Dhanraj: ఆ దర్శకులందరూ నా గురువులే.. అతను లేకుంటే డైరెక్టర్ అయ్యేవాన్ని కాదు: జబర్దస్త్ ధన్‌రాజ్-jabardasth dhanraj comments on ramam raghavam and samuthirakani at teaser launch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhanraj: ఆ దర్శకులందరూ నా గురువులే.. అతను లేకుంటే డైరెక్టర్ అయ్యేవాన్ని కాదు: జబర్దస్త్ ధన్‌రాజ్

Dhanraj: ఆ దర్శకులందరూ నా గురువులే.. అతను లేకుంటే డైరెక్టర్ అయ్యేవాన్ని కాదు: జబర్దస్త్ ధన్‌రాజ్

Sanjiv Kumar HT Telugu
Apr 29, 2024 11:13 AM IST

Jabardasth Dhanraj About Ramam Raghavam: జబర్దస్త్ కమెడియన్ ధన్‌రాజ్ దర్శకుడిగా మారిన సినిమా రామం రాఘవం. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో తెలుగు దర్శకులపై ధన్‌రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆ దర్శకులందరూ నా గురువులే.. అతను లేకుంటే డైరెక్టర్ అయ్యేవాన్ని కాదు: జబర్దస్త్ ధన్‌రాజ్
ఆ దర్శకులందరూ నా గురువులే.. అతను లేకుంటే డైరెక్టర్ అయ్యేవాన్ని కాదు: జబర్దస్త్ ధన్‌రాజ్

Dhanraj Comments On Directors: స్కేట్ పెన్సిల్ స్టోరీస్ పతాకంపై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పోలవరపు నిర్మాణంలో జబర్దస్త్ కమెడియన్ ధన్‌రాజ్ కొరణాని దర్శకత్వం వహించిన సినిమా రామం రాఘవం. డైరెక్టర్‌గా మారిన ధన్‌రాజ్ రామం రాఘవం చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో సముద్రఖని, ధన్‌రాజ్ తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రలు పోషించారు.

ఇటీవల రామం రాఘవం సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు తమిళ ప్రముఖ దర్శకుడు బాలా, పాండిరాజ్, నటుడు సముద్రఖని, బాబీ సింహా, తంబి రామయ్య, హాస్య నటుడు సూరి, నటుడు దీపక్, నటుడు హరీష్ వంటి కోలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు తంబి రామయ్య మాట్లాడుతూ.. "రామం రాఘవం టీజర్ చాలా అద్భుతంగా ఉంది. ధన్‌రాజ్‌లో గొప్ప దర్శకుడు ఉన్నాడు. అతను తప్పకుండా విజయం సాధిస్తాడు. ఇంకా రెండు, మూడు భాషల్లో కూడా తెరకెక్కిస్తే బాగుటుంది. ఎందుకంటే టీజర్‌లోనే ఆ బలం కనిపిస్తోంది" అని చెప్పారు.

"వెన్నిలా కబడ్డీకులు చిత్రంలో నేను నటించిన పాత్రలో తెలుగులో ధన్‌రాజ్ నటించాడు. తమిళం కన్నా తెలుగులో ఆ కామెడీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఒక హాస్యనటుడు దర్శకుడిగా మారడం చాలా ఆనందంగా ఉంది. తండ్రీకొడుకుల బంధం ఉన్న సినిమాలు ఫ్లాప్ అయిన చరిత్ర లేదు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది" కమెడియన్ సూరి పేర్కొన్నారు.

"నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. రచయిత శివప్రసాద్ కథ ఇది. ఈ కథ గురించి సముద్ర ఖని అన్నకి చెప్పాను. కథను నువ్వే డైరెక్ట్ చేయాలి అని చెప్పాడు. నేను నటించిన చిత్రాలకు పనిచేసిన దర్శకుల నుంచి నేను నేర్చుకున్న విషయాల ఆధారంగా నేను దర్శకత్వం వహించాను" అని దర్శకుడు ధన్‌రాజ్ తెలిపాడు.

"ఇప్పటి వరకు 100 చిత్రాల్లో నటించా. ఆ సినిమా దర్శకులు అందరూ నా గురువులే. వారు నేర్పిన పాఠాలతో ఈరోజు దర్శకుడిగా మారా. సముద్రఖని అన్న లేకుంటే ఈ సినిమా పూర్తయ్యేది కాదు. నేను దర్శకుడిని అయ్యే వాడిని కాను. అందరూ వాళ్ల నాన్నతో కలిసి ఈ సినిమా చూడాలి" అని డైరెక్టర్ ధన్‌రాజ్ చెప్పారు.

"సంతోషకరమైన సమయం ఇది. నేను తండ్రిగా దాదాపు 10కి పైగా సినిమాల్లో నటించా. ఒక్కొక్కటి విభిన్న కథతో. అలాంటి మరో కొత్త కథ ఇది. ధన్‌రాజ్‌కి తల్లిదండ్రులు లేరు. స్వతహాగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు. మంచి కథ ఇది.. అందుకు తగ్గ దర్శకుడు ఉండాలి అని అనుకున్నా" అని డైరెక్టర్ అండ్ యాక్టర్ సముద్ర ఖని తెలిపారు.

"ధనరాజ్‌పై నాకు పెద్ద నమ్మకం ఉంది. అందుకే, అతన్నే దర్శకత్వం చేయమని చెప్పా. దర్శకుడిగా అతను పెద్ద విజయాన్ని అందుకుంటాడు. ప్రతి తండ్రీ కొడుకుల మధ్య ఉండే బంధాన్ని చాటే చిత్రం ఇది. నిర్మాతను నేనెప్పుడూ కలవలేదు. చిత్రీకరణ సమయంలో మొదటిసారి చూశాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా విజయం సాధిస్తుంది" అని సముద్ర ఖని అన్నారు.

Whats_app_banner