OTT Comedy Web Series: పాపులర్ కామెడీ వెబ్ సిరీస్‍కు రెండో సీజన్ వచ్చేస్తోంది.. వివరాలివే-comedy drama web series arthamayyindha arun kumar sequel coming on aha ott check details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Comedy Web Series: పాపులర్ కామెడీ వెబ్ సిరీస్‍కు రెండో సీజన్ వచ్చేస్తోంది.. వివరాలివే

OTT Comedy Web Series: పాపులర్ కామెడీ వెబ్ సిరీస్‍కు రెండో సీజన్ వచ్చేస్తోంది.. వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 24, 2024 08:32 PM IST

Arthamayyindha Arun Kumar 2 OTT Web Series: అర్థమైందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్‍కు రెండో సీజన్ రెడీ అవుతోంది. ఈ విషయంపై అధికారిక అప్‍డేట్ వచ్చింది. తొలి సీజన్ పాపులర్ కావటంతో రెండో సీజన్‍పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

OTT Comedy Web Series: పాపులర్ కామెడీ వెబ్ సిరీస్‍కు రెండో సీజన్ వచ్చేస్తోంది.. వివరాలివే
OTT Comedy Web Series: పాపులర్ కామెడీ వెబ్ సిరీస్‍కు రెండో సీజన్ వచ్చేస్తోంది.. వివరాలివే

తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’ మంచి సక్సెస్ సాధించింది. హర్షిత్ రెడ్డి, 30 వెడ్స్ 21 ఫేమ్ అనన్య శర్మ, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ బాగా పాపులర్ అయింది. గతేడాది జూన్ 30వ తేదీన ఈ సిరీస్ ఆహా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చింది. న్యూఏజ్ కామెడీతో ఆకట్టుకుంది. ఇప్పుడు, ఈ అర్థమైందా అరుణ్ కుమార్ రెండో సీజన్ వస్తోంది.

అప్‍డేట్ ఇదే

అర్థమైందా అరుణ్ కుమార్ 2 సీజన్‍పై ఆహా అప్‍డేట్ ఇచ్చింది. త్వరలో స్ట్రీమింగ్‍కు రానుందంటూ ఓ పోస్టర్ తీసుకొచ్చింది. అయితే, స్ట్రీమింగ్ డేట్‍ను ఇంకా వెల్లడించలేదు. ఇతర వివరాలను కూడా ఇప్పుడు ప్రకటించలేదు.

అర్థమైందా అరుణ్ కుమార్ రెండో సీజన్‍పై త్వరలోనే ఆహా ఓ టీజర్ తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనిద్వారానే స్ట్రీమింగ్‍పై క్లారిటీ ఇవ్వనుంది. అలాగే, తొలి సీజన్‍లో లేని కొత్త నటీనటులు ఎవరైనా ఉంటారా అనేది చూడాలి.

అర్థమైందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్‍కు జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించారు. ఓ ఊరు నుంచి హైదరాబాద్‍కు వచ్చి.. బడా కార్పొరేట్ ఆఫీస్‍లో తిప్పలు పడే యువకుడి చుట్టూ ఈ సిరీస్ తొలి సీజన్ సాగింది. కార్పొరేట్ లైఫ్‍ ఎలా ఉంటుందనేది డైరెక్టర్ చూపించారు. దీంతో ఈ సిరీస్ చాలా మందికి కనెక్ట్ అయింది. మంచి వ్యూస్ దక్కించుకుంది. దీంతో రెండో సీజన్‍ను కూడా ఆహా తీసుకొస్తోంది.

అర్థమైందా అరుణ్ కుమార్ తొలి సీజన్‍లో హర్షిత్, అనన్య, తేజస్వితో పాటు వాసు ఇంటూరి, జై ప్రవీణ్, శ్రావ్య మృధుల కీలకపాత్రలు పోషించారు. అరీ స్టూడియోస్, లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్ బ్యానర్లపై బి.సాయికుమార్, తన్వి దేశాయ్ ప్రొడ్యూజ్ చేశారు. అజయ్ అరసాద సంగీతం అందించిన ఈ సిరీస్‍కు అమర్‌దీప్ గుట్టల సినిమాటోగ్రఫీ చేశారు.

అర్థమైందా అరుణ్ కుమార్ ఫస్ట్ సీజన్ ఇలా..

తన కలలను నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో అమలాపురం నుంచి హైదరాబాద్‍కు వస్తాడు అరుణ్ కుమార్ (హర్షిత్ రెడ్డి). ఓ ఐటీ కంపెనీలో ఇంటర్న్ ఉద్యోగిగా జాయిన్ అవుతాడు. కార్పొరేట్ లైఫ్‍లో అడుగుపెడతాడు. అరుణ్‍ను టీమ్ లీడర్ బానిసలా చూస్తుంటాడు. ఈ క్రమంలో పల్లవి (అనన్య శర్మ)తో అరుణ్ ప్రేమలో పడతాడు. అయితే, షాలినీ (తేజస్వి మదివాడ) టీమ్‍లోకి అరుణ్ వెళ్లటంతో పరిస్థితి మారిపోతుంది. షాలినీతో రిలేషన్‍లోకి అరుణ్ వెళతాడు. షాలినీ కొంతకాలానికి అతడిని వదిలేయాలని నిర్ణయించుకుంటుంది. అరుణ్ కార్పొరేట్ ఆఫీస్‍లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? షాలినీతో పరిచయంతో పల్లవితో ప్రేమ వ్యవహారం ఏమైంది? అరుణ్, పల్లవి మళ్లీ కలిశారా? అనే విషయాల చుట్టూ అర్థమైందా అరుణ్ కుమార్ తొలి సీజన్ సాగింది.

అర్థమైందా అరుణ్ కుమార్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఎక్కువ మంది యూత్ కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సిరీస్‍లో ఉన్నాయి. నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా మెప్పించింది. అయితే, ఎమోషనల్‍ విషయాల్లో ఈ సిరీస్ అంత వర్కౌట్ కాలేదు.

కాగా, ఆహా ఓటీటీలో ఈ శుక్రవారం సెప్టెంబర్ 27వ తేదీన ప్రతినిధి 2 చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. నారా రోహిత్ హీరోగా నటించిన ఈ పొటిలికల్ థ్రిల్లర్ చిత్రం థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.