action and engaging with sandeep reddy vanga mark ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal Movie Review: యానిమల్ మూవీ అంచనాలను అందుకుందా? ఎంగేజింగ్‍గా సాగిందా?: రివ్యూ

Animal Movie Review: యానిమల్ మూవీ అంచనాలను అందుకుందా? ఎంగేజింగ్‍గా సాగిందా?: రివ్యూ

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 01, 2023 01:41 PM IST

Animal Full Review: బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‍లో రూపొందిన యానిమల్ మూవీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చింది. యానిమల్ హైప్‍కు తగ్గట్టే ఉందా? అంచనాలను అందుకుందా అనేది ఈ మూవీ రివ్యూలో చూడండి.

Animal Full Review: యానిమల్ మూవీ అంచనాలను అందుకుందా? ఎంగేజింగ్‍గా సాగిందా?: రివ్యూ
Animal Full Review: యానిమల్ మూవీ అంచనాలను అందుకుందా? ఎంగేజింగ్‍గా సాగిందా?: రివ్యూ

Animal Full Review: సినిమా: యానిమల్; రిలీజ్: డిసెంబర్ 1, 2023, ప్రధాన నటీనటులు: రణ్‍బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, శక్తికపూర్ తదితరులు;

స్క్రీన్‍ప్లే: సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా, సౌరభ్ గుప్తా, సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్; సంగీత దర్శకులు: జామ్8, విశాల్ మిశ్రా, మనన్ భరద్వాజ్, శ్రేయస్ పురానిక్, జానీ, అశిమ్ కేమ్సోన్, హర్షవర్ధన్, గురీందర్ సేగల్;

నిర్మాతలు: భూషణ్ కుమార్, కృషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ ఖేతానీ; కథ, ఎడిటర్, డైరెక్టర్: సందీప్ రెడ్డి వంగా

తెలుగులో అర్జున్ రెడ్డి.. దాన్ని బాలీవుడ్‍లో కబీర్ కింగ్‍గా రీమేక్ చేసి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సంచలనం సృష్టించారు. తన మార్క్ చూపించారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్‌తో మోస్ట్ వైలెంట్ మూవీ ‘యానిమల్’ చేయనున్నట్టు ఆయన ప్రకటించిన తర్వాత దీనికి హైప్ విపరీతంగా వచ్చింది. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. జనాలు అంతగా నిరీక్షించిన యానిమల్ సినిమా నేడు (డిసెంబర్ 1) థియేటర్లలో రిలీజ్ అయింది. మరి యానిమల్ చిత్రం హైప్‍కు తగ్గట్టే ఎంగేజింగ్‌గా ఉందా.. అంచనాలను అందుకుందా అనేది ఈ రివ్యూలో చూడండి.

కథ ఇదీ..

బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) స్వస్తిక్ అనే భారీ స్టీల్ కంపెనీని విజయవంతంగా నడుపుతూ దేశంలోనే అత్యధిక ధనవంతుడిగా ఉంటాడు. బల్బీర్‌ను అతడి కుమారుడు రణ్‍విజయ్ సింగ్ (రణ్‍బీర్ కపూర్) అమితంగా ప్రేమిస్తుంటాడు. అయితే, బిజీగా ఉన్నానంటూ చిన్నతనంలో ఉన్న కొడుకును బల్బీర్ పట్టించుకోరు. అయినా తండ్రిపై విజయ్ ప్రేమ పెరుగుతూనే ఉంటుంది.

ఈ క్రమంలో విజయ్ చేసే పనులు నచ్చక అతడిని అమెరికాకు పంపించేస్తాడు బల్బీర్. ఇండియాకు తిరిగి వచ్చాక గీతాంజలి (రష్మిక మందన్న)ని విజయ్ పెళ్లి చేసుకొని.. మళ్లీ అమెరికాకు వెళతాడు. అయితే, తన తండ్రి బల్బీర్‌పై దాడి జరగడంతో విజయ్ మళ్లీ ఇండియాకు తిరిగి వస్తాడు. ఆ తర్వాత తన తండ్రిపై దాడి ఎవరు చేయించారో తెలుసుకునేందుకు, వారిని అంతమొందించేందుకు ఏదైనా చేసేందుకు విజయ్ సిద్ధమవుతాడు.

ఎంత మందినైనా చంపేందుకు వెనకాడడు. తన తండ్రిని చంపేందుకు కుట్ర చేసింది అబ్రార్ హక్ (బాబీ డియోల్)ని తెలుసుకుంటాడు. అసలు బల్బీర్ కుటుంబానికి అబ్రార్‌కు సంబంధం ఏంటి? అబ్రార్‌ నుంచి తన తండ్రి సహా తన కుటుంబాన్ని విజయ్‍ కాపాడుకున్నాడా? అబ్రార్‌ను అంతమొందించాడా? తండ్రి ప్రేమను గెలిచాడా? అన్నదే యానిమల్ సినిమా ప్రధానమైన కథగా ఉంది.

కథనం సాగిందిలా..

