Game Changer- Jaragandi Song Postponed: మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ అభిమానులకు నిరాశ ఎదురైంది. గేమ్ ఛేంజర్ సినిమా నుంచి తొలి పాట ‘జరగండి.. జరగండి’ వచ్చేస్తోందని సంతోషపడిన వారు నిరుత్సాహం చెందారు. దీపావళి రోజున జరగండి సాంగ్ రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, అనివార్య కారణాల వల్ల గేమ్ చేంజర్ నుంచి ‘జరగండి’ పాటను దీపావళికి తీసుకురాలేకపోతున్నామని, వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా వెల్లడించింది.
వివిధ సినిమాల మధ్య ఆడియో డాక్యుమెంటేషన్ సమస్యల వల్ల గేమ్ ఛేంజర్ సినిమా నుంచి జరగండి పాట రిలీజ్‍ను వాయిదా వేస్తున్నట్టు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నేడు (నవంబర్ 11) అధికారికంగా వెల్లడించింది. త్వరలోనే అప్‍డేట్ ఇస్తామని తెలిపింది.
“మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ అభిమానులు, డైరెక్టర్ శంకర్ అభిమానుల నిరీక్షణకు సరైన ఫలితం ఉంటుంది. గేమ్ ఛేంజర్ నుంచి వచ్చే ప్రతీది అత్యుత్తమంగా ఉంటుంది. మిమ్మల్ని అద్భుతమైన క్వాలిటీతో ఎంటర్‌టైన్ చేసేందుకు టీమ్ నిరంతరం కష్టపడుతోంది” అని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పేర్కొంది.
అయితే, జరగండి పాట వాయిదాకు వేరే కారణం ఉందన్న పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. జరగండి పాటకు సింగర్‌ను మార్చడమే కారణమని సమాచారం బయటికి వచ్చింది. జరగండి పాటను సింగర్ పాడిన విధానం మూవీ యూనిట్‍కు సంతృప్తికరంగా అనిపించలేదట. దీంతో వేరే సింగర్‌తో పాటను పాడించాలని మూవీ యూనిట్ నిర్ణయించటంతోనే జరగండి సాంగ్ రిలీజ్ వాయిదా పడిందనే విషయం చక్కర్లు కొడుతోంది.
జరగండి పాటను పంజాబీ రాక్ సింగర్ దలేర్ మెహందీతో పాడించాలని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. అయితే, పాట రికార్డింగ్ చేసేందుకు వరుస హాలీడేస్ ఇబ్బందిగా మారాయట. దీంతో జరగండి పాట రావడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ పాటలో ఫీమేల్ వోకల్స్ పాడనున్నారు గీతామాధురి.
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి జరగండి పాట కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో లీకైంది. ఈ సాంగ్‍పై చాలా మంది పెదవి విరిచారు. అయితే, అది ఫైనల్ వెర్షన్ కాదని మేకర్స్ స్పష్టం చేశారు. ఇక ఈ పాట లీకేజీకి పాల్పడిన ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు.
ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత రామ్‍చరణ్ చేస్తున్న సినిమా కావటంతో గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాజకీయాల నేపథ్యంలో డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దిల్‍రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. 2024లో గేమ్ ఛేంజర్ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.