Vishal: నా శరీరంలో వంద కుట్లు ఉన్నాయి.. నన్ను క్షమించండి: కోలీవుడ్ హీరో విశాల్
Vishal About Rathnam Movie: కోలీవుడ్ హీరో విశాల్ తన శరీరంలో వంద కుట్లు ఉన్నట్లు తాజాగా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ రత్నం ప్రమోషన్స్‌లో భాగంగా ఈ విషయాలు చెప్పారు. ఇంకా విశాల్ చెప్పిన విశేషాల్లోకి వెళితే..
Vishal About 100 Stitchings In Body: తమిళ స్టార్ హీరో విశాల్‌కు తెలుగులోనూ అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలు తెలుగులోనూ విడుదల అవుతుంటాయి. అలా తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సినిమా రత్నం. ఈ సినిమాలో విశాల్‌కు జోడీగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది.
మూడో సినిమాగా
జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ రత్నం చిత్రాన్ని నిర్మించారు. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. దీంతో హరి-విశాల్ కాంబినేషన్‌లో వస్తోన్నో మూడో సినిమాగా రత్నం అయింది. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు.
కాలేజ్‌కు సారీ
ఏప్రిల్ 26న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్న రత్నం మూవీ ప్రమోషన్స్‌లో విశాల్ పాల్గొన్నారు. ఈ మేరకు శనివారం (ఏప్రిల్ 20) నిర్వహించిన మీడియా సమావేశంలో అనేక విశేషాలు చెప్పారు. "19 ఏళ్ల నా కెరీర్‌లో మీడియా, ఫ్యాన్స్, అభిమానులు, ప్రేక్షక దేవుళ్లందరూ నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. నరసింహారెడ్డి కాలేజ్‌కు సారీ. అక్కడ ఈవెంట్ పెట్టలేకపోయాం. సక్సెస్ మీట్‌ను అక్కడే నిర్వహిస్తాం" అని క్షమించమని కోరారు విశాల్.
డాక్టర్ మాట వినకుండా
"మా డాక్టర్ ఏది చేయొద్దంటే అదే చేస్తుంటాను. వాడు వీడు సినిమా టైంలో మెల్లకన్ను పెట్టి నటించొద్దని అన్నారు. కానీ, నేను వినలేదు. నా శరీరంలో ఇప్పుడు వంద కుట్లున్నాయి. మా డాక్టర్ అలా చెప్పి చెప్పి విసిగిపోయారు. నేను ఆయన మాట వినకుండా ఫీట్స్ చేస్తూనే ఉన్నాను. నన్ను నమ్మి డబ్బులు పెట్టేందుకు వచ్చిన నిర్మాత బాగుండాలని ప్రయత్నిస్తున్నాను. హరి గారితో భరణి, పూజ చేశాను. అవి పెద్ద హిట్లు అయ్యాయి" అని విశాల్ తెలిపారు.
చివరి నిమిషం వరకు
"విశాల్ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోంది. సతీష్ గారు ఈ సినిమాను తీసుకున్నందుకు థాంక్స్. అందరికీ ఈ చిత్రంతో లాభాలు రావాలి. ఏప్రిల్ 26న మా మూవీ రాబోతోంది. నేను చివరి నిమిషం వరకు సినిమాను ప్రమోట్ చేస్తాను. అది నా బాధ్యత. మీడియా వల్ల ఈ చిత్రం ఇంత వరకు వచ్చింది. దేవీ శ్రీ ప్రసాద్ మంచి సంగీతం, ఆర్ఆర్ ఇచ్చారు. డైలాగ్ రైటర్ రాజేష్ వల్ల ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమాలా అనిపిస్తుంది" అని విశాల్ అన్నారు.
ఓటింగ్‌లో పాల్గొనండి
"మాతో కలిసిన ఆదిత్య మ్యూజిక్‌కు థాంక్స్. మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. హరి గారి చిత్రంలో హీరో కంటే హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రియా భవానీ శంకర్ కారెక్టర్ ఈ సినిమాకు ప్రాణం. మీరు పెట్టే డబ్బులకు సరిపడా వినోదం ఇస్తాం. కచ్చితంగా పైసా వసూల్ సినిమా అవుతుంది. నేను ఓటు వేశాను. అందరూ ఓటు వేయాలి. కొత్త ఓటర్లు కచ్చితంగా వెళ్లి పోలింగ్‌లో పాల్గొనండి" అని విశాల్ చెప్పారు.
అలా పరిగెడుతుంటాయి
"విశాల్ గారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే రత్నం చిత్రాన్ని తీసుకున్నాను. హరి గారి చిత్రాలంటే అలా పరిగెడుతూనే ఉంటాయి. ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఏప్రిల్ 26న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన విశాల్ గారికి థాంక్స్" అని డిస్ట్రిబ్యూటర్ సతీష్ అన్నారు.