యానిమల్ సినిమా ఓపెనింగ్‍ షాట్‍లోనే రణ్‍విజయ్ సింగ్ (రణ్‍బీర్ కపూర్) షాకింగ్ గెటప్‍లో కనిపిస్తాడు. అతడు చెప్పే పిట్ట కథతోనే ఈ మూవీ ఎంత బోల్డ్‌గా ఉండనుందో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రేక్షకులకు ఓ క్లారిటీ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత తండ్రి బల్బీర్ (అనిల్ కపూర్) ప్రేమ కోసం చిన్నతనం నుంచే ఆరాపడే విజయ్‍ను చూస్తే ఎమోషనల్‍గా అనిపిస్తుంది. తండ్రి బల్బీర్ కోసం కుటుంబం కోసం విజయ్ చేసే పనుల్లో ఇంటెన్స్ కనిపిస్తుంది. ఇవన్నీ చాలా తీవ్రతతో ఉంటాయి.

తన అక్కను ర్యాగింగ్ చేశారని చిన్నతనంలోనే కాలేజీలోకి గన్ తీసుకెళ్లి మరీ విజయ్ వార్నింగ్ ఇచ్చే సీక్వెన్స్ అతడి క్యారెక్టర్‌ను స్పష్టంగా చేప్పేస్తుంది. తండ్రిని కాపాడుకునేందుకు ఏమైనా చేసేలా విజయ్ (రణ్‍బీర్) పాత్రను డైరెక్టర్ సందీప్ డిజైన్ చేసిన తీరు.. తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటాయి. ఈ పాత్రలో అక్కడక్కడా అర్జున్ రెడ్డి ఛాయలు కాస్త కనిపిస్తాయి.

బల్బీర్ సహా ఇతర క్యారెక్టర్లను కూడా స్పష్టతతో చూపించారు దర్శకుడు. తన తండ్రి జోలికి వస్తే అక్క భర్తనైనా చంపేస్తానని విజయ్ చెప్పడంతోనే అతడు ఎంతదూరమైనా వెళతాడని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు.

బల్బీర్‌పై అటాక్, దాడి చేసిన వారిని విజయ్ వెతికివెతికి చంపడాన్ని చాలా ఎంగేజింగ్‍గా తెరకెక్కించాడు దర్శకుడు. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే 20 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ మంచి ‘సినిమాటిక్ హై’ను ఇస్తుంది. రణ్‍బీర్ కపూర్ స్టైల్, స్వాగ్‍‍తో పాటు సందీప్ మార్క్ ఈ సీక్వెన్సులో స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాకు ఈ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‍గా నిలుస్తుంది. మొత్తంగా యానిమల్ సినిమా కథ మొత్తంగా కొత్తది కాకపోయినా.. కథనం మాత్రం ఆకట్టుకుంటుంది. మూసగా అనిపించదు. కొన్ని చోట్ల బోర్ అనిపించినా.. ఓవరాల్‍గా ఎంగేజ్ చేస్తుంది.

సెకండ్ హాఫ్ కాస్త..

యానిమల్ సినిమాలో సెకండ్ హాఫ్ ప్రారంభంలో కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. రణ్‍బీర్, రష్మిక మధ్య కొన్ని ఎమోషనల్ సీన్ల సమయం ఎక్కువయ్యాయని అపిస్తుంది. అయితే, ఆ తర్వాత మూవీ మళ్లీ గాడిలో పడుతుంది. అబ్రార్‌(బాబీ డియోల్)ను వెతకడం.. అతడిని చంపడం లాంటివి వేగంగా జరిగిపోయాయి.

బాబీ డియోల్ పాత్ర ఈ సినిమాలో కనిపించేది తక్కువ సమయమే. అతడికి క్యామియోకు కాస్త ఎక్కువ అనుకోవచ్చు అంతే. అతడి క్యారెక్టర్‌ను క్రూరంగా చూపించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇక క్లైమాక్స్‌లో రణ్‍బీర్ కపూర్, అనిల్ కపూర్ మధ్య ఎమోషనల్ సీన్ చాలా మందికి కనెక్ట్ అవుతుంది. ఎమోషనల్ చేస్తుంది. ఎండ్ టైటిల్స్ తర్వాత సీన్లు కూడా ప్రేక్షకులను షాక్‍కు గురి చేస్తాయి. ఇక, యానిమల్ సీక్వెల్‍కు కూడా హింట్ ఇచ్చాడు దర్శకుడు సందీప్.

ఓవర్ డోస్ వైలెన్స్, బోల్డ్

యానిమల్ సినిమాలో వైలెన్స్ ఓవర్ డోస్‍లో ఉంది. మోస్ట్ వైలెంట్ మూవీగా ఈ చిత్రాన్ని తీసుకొస్తానని చెప్పిన మాటను సందీప్ రెడ్డి వంగా చేసి చూపించారు. యాక్షన్ సీన్లలో హింస ఎక్కువైంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఇదే రీతిలో సాగింది. అలాగే, బోల్డ్ డైలాగ్‍లు కూడా ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఇక లిప్‍లాక్‍లు బోలెడు. ఏ సర్టిఫికేట్ చిత్రంలాగే ఈ మూవీ సాగింది.

