Guppedantha Manasu: గుప్పెడంత మనసు రిషి తెలుగు డెబ్యూ మూవీలో భాగమైన ఆస్కార్ విన్నర్ - షూటింగ్ అప్‌డేట్ ఇదే!
Mukesh Gowda: గుప్పెడంత మనసు రిషి తెలుగు డెబ్యూ మూవీ గీతాశంకరంపై మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రివీల్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్నట్లు వెల్లడించారు. గీతా శంకరం మూవీకి ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ పాటలు సమకూర్చుతున్నారు.
Mukesh Gowda: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలు అంగీకరించాడు. అందులో ఒకటి స్ట్రెయిట్ తెలుగు మూవీ కాగా...మరొకటి తెలుగు, కన్నడ బైలింగ్వల్ మూవీ కావడం గమనార్హం.
గీతా శంకరం...
ముఖేష్ గౌడ అలియాస్ రిషి తెలుగు మూవీ గీతా శంకరం పేరుతో తెరకెక్కుతోంది. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో ముఖేష్ గౌడకు జోడిగా ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. గీతా శంకరం మూవీతో రుద్ర దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఇప్పటికే ఈ సినిమా థియేటర్లలోకి రావాల్సింది. కానీ రిషికి ప్రమాదం జరగడంతో మధ్యలో కొన్నాళ్లు షూటింగ్ నిలిచిపోయింది. ఆ తర్వాత కూడా గీతా శంకరంపై ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో సినిమా ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
బెంగళూరులో షూటింగ్...
గీతా శంకరం మూవీపై మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రివీల్ చేశారు. ప్రస్తుతం గీతా శంకరం మూవీ షూటింగ్ బెంగళూరులో జరుగుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. హీరోహీరోయిన్లు ముఖేష్ గౌడ, ప్రియాంకశర్మతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోన్నట్లు వెల్లడించారు.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీగా గీతా శంకరం మూవీ తెరకెక్కుతోందని చిత్ర బృందం చెప్పింది. ఈ సినిమా పాటల రికార్డింగ్ పూర్తయిందని, త్వరలోనే ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేస్తామని మేకర్స్ అన్నారు.
కథలో మార్పులు...
అనుకోకుండా వచ్చిన ఈ గ్యాప్‌లో గీతా శంకరం కథలో చాలా మార్పులు, చేర్పులు చేసినట్లు దర్శకుడు రుద్ర తెలిపాడు. టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రానటువంటి కొత్త పాయింట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నట్లు తెలిపాడు. మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా గీతా శంకరం ఆడియెన్స్‌ను అలరిస్తుందని, త్వరలోనే గీతా శంకరం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని దర్శకుడు రుద్ర అన్నాడు.
ఆస్కార్ విన్నర్ పాటలు..
గీతా శంకరం సినిమాకు ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ పాటలు రాశారు. ఆయన అందించిన సాహిత్యం సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలుస్తోందని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తోన్నారు. ఈ సినిమాకు అభు మ్యూజిక్ అందిస్తోన్నాడు.
ప్రియమైన నాన్నకు...
గీతా శంకరంతో పాటుఇటీవలే తెలుగు, కన్నడ బైలింగ్వల్‌ను రిషి అనౌన్స్‌చేశాడు. తెలుగులో ఈ మూవీకి ప్రియమైన నాన్నకు అనే టైటిల్‌ను కన్ఫార్మ్ చేశారు.కన్నడంలో తీర్థరూప తండేయావరిగే అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రియమైన నాన్నకు మూవీకి రామేనహల్లి జగన్నాథ దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
నిహార్ ముఖేష్...
సినిమాల కోసం గుప్పెడంత మనసు రిషి తన పేరును మార్చుకున్నాడు. ప్రియమైన నాన్నకు మూవీ పోస్టర్స్‌పై ముఖేష్ గౌడ పేరు నిహార్ ముఖేష్‌గా కనిపిస్తోంది. ముఖేష్ గౌడ పేరుతో సీరియల్స్ చేసిన రిషి...సినిమాల్లో మాత్రం నిహార్ ముఖేష్‌గా కొనసాగనున్నట్లు సమాచారం. ముఖేష్ గౌడ లీడ్ రోల్‌లో నటించిన గుప్పెడంత మనసు సీరియల్ ఇటీవలే ముగిసింది. సినిమాల కారణంగా కొన్నాళ్లు సీరియల్స్‌కు దూరంగా ఉండాలని రిషి నిర్ణయించుకున్నట్లు సమాచారం.