Mem Famous Movie Review: మేమ్ ఫేమ‌స్ మూవీ రివ్యూ - సుమంత్ ప్ర‌భాస్ యూత్‌ఫుల్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?-mem famous movie review sumanth prabhas comedy entertainer movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mem Famous Movie Review: మేమ్ ఫేమ‌స్ మూవీ రివ్యూ - సుమంత్ ప్ర‌భాస్ యూత్‌ఫుల్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Mem Famous Movie Review: మేమ్ ఫేమ‌స్ మూవీ రివ్యూ - సుమంత్ ప్ర‌భాస్ యూత్‌ఫుల్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
May 26, 2023 06:34 AM IST

Mem Famous Movie Review: సుమంత్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మేమ్ ఫేమ‌స్ మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే....

మేమ్ ఫేమ‌స్ మూవీ
మేమ్ ఫేమ‌స్ మూవీ

Mem Famous Movie Review: సినిమా : మేమ్ ఫేమ‌స్‌

న‌టీన‌టులు: సుమంత్ ప్రభాస్,మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, అంజిమామ, శివ నందన్

రచన, దర్శకత్వం: సుమంత్ ప్రభాస్

నిర్మాతలు: అనురాగ్ రెడ్డి,శరత్ చంద్ర, చంద్రు మనోహర్

బ్యానర్లు: చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్

సంగీతం: కళ్యాణ్ నాయక్

డీవోపీ: శ్యామ్ దూపాటి

ఈ మ‌ధ్య‌కాలంలో ప్ర‌మోష‌న్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో అత్యంత ఆస‌క్తిని రేకెత్తించిన చిన్న సినిమాల్లో మేమ్ ఫేమ‌స్(Mem Famous Movie) ఒక‌టి. సుమంత్ ప్ర‌భాస్ (Sumanth Prabhas) హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మేమ్ ఫేమ‌స్ మూవీ ఈ శుక్ర‌వారం (నేడు) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

ఈ సినిమాలో సార్య‌ల‌క్ష్మ‌ణ్‌, మ‌ణి ఎగుర్ల, మౌర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన మేమ్ ఫేమ‌స్‌ మూవీ ఎలా ఉంది? ఈ చిన్న సినిమాతో హీరోగా, ద‌ర్శ‌కుడిగా సుమంత్ ప్ర‌భాస్ తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించాడా? లేదా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే…

ముగ్గురు స్నేహితుల క‌థ‌...

బండ‌న‌ర్సంప‌ల్లికి చెందిన మ‌హేష్ (సుమంత్ ప్ర‌భాస్), దుర్గ (మ‌ణి ఎగుర్ల‌), బాల‌కృష్ణ (మౌర్య‌) ప్రాణ స్నేహితులు. చిన్న‌త‌నం నుంచి క‌లిసే పెరుగుతారు. ఊళ్లో ఏ ప‌నిపాట లేకుండా ప్ర‌తి ఒక్క‌రితో గొడ‌వ‌లు ప‌డుతూ ముగ్గురు బ‌లాదూర్‌గా తిరుగుతుంటారు. ఊరివాళ్ల‌తో పాటు కుటుంబ‌స‌భ్యులు కూడా వారిని ద్వేషిస్తుంటారు.

కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా సొంత ఊళ్లోనే గౌర‌వంగా బ‌త‌కాల‌ని అనుకున్న మ‌హేష్‌, దుర్గ‌, బాల‌కృష్ణ సొంతంగా టెంట్‌హౌజ్ పెడ‌తారు. కానీ అగ్ని ప్ర‌మాదంలో టెంట్‌హౌజ్ కాలిపోతుంది. అప్పు భారం మీద ప‌డుతుంది. ఆ అప్పు తీర్చ‌డంతో పాటు ఫేమ‌స్ కావ‌డానికి యూట్యూబ్ వీడియోలు తీయ‌డం మొద‌లుపెడ‌తారు. ఫేమ‌స్ కావాల‌నే ఆ ముగ్గురు యువ‌కుల క‌ల నెర‌వేరిందా?

మ‌హేష్‌, దుర్గ‌ల‌ను వ‌దిలిపెట్టి తాను ప్రేమించిన బ‌బ్బీ కోసం సిటీకి వెళ్లిని బాల‌కృష్ణ మ‌ళ్లీ ఊళ్లోకి తిరిగివ‌చ్చాడా? ఆ ఊరిలోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి మ‌ర‌ద‌లు మౌనిక‌ను పెళ్లి చేసుకుంటాన‌ని మామ‌తో చేసిన ఛాలెంజ్‌లో మ‌హేష్ నెగ్గాడా? లేదా? అన్న‌దే ఈ(Mem Famous Movie Review) సినిమా క‌థ‌.

Mem Famous analysis -యూత్‌ను ఎంక‌రేజ్ చేయాలి....

యూత్‌ను నిరుత్సాహ‌ప‌ర‌చ‌కుండా వారిలోని టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తే అద్భుతాలు సృష్టిస్తార‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు సుమంత్ ప్ర‌భాస్ ఈ క‌థ‌ను రాసుకున్నారు. సోష‌ల్ మీడియా, యూట్యూబ్ ద్వారా త‌క్కువ టైమ్‌లోనే పాపుల‌ర్ అయిన కొంత‌మంది ప‌ల్లెటూరి యువ‌తీయువ‌కుల‌ జీవితాల‌ను స్ఫూర్తిగా తీసుకొని సుమంత్ ప్ర‌భాస్‌ ఈ క‌థ‌ను రాసుకున్న‌ట్లుగా క‌నిపించింది.

