Horror Movie: ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రీరిలీజ్ మూవీ ఇదే.. దళపతి విజయ్ రికార్డు తిరగరాసిన హారర్ మూవీ
Horror Movie: రీరిలీజ్ సినిమాల హవా నడుస్తున్న ఈ కాలంలో ఇప్పుడో హారర్ మూవీ ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన రీరిలీజ్ సినిమాగా నిలిచింది. దళపతి విజయ్ గిల్లీ మూవీ పేరిట ఉన్న రికార్డును ఈ సినిమా తిరగరాయడం విశేషం.
Horror Movie: ఓ హారర్ మూవీ ఇప్పుడు రీరిలీజ్ లో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. మొదటిసారి ఆరేళ్ల కిందట రిలీజైనప్పుడు ఓ ఫ్లాప్ మూవీగా మిగిలిపోగా.. ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన రీరిలీజ్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. మనం మాట్లాడుకుంటున్న ఆ సినిమా పేరు తుంబాద్. రీరిలీజ్ అయిన 11 రోజుల్లోనే అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.
తుంబాద్ రీరిలీజ్ కలెక్షన్లు
తుంబాద్ ఓ హారర్ మూవీ. 2018లో తొలిసారి రిలీజ్ కాగా.. రూ.12 కోట్లు వసూలు చేసింది. అయితే బడ్జెట్ కంటే తక్కువ వసూళ్లతో ఓ ఫ్లాప్ మూవీగా మిగిలిపోయింది. ఇదే సినిమాను సెప్టెంబర్ 13న రీరిలీజ్ చేశారు. కానీ ఆశ్చర్యకరంగా ఈసారి తుంబాద్ దూసుకెళ్తోంది. తొలి వారంలోనే మొదటిసారి రిలీజైనప్పటి కలెక్షన్లను దాటిపోగా.. ఇప్పుడు అత్యధిక వసూళ్లు సాధించిన రీరిలీజ్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.
ఇన్నాళ్లూ రూ.32 కోట్లతో దళపతి విజయ్ మూవీ గిల్లీ పేరిట ఈ రికార్డు ఉండేది. అయితే తుంబాద్ 11 రోజుల్లో రూ.33 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. రెండో వారం ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగాయి. సెకండ్ వీకెండ్ ముగిసే సమయానికే ఈ అరుదైన రికార్డును ఈ హారర్ మూవీ సొంతం చేసుకుంది.
సోహమ్ షా నటించిన తుంబాద్ మూవీ రీరిలీజ్ లో మొత్తంగా రూ.45 కోట్ల వరకూ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. రాహి అనిల్ బార్వే డైరెక్ట్ చేసిన ఈ హారర్ మూవీ.. 2018లో కేవలం రూ.12 కోట్లు వసూలు చేయగా.. ఇప్పటికే దానికి సుమారు మూడు రెట్ల వసూళ్లు సాధించింది. తుంబాద్ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుందన్న వార్తల నేపథ్యంలో ఈ మూవీ సక్సెస్ మేకర్స్ ను ఆనందానికి గురి చేస్తోంది.
తుంబాద్ మూవీ ఓటీటీ
తుంబాద్ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 100 ఏళ్లలో ఎవరూ వెళ్లని లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ చేయడం కూడా ఈ తుంబాద్ మరో విశేషం. ఈ మధ్య కాలంలో హారర్ సినిమాలకు ఫాలోయింగ్ పెరగడం కూడా మూవీ బాక్సాఫీస్ సక్సెస్ కు ఓ కారణంగా చెప్పొచ్చు. మరి తుంబాద్ సీక్వెల్ ఎలా ఉంటుందో చూడాలి.
అత్యధిక వసూళ్లు సాధించిన రీరిలీజ్ మూవీస్
రీరిలీజ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా తుంబాద్ టాప్ లోకి దూసుకెళ్లింది. రూ.32.5 కోట్లతో గిల్లీ రెండో స్థానానికి పడిపోయింది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత టైటానిక్ రూ.18 కోట్లు, షోలే 3డీ వెర్షన్ రూ.13 కోట్లు, లైలా మజ్నూ రూ.11.5 కోట్లు, రాక్‌స్టార్ రూ.11.5 కోట్లు, అవతార్ రూ.10 కోట్లు వసూలు చేశాయి.
ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే.. అత్యధికంగా మురారి మూవీ రూ.8.9 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత గబ్బర్ సింగ్ రూ.8.01 కోట్లు, ఖుషీ రూ.7.46 కోట్లు, బిజినెస్‌మ్యాన్ రూ.5.85 కోట్లు, సింహాద్రి రూ.4.6 కోట్లు, ఇంద్ర రూ.3.38 కోట్లు వసూలు చేశాయి.