Kiran Abbavaram:తెలుగు సినిమాలకు తమిళంలో థియేటర్లు దొరకడం లేదు - కిరణ్ అబ్బవరం కామెంట్స్
Kiran Abbavaram: క మూవీని పాన్ ఇండియన్ లెవెల్‌లో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని అనుకున్నామని కిరణ్ అబ్బవరం చెప్పాడు. కానీ థియేటర్లతో పాటు ఇతర సమస్యల వల్ల ప్రస్తుతం ప్రస్తుతం తెలుగులోనే ఈ మూవీ రిలీజ్ అవుతోన్నట్లు చెప్పాడు. తమిళంలో క మూవీకి థియేటర్ల దొరకలేదని అన్నాడు.
కిరణ్ అబ్బవరం క మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ టీమ్ గతంలో ప్రకటించింది. తాజా పరిణామాల వల్ల ఈ మూవీ ఒక్క భాషలోనే రిలీజ్ కాబోతున్నట్లు కిరణ్ అబ్బవరం అన్నాడు.
తమిళంలో థియేటర్లో దొరకలేదు.
పండుగ టైమ్‌లో తమిళ సినిమాలకు తెలుగులో థియేటర్లు ఇస్తున్నారని, కానీ తెలుగు సినిమాలకు తమిళంలో థియేటర్లు దొరకడం లేదని కిరణ్ అబ్బవరం అన్నాడు. క మూవీకి తమిళంలో ఒక్క థియేటర్ దొరకలేదని చెప్పాడు. మలయాళంలో క మూవీ థియేట్రికల్ రైట్స్‌ను దుల్కర్ సల్మాన్ తీసుకున్నాడని, కానీ అక్టోబర్ 31న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ రిలీజ్ అవుతోండటంతో మలయాళంలో క సినిమా రిలీజ్‌ను వాయిదావేశామని కిరణ్ అబ్బవరం చెప్పాడు.
క మూవీకి తెలుగులో వచ్చిన ఆదరణను బట్టి మంచి రోజు చూసి తమిళం, మలయాళంతో పాటు మిగిలిన భాషల్లో రిలీజ్ చేస్తామని చెప్పాడు.
ఆ నమ్మకం ఇంకా రాలేదు...
మంచి కంటెంట్‌తో కూడిన సినిమా చేస్తే తెలుగు నుంచి ఎక్కువ డబ్బులు వస్తాయనే నమ్మకం తమిళం, మలయాళ మేకర్స్‌లో ఏర్పడిందని కిరణ్ అబ్బవరం చెప్పాడు. తెలుగు సినిమాల పట్ల తమిళం, మలయాళం ఇండస్ట్రీల్లో అలాంటి నమ్మకం ఇంకా ఏర్పడలేదని, అందుకే మన సినిమాలు ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో ఆదరణను దక్కించుకోలేకపోతున్నాయని చెప్పాడు.
నటుడిగా కొత్త కోణాన్ని...
క మూవీలో నటుడిగా నాలోని కొత్త కోణాన్ని చూస్తారని కిరణ్ అబ్బవరం చెప్పాడు. గత సినిమాల్లో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్‌లో మార్పులు చేసుకుంటూ నటించానని కిరణ్ అబ్బవరం అన్నాడు.
మల్టీపుల్ షేడ్స్...
వాసుదేవ్ అనే క్యారెక్టర్ లో మల్టీపుల్ షేడ్స్ ఉన్నాయి. గ్రే షేడ్స్ కూడా కనిపిస్తాయి. ఇందులో వాసుదేవ్ అనే క్యారెక్టర్‌లో కనిపిస్తా. పక్కవాడి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కోరిక వాసుదేవ్‌కు ఎక్కువ. ఆ ఉత్సుకతతోనే వేరేవాళ్ల ఉత్తరాలు చదువుతుంటాను. ఆ క్రమంలో అతని లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది అన్నది క మూవీలో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని కిరణ్ అబ్బవరం అన్నాడు.
గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే...
ఫైట్స్ కూడా భారీగా కావాలని పెట్టలేదు. క అన్నది థ్రిల్లర్ మూవీ. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో వెళ్తుంటుంది. కథకు తగ్గట్లుగానే యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఫస్ట్ సీన్ నుంచి ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ కలిగిస్తుంది. మూవీ క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం హైలైట్ అవుతుంది. క్లైమాక్స్ సీన్స్ మొత్తం సర్ ప్రైజ్ చేస్తాయి. సినిమాలో అనవసరపు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. క సినిమాలో ఏదైనా ఎలిమెంట్ గతంలో స్క్రీన్ మీద చూశామని మీకు అనిపిస్తే నేను సినిమాలు చేయడం ఆపేస్తానని కిరణ్ అబ్బవరం అన్నాడు.