Hari Hara Veera Mallu: రెండు భాగాలుగా హరి హర వీర మల్లు.. సినిమా పక్కన పడేయలేదు: నిర్మాత ఏఎం రత్నం
Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ మూవీ హరి హర వీర మల్లుపై కీలకమైన అప్డేట్ ఇచ్చాడు నిర్మాత ఏఎం రత్నం. ఈ మూవీ రెండు భాగాలు వస్తుందని, పక్కన పడేయలేదని అతడు చెప్పడం విశేషం.
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమాపై గుడ్ న్యూస్ చెప్పాడు నిర్మాత ఏఎం రత్నం. చాలా రోజుల తర్వాత ఈ మూవీ నుంచి ఓ అధికారిక ప్రకటన రావడం గమనార్హం. అందులోనూ ఈ సినిమా రెండు భాగాలు వస్తుందంటూ ప్రొడ్యూసర్ చెప్పడంతో పవన్ అభిమానుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది.
పవన్ ఎన్నికల తర్వాత వస్తాడు
హరి హర వీర మల్లు షూటింగ్ లో పవన్ కల్యాణ్ పాల్గొనడంపై స్పందిస్తూ.. అతడు ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత వస్తాడని ఏఎం రత్నం తెలిపాడు. "హరి హర వీర మల్లు మూవీతో పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో పవర్ స్టార్ అవుతాడు. ఈ మధ్యే కొన్ని సీన్ల కోసం పవన్ షూటింగ్ పూర్తి చేశాడు. మళ్లీ ఎన్నికల తర్వాత షూటింగ్ చేస్తాడు" అని రత్నం చెప్పాడు.
ఇక హరి హర వీర మల్లు ఎందుకు ఇంత సమయం తీసుకుంటుందన్న అంశంపైనా ఏఎం రత్నం స్పందించాడు. "నేను డబ్బు సంపాదించాలని అనుకుంటే ఏదో కొన్ని రోజుల్లో పూర్తయ్యే సినిమాపై పెట్టుబడి పెట్టేవాడిని. కానీ ఈ సినిమా 17వ శతాబ్దానికి సంబంధించినది. దీనికి సమయం పడుతుంది" అని స్పష్టం చేశాడు.
హరి హర వీర మల్లుపై అవన్నీ పుకార్లే
ఇక హరి హర వీర మల్లు మూవీ అటకెక్కినట్లే అంటూ కొన్నాళ్లుగా వచ్చిన వార్తలను రత్నం ఖండించాడు. అవన్నీ ఉత్త పుకార్లే అని స్పష్టం చేశాడు. "ఓ వెబ్‌సైట్ ఈ సినిమా అటకెక్కినట్లే అని రాయడం నేను చూశాను. ఒకవేళ నేను స్పందించి ఉంటే అది పెద్ద సమస్య అయ్యేది. అందుకే నేను సింపుల్ గా ఈ మూవీ వీఎఫ్ఎక్స్ పనులు ఇరాన్, బెంగళూరు, హైదరాబాద్ లలో జరుగుతున్నాయని చెప్పాను. హరి హర వీర మల్లు పార్ట్ 1 ఒక్కటే కాదు.. రెండో పార్ట్ కోసం కూడా మేము పనులు మొదలుపెట్టాం" అని ఏఎం రత్నం స్పష్టం చేశాడు.
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ హరి హర వీర మల్లు మూవీ మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కుతోంది. అయితే చాలా ఏళ్లుగా మూవీ సాగుతూనే ఉండటం, మధ్యలో నిర్మాతకు ఆర్థిక కష్టాలని, స్క్రిప్ట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేశారని, తర్వాత ఏకంగా డైరెక్టర్ క్రిష్ సినిమా నుంచే తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి.
అటు పవన్ కల్యాణ్ కూడా మిగిలిన సినిమాలను వేగంగా పూర్తి చేస్తూ ఈ మూవీని పట్టించుకోకపోవడం కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చాయి. హరి హర వీర మల్లు మొదలుపెట్టిన తర్వాత పవన్ సినిమాలు భీమ్లా నాయర్, బ్రోలాంటివి రిలీజయ్యాయి. ఓజీ మూవీ రిలీజ్ డేట్ కూడా ఈ మధ్యే రివీల్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిర్మాత ఇచ్చిన క్లారిటీతో హరి హర వీర మల్లు కూడా ఒకటి కాదు ఏకంగా రెండు భాగాలుగా ప్రేక్షకులను అలరించనున్నట్లు స్పష్టమైంది. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా తెలుగుతోపాటు పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో రిలీజ్ కానుంది.
టాపిక్