Ravi Teja Eagle: అందుకోసం 17 రాత్రుళ్లు పట్టింది.. 400 మంది ఇబ్బందిపడ్డారు: రవితేజ ఈగల్ డైరెక్టర్
Karthik Gattamneni About Ravi Teja Eagle Movie: మాస్ మహరాజా రవితేజ నటించిన లేటెస్ట్ హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ఈగల్ మూవీలోని ఓ సీన్ కోసం ఏకంగా 17 రాత్రుళ్లు పట్టిందని, దానికి 400 మందిని ఇబ్బంది పెట్టినట్లు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెలిపాడు. మరి ఆ సీన్ ఏంటనే విషయంలోకి వెళితే..
Karthik Gattamneni Ravi Teja Eagle: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ చిత్రం ఈగల్. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈగల్ మూవీ ఇవాళ అంటే శుక్రవారం (ఫిబ్రవరి 9) నాడు థియేటర్లలో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈగల్ మూవీకి సంబంధించిన హైలెట్ అంశాలను డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని పంచుకున్నారు.
ఈగల్ ఎలా ఉండబోతుంది ?
ఈగల్ కాన్సెప్ట్‌లోనే విధ్వంసం ఉంది. ఇది లార్జర్ దెన్ లైఫ్ ఎంటర్ టైనర్. అతని విధ్వంసం సమాజం కోసమే. అదేమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో కథానాయకుడు పత్తిపండించే రైతులా ఉంటారు. అయితే అతను పోరాడుతున్న సమస్య అంతర్జాతీయంగా ఉండేది. మనకి కూడా రిలవెంట్‌గా ఉంటుంది. రాంబో, టెర్మినేటర్ లాంటి సినిమాలని చాలా ఎంజాయ్ చేస్తాం. అలాంటి ఒక సినిమా తీసుకురావాలనే ప్రయత్నం. ఈగల్ అద్భుతమైన యాక్షన్ డ్రామా ఎంటర్ టైనర్. ఖచ్చితంగా ప్రేక్షకులకు చాలా ఎంజాయ్ చేస్తారు.
దర్శకుడిగా రెండో సినిమానే ఇంత పెద్ద యాక్షన్ చేయడం ఎలా అనిపించింది ?
నాకు ముందు నుంచి యాక్షన్ సినిమాలు చేయడం ఇష్టం. అయితే కెరీర్ బిగినింగ్‌లో కొన్ని పరిమితులు ఉంటాయి. ఇప్పుడు ఈగల్‌తో పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. రవితేజ గారితో 'ధమాకా' సినిమాకి కెమరామెన్‌గా పని చేస్తున్న సమయంలో ఈ కథ ఆయనకి చెప్పాను. ఆయన కథ విన్న వెంటనే ..''ఇది మంచి కమర్షియల్ సినిమా.. చేసేద్దాం'' అన్నారు.
నాకు నచ్చిన పాత్ర చేశానని రవితేజ గారు చెప్పడం ఎలా అనిపించింది?
రవితేజ గారు బ్రిలియంట్ యాక్టరని అందరికీ తెలుసు. కానీ, కొన్ని సార్లు కమర్షియల్ రీజన్స్ వలన ఒకే సినిమాలో కామెడీ డ్యాన్స్ యాక్షన్ ఇలా చాలా రకాలు చేయాల్సివస్తుంది. ఈగల్‌లో మాత్ర ఆయన ఒక క్యారెక్టర్‌లానే కనిపిస్తారు. ఆ తేడా చూసే ప్రేక్షకులకు అర్ధమౌతుంది. ఇంటెన్స్ గా ఉంటూ కూల్ గా ఉండటం ఆయనలో డిఫరెంట్ క్యాలిటీ. రవితేజ గారి ఎనర్జీ లెవెల్స్ ఒక ఎత్తు.. అయితే ముఖ్యంగా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ. ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన నటుడు. ఆయన ఆహారపు అలవాట్లు, నిద్రపోయే వేళలు పర్ఫెక్ట్ గా ఉంటాయి. చాలా ఆనందమైన జీవితం గడుపుతుంటారు. సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువ ఉన్న మనిషి.
ఈగల్‌లో మీకు సవాల్‌గా అనిపించిన అంశాలు ఏమిటి ?
ఫిల్మ్ మేకింగ్‌లో లోతుగా వెళ్లే కొద్ది సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. మనకి ఉన్న అనుభవంతో ఐదు రోజుల్లో ఓ సీక్వెన్స్‌ని పూర్తి చేసేస్తామని అనుకుంటాం. కానీ, అనుకున్న సమయానికి ఫినిష్ కాదు. ఈగల్‌లో క్లైమాక్స్ ఎపిసోడ్‌ని వారం రోజుల్లో తీసేయొచ్చు అనుకున్నాను. కానీ, అది 17 రాత్రుళ్లు పట్టింది. దాని కోసం అన్ని రియల్ ఎఫెక్ట్స్ ప్రయత్నించాం. ఈ క్రమంలో దాదాపు నాలుగు వందల మందిని ఇబ్బంది పెట్టాను ( నవ్వుతూ). చాలా అద్భుతంగా వచ్చింది.