చిన్న పాయింట్ చుట్టూ వినోదంతో పాటు ప్రేమను అల్లుకుంటూ మేమ్ ఫేమ‌స్ సినిమాను తెర‌కెక్కించాడు. సినిమా కంప్లీట్‌గా రియ‌లిస్టిక్ అప్రోచ్‌లో సాగ‌డం పెద్ద ప్ల‌స్‌గా నిలిచింది. హీరోహీరోయిన్ల‌తో పాటు సినిమాలో క‌నిపించే ప్ర‌తి పాత్ర ప‌ల్లెటూళ్ల‌లో మ‌నం చూసే వ్య‌క్తులను పోలి ఉంటాయి. డైలాగ్స్ విష‌యంలో సినిమాటిక్‌గా కాకుండా స‌హ‌జ‌త్వానికే ఇంపార్టెన్స్ ఇచ్చారు.

బావామ‌ర‌ద‌ళ్ల ప్రేమ‌...

మ‌హేష్‌, దుర్గ‌, బాల‌కృష్ణ జులాయిగా తిర‌గ‌డం, వారి ఎంజాయ్‌మెంట్‌, గొడ‌వ‌ల‌తో ఆరంభ స‌న్నివేశాల నుంచి ఫ‌న్ చ‌క్క‌గా వ‌ర్క‌వుట్ అయ్యింది. ప‌రిస్థితుల ప్ర‌భావంతో రియ‌లైజ్ అయిన ముగ్గురు టెంట్‌హౌజ్ న‌డ‌ప‌డం, అందులో ఎదుర‌య్యే ఇబ్బందుల‌లో ఎమోష‌న్స్ పండాయి.

సెకండాఫ్ యూట్యూబ్ వీడియోలు తీయ‌డానికి వారు ప‌డే క‌ష్టాల‌న్నీ న‌వ్వుల‌ను పంచాయి. మెయిన్ స్టోరీతో స‌మానంగా బావామ‌ర‌ద‌ళ్ల ప్రేమ‌క‌థ‌ను న‌డిపించ‌డం బాగుంది. ల‌వ్‌స్టోరీకి, హీరో ల‌క్ష్యాన్ని లింక్ చేసే ప్రీ క్లైమాక్స్ స‌న్నివేశాల్లో ద‌ర్శ‌కుడు టాలెంట్ క‌నిపించింది. సెకండాఫ్‌లో గోర‌టి వెంక‌న్న సాంగ్ కూడా సినిమాకు హెల్ప‌యింది.

స్ట్రాంగ్ ఎమోష‌న్ మిస్‌...

మేమ్ ఫేమ‌స్ క‌థ‌లో స్ట్రాంగ్ ఎమోష‌న్ లేదు. ఫ‌స్ట్‌హాఫ్ మొత్తం రిపీటెడ్ సీన్స్‌తో ఒకే పాయింట్ చుట్టూ క‌థ సాగిన ఫీలింగ్ క‌లుగుతుంది. సెకండాఫ్‌లో యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోల తీయ‌డానికి హీరో అంట్ టీమ్ చేసే స‌న్నివేశాలు న‌త్త‌న‌డ‌క‌న సాగుతూ బోర్ కొట్టిస్తాయి.

ఇలాంటి సినిమాల‌కు కామెడీనే ప్ర‌ధాన బ‌లం. అక్క‌డ‌క్క‌డ మెరుపులు త‌ప్పితే స్టార్టింగ్ టూ ఎండింగ్ వ‌ర‌కు న‌వ్వించ‌డంతో సుమంత్ ప్ర‌భాస్ విఫ‌ల‌మ‌య్యాడు. క్లైమాక్స్(Mem Famous Movie Review) హ‌డావిడిగా ముగించిన‌ట్లు అనిపిస్తుంది.

మ‌హేష్ పాత్ర‌లో...

మ‌హేష్ అనే యువ‌కుడిగా సుమంత్ ప్ర‌భాస్ యాక్టింగ్ మేన‌రిజ‌మ్స్ బాగున్నాయి. అత‌డి స్నేహితులుగా న‌టించిన మ‌ణి ఎగుర్ల‌, మౌర్య స‌హ‌జ న‌ట‌న‌ను క‌న‌బ‌రిచారు. హీరో మ‌ర‌ద‌లిగా సార్య ల‌క్ష్మ‌ణ్‌, బ‌బ్బీగా సిరా రాశి త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ముర‌ళీధ‌ర్‌గౌడ్‌, అంజిమామ‌, న‌రేంద్ర‌ర‌వి కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నారు.

Mem Famous Movie Review- టైమ్‌పాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌...

మేమ్ ఫేమ‌స్ టైమ్‌పాస్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌. క‌థ కంటే కామెడీ మీద‌నే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టి తీసిన సినిమా ఇది. లాజిక్స్‌, స్టోరీ గురించి ఆలోచించ‌కుండా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను కోరుకునే వారిని ఈ సినిమా మెప్పిస్తుంది.

రేటింగ్: 2.5/5

IPL_Entry_Point