Family Star day 5 box office collection: ఉగాది రోజు పండగ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. భారీగా పెరిగిన వసూళ్లు
Family Star day 5 box office collection: ఉగాది రోజు నిజంగానే పండగ చేసుకుంది ఫ్యామిలీ స్టార్ మూవీ. తొలి రోజు తర్వాత వరుసగా పడిపోతూ వస్తున్న కలెక్షన్లు ఐదో రోజు మళ్లీ పెరిగాయి.
Family Star day 5 box office collection: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఐదో రోజు కలెక్షన్లు భారీగా పెరిగాయి. మిక్స్‌డ్ టాక్ కారణంగా ఫస్ట్ వీకెండ్ తోపాటు సోమవారం కలెక్షన్లు పడిపోగా.. ఉగాది హాలిడే అయిన మంగళవారం (ఏప్రిల్ 9) మాత్రం ఈ మూవీ మరోసారి దుమ్ము రేపింది. పలుచోట్లు హౌజ్ ఫుల్ బోర్డులు కూడా కనిపించాయి.
ఫ్యామిలీ స్టార్ బాక్సాఫీస్ కలెక్షన్లు
ఫ్యామిలీ స్టార్ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా మంచి ఓపెనింగ్స్ తో మొదలైనా.. తర్వాత మిక్స్‌డ్ టాక్, నెగటివ్ రివ్యూల వల్ల భారీగా నష్టపోయింది. తర్వాత మూడు రోజులు సినిమా కలెక్షన్లు పడిపోతూ వచ్చాయి. అయితే ఉగాది పండగ రోజు మాత్రం ఈ మూవీ ఏకంగా రూ.2.4 కోట్లు వసూలు చేయడం విశేషం. నాలుగో రోజైన సోమవారం సినిమా వసూళ్లు కేవలం రూ.1.15 కోట్లుగా ఉండగా.. మరుసటి రోజు అంతకు రెట్టింపు కలెక్షన్లు వచ్చాయి.
బాక్సాఫీస్ రిపోర్టు ట్రాక్ చేసే sacnilk.com ప్రకారం.. ఈ ఫ్యామిలీ స్టార్ ఐదు రోజులు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.24.75 కోట్లు వసూలు చేసింది. అయితే ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలోనే నిలిచిపోయింది. గురువారం (ఏప్రిల్ 11) రంజాన్, ఆ తర్వాత సెకండ్ శాటర్ డే, సండే హాలిడేస్ ఉండటంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఫ్యామిలీ స్టార్ వసూళ్లు తక్కువే
విజయ్ దేవరకొండ నటించిన ఈ ఫ్యామిలీ స్టార్ సుమారు రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం మాత్రం అంత సులువైన పనిలా కనిపించడం లేదు. ఇండియాలో ఇప్పటి వరకూ తెలుగు, తమిళ వెర్షన్లు కలిపి ఈ సినిమా రూ. 16 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో మరో రూ.9 కోట్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ కు ఇంకా చాలా దూరంలోనే ఉంది.
ఐదో రోజు ఫ్యామిలీ స్టార్ ఆక్యుపెన్సీ 24.77 శాతంగానే ఉన్నా.. కలెక్షన్లు మాత్రం భారీగా పెరిగాయి. అయితే తొలి షో నుంచే వచ్చిన నెగటివ్ టాక్ మాత్రం సినిమాను బాగానే దెబ్బ తీసినట్లు స్పష్టమవుతోంది. విజయ్ కెరీర్లో మరో ఫెయిల్యూర్ గా ఈ సినిమా నిలిచిపోనుంది. నెగటివ్ రివ్యూలపై నిర్మాత దిల్ రాజు కూడా ఈ మధ్యే స్పందించిన విషయం తెలిసిందే.
వీటి ప్రభావం నిర్మాతలు, ఇండస్ట్రీపై పడుతోందని, మూడు రోజుల వరకు రివ్యూలు రాకుండా చూడాలని అతడు కోరడం గమనార్హం. అయితే మేకర్స్ తమ మూవీ చాలా బాగుందని చెబుతూనే ఉన్నా.. చూసిన వాళ్లలో చాలా మంది పెదవి విరుస్తున్నారు. మరోవైపు టిల్లూ స్క్వేర్, మంజుమ్మల్ బాయ్స్ సినిమాల నుంచి కూడా గట్టి పోటీ ఉంది. లైగర్, ఖుషీలాంటి ఫ్లాపుల తర్వాత ఫ్యామిలీ స్టార్ పై విజయ్ భారీ ఆశలే పెట్టుకున్నా.. చివరికి నిరాశనే మిగిల్చింది.