Guntur Kaaram OTT: గుంటూరు కారం సినిమా ఓటీటీలోకి వచ్చేది అప్పుడే?
Guntur Kaaram OTT: గుంటూరు కారం సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రానుందో అంచనాలు వెలువడ్డాయి. మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ మూవీ థియేటర్లలో మంచి కలెక్షన్లతో కొనసాగుతోంది. ఈ సినిమా ఓటీటీ సంబంధిత వివరాలు ఇవే..
Guntur Kaaram OTT: గుంటూరు కారం సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్లలో మాత్రం దూకుడు చూపిస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ అయింది. ఆరంభం నుంచి మిశ్రమ స్పందన వస్తున్నా.. మంచి వసూళ్లను రాబడుతోంది. మహేశ్ మాస్ యాక్షన్, డ్యాన్స్ ఈ చిత్రానికి హైలైట్‍గా ఉన్నాయి. కాగా, గుంటూరు కారం సినిమా ఓటీటీలోకి ఎప్పుడు రానుందో సమాచారం వెల్లడైంది.
గుంటూరు కారం సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజ్ అయ్యాక 28 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసుకునేలా మూవీ టీమ్‍తో నెట్‍ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. దీంతో గుంటూరు కారం సినిమా స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందో అంచనాలు వెలువడుతున్నాయి.
గుంటూరు కారం సినిమా ఫిబ్రవరి రెండో వారంలో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఫిబ్రవరి 9వ తేదీన ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెడుతుందని తెలుస్తోంది. ఒకవేళ ఆ తేదీన సాధ్యం కాకపోతే ఫిబ్రవరి 16వ తేదీలోగా ఏదో ఒక రోజు నెట్‍ఫ్లిక్స్‌లో గుంటూరు కారం స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది.
మాస్ యాక్షన్, మదర్ సెంటిమెంట్‍తో గుంటూరు కారం సినిమాను స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. పక్కా కమర్షియల్ మూవీగా తీసుకొచ్చారు. రమణ అనే ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్ చేశారు మహేశ్ బాబు. ఫైట్లు, మాస్ డ్యాన్స్‌తో విజిల్స్ వేయించారు సూపర్ స్టార్. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. శ్రీలీల కూడా డ్యాన్స్ తో దుమ్మురేపారు.
గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణ, జయరాం, జగపతి బాబు, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, ఈశ్వరి రావు, వెన్నెల కిశోర్ కీలకపాత్రలు పోషించారు. మహేశ్ బాబు తల్లిగా ఈ చిత్రంలో రమ్యకృష్ణ నటించారు. ఆ ఇద్దరి మధ్య ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
గుంటూరు కారం మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మించారు. ఈ సినిమాకు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.200కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మూవీ టీమ్ వెల్లడించింది. ఒకే భాషలో ప్రాంతీయ మూవీగా వచ్చిన గుంటూరు కారం రికార్డులను సృష్టిస్తోందని పోస్టర్స్ రిలీజ్ చేస్తోంది.
ఆరంభంలో మిక్స్డ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి గుంటూరు కారం సినిమాకు మంచి స్పందన వస్తోందని నిర్మాత ఎస్.నాగవంశీ ఇటీవల మీడియా సమావేశంలో చెప్పారు. తమ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయని అన్నారు.
జర్మనీకి మహేశ్ బాబు
మహేశ్ బాబు తదుపరి దర్శక ధీరుడు రాజమౌళితో అడ్వెంచర్ యాక్షన్ సినిమా (SSMB29) చేయనున్నారు. ఈ సినిమా టెక్నికల్ అంశాల కోసం మహేశ్ తాజాగా జర్మనీ వెళ్లారు. మూడో రోజుల తర్వాత మళ్లీ ఇండియాకు రానున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తయినట్టు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల చెప్పారు. త్వరలోనే SSMB29 షూటింగ్ మొదలు కానుంది.