Mahesh Babu about Beedi: గుంటూరు కారంలో ‘బీడీ’ సీక్రెట్ చెప్పేసిన మహేశ్ బాబు.. దేనితో తయారు చేశారంటే..
Mahesh Babu about Guntur Kaaram Beedi: గుంటూరు కారం సినిమాలో తాను తాగిన బీడీల గురించి సీక్రెట్ వెల్లడించారు హీరో మహేశ్ బాబు. ఆ బీడీలను వేటితో తయారు చేశారో చెప్పారు. యాంకర్ సుమతో ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు.
Mahesh Babu about Guntur Kaaram Beedi: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా భారీ వసూళ్లతో దూసుకెళుతోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా, మూడు రోజుల్లోనే రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి దుమ్మురేపుతోంది. అయితే, గుంటూరు కారం సినిమాలో మాస్ క్యారెక్టర్ చేసిన మహేశ్ బాబు.. కొన్ని సీన్లలో బీడీ తాగుతూనే కనిపించారు. దీంతో మహేశ్ అన్ని బీడీలు ఎలా తాగారో అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. అయితే, ఈ బీడీ సీక్రెట్‍ను తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు మహేశ్ బాబు.
గుంటూరు కారం హీరోహీరోయిన్లు మహేశ్ బాబు, శ్రీలీలను ప్రముఖ యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా సినిమాలో బీడీ గురించి సుమ అడిగారు. దీంతో మహేశ్ సమాధానం చెప్పారు. గుంటూరు కారం చిత్రం కోసం తాను తాగిన బీడీలు పొగాకుతో చేసినవి కాదని మహేశ్ స్పష్టం చేశారు. అవి ఆయుర్వేదిక్ బీడీలు అని చెప్పారు. వేటితో తయారు చేశారో కూడా వెల్లడించారు.
“నేను పొగతాగను. నేను స్మోకింగ్‍ను ప్రోత్సహించను కూడా. అదొక ఆయుర్వేదిక్ బీడీ. అవి లవంగాల ఆకులతో తయారయ్యాయి. తొలుత నాకు రియల్ బీడీ ఇచ్చారు. అది తాగాక నాకు చాలా తలనొప్పి వచ్చింది. నా వల్ల కావడం లేదు ఏం చెద్దామని త్రివిక్రమ్‍కు చెప్పా. ఆ తర్వాత ఆలోచించి.. ఆయుర్వేదిక బీడీ అని సెట్ వాళ్లు ఏదో పట్టుకొచ్చారు. అది చాలా బాగుందని చెప్పి ఆ బీడీని వాడాను. ఆ బీడీలను లవంగం ఆకులతో చేశారు. అలాగే పుదీన ఫ్లేవర్‌తో ఉంటుంది. దాంట్లో పొగాకు అసలు లేదు. అది ఆయుర్వేదిక్” అని మహేశ్ బాబు చెప్పారు.
అది ఆయుర్వేదిక్ బీడీ అని చెప్పడంతో సుమ కూడా సర్‌ప్రైజ్ అయ్యారు. ఈ ఇంటర్వ్యూలో ఇదే హైలైట్ అని అన్నారు. ఆయుర్వేదిక్ అయినందుకు బీడీలు మిగిలి పోతే మళ్లీ జాగ్రత్తగా ప్యాకెట్‍లో చుట్టి పెట్టేవారని శ్రీలీల తెలిపారు. దీంతో.. గుంటూరు కారంలో వాడిన బీడీల సీక్రెట్ రివీల్ అయింది.
స్వయంకృషి డైలాగ్‍పై..
గుంటూరు కారం సినిమాలో చిరంజీవి ‘స్వయంకృషి’ సినిమా డైలాగ్‍ను వాడడంపై కూడా మహేశ్ బాబు స్పందించారు. తనకు చిరంజీవి అంటే చాలా గౌరవం అని, స్వయంకృషిలో ఆ డైలాగ్ అంటే చాలా ఇష్టమని అన్నారు. ఆ డైలాగ్ తాను మూవీలో చెప్పినప్పుడు సుదర్శన్ థియేటర్లో అభిమానుల స్పందన అద్భుతంగా ఉందని మహేశ్ బాబు అన్నారు.
గుంటూరు కారం సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ క్యారెక్టర్ చేశారు మహేశ్ బాబు. మాస్ డైలాగ్‍లు, యాక్షన్, డైలాగ్ డెలివరీతో అదరగొట్టారు. ఈ చిత్రంలో మహేశ్‍ను చూసి అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మదర్ సెంటిమెంట్ కూడా ఈ మూవీలో మరో ప్రధాన అంశంగా ఉంది.
గుంటూరు కారం చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించగా.. రమ్యకృష్ణ, జయరాం, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, రావు రమేశ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.