Guntur Kaaram Naga Vamsi: మేం చేసిన తప్పు అదేనేమో.. మహేశ్ చెప్పిన మాటలు నిజమయ్యాయి: నిర్మాత నాగవంశీ
Guntur Kaaram Naga Vamsi: గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ సాధించలేకపోతోంది. మిక్స్డ్ టాక్‍తో వెనుకబడింది. ఈ తరుణంలో నిర్మాత నాగవంశీ నేడు మీడియా సమావేశంలో ఆసక్తికర కామెంట్లు చేశారు.
Guntur Kaaram Naga Vamsi: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ఆరంభం నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా మహేశ్ స్టార్ డమ్‍తో మంచి వసూళ్లనే రాబడుతోంది. కానీ, అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం మూవీలో మహేశ్ బాబు.. మాస్ క్యారెక్టర్ చేశారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ చిత్రం రిలీజ్ అయింది. మహేశ్ ఫైట్స్, డ్యాన్స్, ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. మూవీపై మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ తరుణంలో నేడు (జనవరి 19) మరోసారి మీడియా సమావేశంలో మాట్లాడారు నిర్మాత నాగవంశీ.
ఆ తప్పు చేశామని అనుకుంటున్నాం
గుంటూరు కారం చిత్రానికి ఒంటి గంట బెనెఫిట్ షోల తర్వాత ఎక్కువగా నెగెటివిటీ వచ్చిందని, అలా ఎందుకు జరిగిందో అర్థం కాలేదని నాగవంశీ అన్నారు. అయితే, ప్రభాస్ హీరోగా చేసిన సలార్ చిత్రం బెనెఫిట్ షోలకు కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కదా అన్న ప్రశ్న నాగవంశీకి ఎదురైంది. దానికి ఆయన స్పందించారు. సలార్ మాస్ యాక్షన్ మూవీ అని, అందుకే అభిమానులకు హై వచ్చిందని, గుంటూరు కారం ఫ్యామిలీ మూవీ కావడంతో బెనెఫిట్ షోలకు విభిన్నమైన స్పందన వచ్చిందని చెప్పారు. గుంటూరు కారం మూవీకి ఒంటి గంట షోలు వేయడం తాము చేసిన తప్పుగా భావిస్తున్నామని అన్నారు.
“సలార్ పెద్ద మాస్ సినిమా. ఒంటి గంట షోలు చూసినప్పుడు వాళ్లకు హై వచ్చింది. ఇది (గుంటూరు కారం) ఫ్యామిలీ సినిమా. త్రివిక్రమ్ సినిమా. నేను పోల్చడం లేదు. తల్లి, కొడుకుల బంధం గురించి త్రివిక్రమ్ తీసిన సినిమాకు ఒంటి గంట షోలు వేసి తప్పు చేశానని నేను మనసులో అనుకుంటున్నా. మేం ఆ తప్పు చేశామని భావిస్తున్నాం” అని నాగవంశీ అన్నారు.
గుంటూరు కారం చిత్రానికి జనవరి 12న అర్ధ రాత్రి ఒంటి గంటకు తెలంగాణలోని కొన్ని థియేటర్లలో బెనెఫిట్ షోలు పడ్డాయి. అయితే, ఆ షోల తర్వాత నెగెటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత ఈ మూవీకి కాస్త పాజిటివిటీ పెరిగినా.. ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. హనుమాన్ చిత్రానికి అంతటా పాజిటివ్ టాక్ రావడం కూడా గుంటూరు కారం మూవీపై ప్రభావం చూపింది.
మహేశ్ చెప్పిందే నిజమైంది
ఆరంభంలో పూర్తి మిక్స్డ్ టాక్ రావడంతో తాము కాస్త కంగారు పడ్డామని, అయితే మహేశ్ బాబు తమకు ధైర్యం చెప్పారని నాగవంశీ వెల్లడించారు. సాధారణ ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు మూవీ బాగా నచ్చుతుందని మహేశ్ చెప్పారని, అదే నిజమైందని అన్నారు.
“మహేశ్ బాబు మొదటి రోజు నుంటి పాజిటివ్‍గా ఉన్నారు. ఆయనే గట్టిగా నిలబడ్డారు. వివాదాలు, విమర్శలు వచ్చినప్పుడు మేం జంకామేమో కానీ.. ఆయన స్టడీలా ఉన్నారు. రేపటి నుంచి ఎలా ఉంటుందో చూడు అని అన్నారు. ఆయన చెప్పిందే కరెక్ట్ అయింది. ఫస్ట్ డే నేను కాస్త జారాను కానీ.. ఆయన రాయిలా నిల్చున్నారు. ఆయన ధైర్యమే ఆదివారం నుంచి కలెక్షన్ల రూపంలో వచ్చింది. ఫ్యామిలీ ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని ఆయన చాలా నమ్మకంతో చెప్పారు. కలెక్షన్లలో అది కనపడింది. ఎందుకు ఈ సినిమాపై ఇన్ని విమర్శలు వచ్చాయో తెలియదు. టార్గెట్ చేశారా.. నిజంగానే అలా అనిపించిందా అనేది చేసిన వాళ్లకే తెలియాలి” అని నాగవంశీ అన్నారు. గుంటూరు కారం మూవీ వన్‍మన్ షో కాదని, మహేశ్ - త్రివిక్రమ్ టూ మెన్ షో అని చెప్పారు.
గుంటూరు కారం చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా.. హారికా హాసినీ క్రియేషన్స్ పతాకం నిర్మించింది. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు కాగా.. రమ్యకృష్ణ, జయరాం, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, రావు రమేశ్, ఈశ్వరి రావు కీలకపాత్రల్లో నటించారు. థమన్ సంగీతం అందించారు.
సంబంధిత కథనం