సూపర్.. రణ్‍బీర్

యానిమల్ సినిమాలో రణ్‍బీర్ కపూర్ యాక్టింగ్ ప్రధానమైన హైలైట్‍గా నిలుస్తుంది. ఎమోషనల్.. యాక్షన్.. ఇలా అన్ని సీన్లలో రణ్‍బీర్ యాక్టింగ్ మెప్పిస్తుంది. అతడి యాటిట్యూడ్, స్వాగ్, స్టైల్.. యానిమల్ పాత్రకు సరిగ్గా సూటయ్యాయి. ప్రస్తుతం దేశంలోనే బెస్ట్ యాక్టర్లలో ఒకడైన రణ్‍బీర్ నుంచి డైెరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరింత అత్యుత్తమైన పర్ఫార్మెన్స్ బయటికి తీశాడు.

వివిధ గెటప్‍ల్లో రణ్‍బీర్ అదరగొట్టాడు. ఈ చిత్రంతో యాక్షన్ హీరోగానూ రణ్‍బీర్ నిలిచిపోతాడు. గీతాంజలి పాత్రలో రష్మిక మందన్న కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్లలో మెప్పించింది. విజయ్ తండ్రి బల్బీర్‌గా అనిల్ కపూర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. బాబీ డియోల్ కనిపించేది కాసేపే అయినా ఇంపాక్ట్ చూపించాడు. రణ్‍బీర్, బాబీ మధ్య ఫైట్‍లో ఇద్దరి ఇంటెన్స్ కనిపిస్తుంది. మిగిలిన నటీనటులందరూ బాగానే చేశారు.

డైరెక్టర్‌గా సందీప్ సక్సెస్! అయితే..

యానిమల్ కథను తాను రాసుకున్న విధంగా తెరకెక్కించడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దాదాపు సక్సెస్ అయ్యాడు. ఎఫెక్టివ్‍గా రూపొందించాడు. రైటింగ్‍లోనూ తన మార్క్ చూపించాడు. దాయాదుల మధ్య పోరు అనే కథ కొత్తది కాకపోయినా.. సందీప్ మార్క్ టేకింగ్ ఆకట్టుకుంది. ఈ మూవీ ఎంగేజింగ్‍గా అనిపించడంలో స్క్రీన్‍ప్లే ముఖ్యమైన పాత్ర పోషించింది.

అయితే, ఎడిటింగ్ విషయంలో సందీప్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్ అని ప్రేక్షకులను సందీప్ ముందుగానే ప్రిపేర్ చేశారు. అయితే, సెకండాఫ్ తొలి గంటలో కొన్ని సీన్లను కట్ చేసి ఉంటే బాగుండేది. ఎక్కువ రన్‍టైమ్ కాస్త మైనస్‍గా అనిపిస్తుంది. ఎక్కడా చాలాసేపు బోరింగ్‍గా అనిపించదు. విసుగు తెప్పించదు. ఇంత భారీ నిడివితో ప్రేక్షకులను ఎంగేజింగ్‍గా చేయడంలో సందీప్ రెడ్డి వంగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.

సాంకేతికంగా..

యానిమల్‍కు బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద బలం. ఈ మూవీకి దాదాపు ఏడు మంది మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు. అయితే, సందీప్ బీజీఎంపై ఎక్కువ శ్రద్ధ పెట్టి తనకు కావాల్సిన ఔట్‍పుట్‍ను రాబట్టుకున్నాడు. పాటలు కూడా ఓకే అనిపిస్తాయి. అమిత్ రాయ్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు తగ్గట్టే ఆకట్టుకునే విధంగా ఉంది. నిర్మాణ విలువలు అత్యంత నాణ్యతతో ఉన్నాయి. ఇక, యానిమల్ సినిమా.. తెలుగులో ఎక్కడా డబ్బింగ్ మూవీలా అనిపించదు. దాదాపు స్ట్రైట్ తెలుగు సినిమాలాగే ఉంది. ఈ విషయంలో సందీప్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు అర్థమవుతుంది. తెలుగు డైలాగ్‍లను రాఖేందు మౌళి, వెన్నెలకంటి రాశారు.

మొత్తంగా.. యానిమల్ సినిమా ఎంగేజింగ్‍గా ఉంది. ఎమోషన్, యాక్షన్.. రెండూ ఆకట్టుకుంటాయి. నిడివి ఎక్కువైనా విసుగుగా అనిపించదు. వైలెన్స్, బోల్డ్ సీన్స్ ఎక్కువైనా పర్వాలేదనుకుంటే ఈ చిత్రాన్ని తప్పకచూడొచ్చు. అయితే, పెద్దలకు మాత్రమే (ఏ సర్టిఫికేట్) అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

రేటింగ్: 3.25/5

Whats_app_banner