May Tollywood Box Office Results: మే నెల టాలీవుడ్ రిజల్ట్ - డబ్బింగ్ సినిమాలు హిట్టు - స్ట్రెయిట్ మూవీస్ ఫట్టు
May Tollywood Box Office Results: మే నెల టాలీవుడ్‌కు అచ్చిరాలేదు. ఈ నెలలో స్ట్రెయిట్ సినిమా ఒక్కటి కూడా కమర్షియల్ సక్సెస్ దక్కించుకోలేపోయాయి. మరోవైపు డబ్బింగ్ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి.
May Tollywood Box Office Results: మే నెల టాలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు చేదు జ్ఞాపకాల్నే మిగిల్చింది. పదుల సంఖ్యలో స్ట్రెయిట్ సినిమాలు రిలీజైనా ఒక్కటంటే ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టలేకపోయింది. మరోవైపు డబ్బింగ్ సినిమాలు మాత్రం కాసుల వర్షాన్ని కురిపించాయి. ఈ నెలలో మొత్తంగా రెండు సినిమాలు మాత్రమే ప్రొడ్యూసర్స్‌కు లాభాల్ని మిగిల్చాయి. ఆ రెండింటిలో ఒకటి తమిళ డబ్బింగ్ మూవీ కాగా మరొకటి మలయాళ డబ్బింగ్ మూవీ కావడం గమనార్హం. ఆ సినిమాలు ఏవంటే...
ఫస్ట్‌హాఫ్ అట్టర్‌ఫ్లాప్
మే మంత్ ఫస్ట్ హాఫ్ డిజాస్టర్స్‌తో డీలా పడింది. మొదటి వారంలో గోపీచంద్ రామబాణంతో పాటు అల్లరి నరేష్ ఉగ్రం సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. రామబాణం డిజాస్టర్‌గా నిలవగా ఉగ్రం మంచి సినిమా అని పేరొచ్చిన డబ్బులు మాత్రం రాబట్టలేకపోయింది.
మే నెలలో తెలుగు ప్రేక్షకుల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తించిన సినిమాల్లో కస్టడీ ఒకటి. వెంకట్ ప్రభు దర్శకత్వంలో మే 12న రిలీజైన ఈ బైలింగ్వల్ మూవీ నాగచైతన్యకు నిరాశనే మిగిల్చింది. కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడంతో అంచనాల్ని అందుకోలేక బోల్తాపడింది.
కస్టడీతో పాటు అదే రోజున రిలీజైన శ్రియా మ్యూజిక్ స్కూల్, సునీల్ భువన విజయం పట్టుమని మూడు రోజుల కూడా థియేటర్లలో నిలబడలేకపోయాయి.
సెకండ్‌హాఫ్ డబ్బింగ్ సినిమాలదే...
సంతోష్‌శోభన్ హీరోగా నందినిరెడ్డి దర్శకత్వంలో మే 18న ప్రేక్షకుల ముందుకొచ్చిన అన్నీ మంచిశకునములే ప్రమోషన్స్, ట్రైలర్, టీజర్స్‌తో తెలుగు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని కలిగించింది. రోటీన్ కాన్సెప్ట్ కారణంగా ఆ బజ్ కూడా సినిమాను కాపాడలేకపోయింది. అదే వారంలో రిలీజైన విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 మాత్రం బాక్సాఫీస్ వద్ద సర్‌ప్రైజ్ హిట్‌గా నిలిచింది.
బిచ్చగాడు ఫస్ట్ పార్ట్‌కు ఉన్న క్రేజ్ క్యాష్ చేసుకుంటూ మాస్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే కథాంశంతో విజయ్ ఆంటోనీ తెరకెక్కించిన ఈ సినిమా మే నెలలో టాలీవుడ్‌లో ఫస్ట్ హిట్‌గా నిలిచింది. ఆరు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రిలీజైన ఈ మూవీ 15 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. లాస్ట్‌వీక్‌లో మళ్లీ పెళ్లి, మేమ్‌ఫేమస్ లాంటి స్ట్రెయిట్ సినిమాలతో పాటు మలయాళ రీమేక్ 2018 కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఇందులో మళ్లీ పెళ్లిని ప్రేక్షకులు తిరస్కరించగా 2018 మాత్రం అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టి మే నెలలో సెకండ్ హిట్‌గా నిలిచింది. రెండు కోట్ల ప్రీ రిలీజ్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే ఐదు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది.
మేమ్ ఫేమస్ ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగానే రాబట్టిన సెకండ్ డే నుంచి నెగెటివ్ టాక్ కారణంగా వసూళ్లు డ్రామ్ కావడంతో లాభాల బాట మాత్రం పట్టలేదు. సోమవారం కలెక్షన్స్‌పైనే మేమ్ ఫేమస్ హిట్టవుతుందా, ఫట్టవుతుందా అన్నది తేలనుంది. మూడు రోజుల్లో దాదాపు మూడు కోట్ల కలెక్షన్స్ వరకు ఈ సినిమా రాబట్టడం గమనార్హం.