Ardhamaindha Arun Kumar Web Series Review: అర్ధమయ్యిందా అరుణ్‌కుమార్ వెబ్‌సిరీస్ రివ్యూ - కార్పొరేట్ కష్టాల కథ
Ardhamaindha Arun Kumar Web Series Review: అర్ధమయ్యిందా అరుణ్‌కుమార్ తెలుగు వెబ్‌సిరీస్ ఆహా ఓటీటీలో శుక్రవారం(జూన్ 30న) రిలీజైంది. ఈ సిరీస్‌లో హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ, తేజస్వి మదివాడ కీలక పాత్రలను పోషించారు.
Ardhamaindha Arun Kumar Web Series Review: హర్షిత్‌రెడ్డి (Harshith Reddy), అనన్య శర్మ, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెబ్‌సిరీస్ అర్ధమయ్యిందా అరుణ్‌కుమార్ ఆహా ఓటీటీలో (Aha OTT) శుక్రవారం (జూన్ 30న) రిలీజైంది. ఈ సిరీస్‌కు జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వం వహించాడు. హిందీలో విజయవంతమైన అఫీషియల్ చౌక్యగిరి ఆధారంగా అర్ధమయ్యిందా అరుణ్‌కుమార్ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు. ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ తెలుగు వెబ్ సిరీస్ (Telugu Web Series) ఎలా ఉందంటే...
అరుణ్‌కుమార్ కల...
అరుణ్‌కుమార్ (హర్షిత్‌రెడ్డి) అమలాపురం కుర్రాడు. కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేయాలన్నది అతడి లక్ష్యం. ఆ కలను నెరవేర్చుకోవడానికి హైదరాబాద్‌కు వస్తాడు. ఓ స్టార్టప్ కంపెనీలో జాబ్ దొరుకుతుంది. అరుణ్‌ను అతడి టీమ్ లీడ్ జై ఓ బానిసలా ట్రీట్ చేస్తాడు. తన పర్సనల్ పనులను అరుణ్‌తో చేయించుకుంటుంటాడు.
అదే ఆఫీస్‌లో పనిచేసే షాలిని (తేజస్వి మదివాడ) టీమ్‌లో పనిచేసే అవకాశం అరుణ్‌కు వస్తుంది. తన ఆలోచనావిధానం, ఐడియాలజీతో కొద్ది రోజుల్లోనే షాలిని దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాడు అరుణ్. ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా రిలేషన్‌షిప్ బలపడుతుంది.
షాలిని టీమ్‌లోనే పనిచేసే పల్లవి...అరుణ్‌ను ప్రేమిస్తుంది. అరుణ్ కూడా పల్లవిని ఇష్టపడతాడు కానీ . షాలిని కారణంగా పల్లవి జాబ్‌పోతుంది. అలా ఎందుకు జరిగింది? షాలిని, పల్లవిలలో అరుణ్ ఎవరిని ప్రేమించాడు? అరుణ్ కోరుకున్నట్లుగా అతడి జాబ్ పర్మినెంట్ అయ్యిందా? అరుణ్ మంచితనాన్ని జై తో పాటు షాలిని ఎలా వాడుకున్నారు? అన్నదే అర్ధమైందా అరుణ్‌కుమార్ వెబ్‌సిరీస్ కథ.
హిందీ సిరీస్ రీమేక్...
హిందీలో ప్రేక్షకుల మన్ననల్ని అందుకున్న అఫీషియల్ చౌక్యాగిరి అనే వెబ్‌సిరీస్ ఆధారంగా అర్ధమైందా అరుణ్‌కుమార్ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు దర్శకుడు జోనాథన్ ఎడ్వర్డ్స్. కార్పొరేట్ వరల్డ్‌లో ఓ సామాన్య యువకుడికి ఎదురైన సమస్యలు, వృత్తి నిర్వహణలో అతడు ఎదుర్కొన్న సంఘర్షణను ఎంటర్‌టైనింగ్‌గా ఈ సిరీస్‌లో చూపించారు. ఈ సింపుల్ పాయింట్‌కు ఓ ట్రాయాంగిల్ లవ్‌స్టోరీతో చిన్న సందేశాన్ని జోడించి సీజన్ వన్‌ను ఎండ్‌చేశారు.
షుగర్ కోటేడ్‌లా...
ఇంటర్న్‌గా జాయినైన అరుణ్‌కుమార్ మూడు నెలలటైమ్‌లోనే ఎలా పర్మినెంట్ ఎంప్లాయ్‌గా మారాడన్నది క్లుప్లంగా ఫస్ట్ సీజన్ కథ. ఈ టైమ్ పీరియడ్‌లో తన కలల సాధన కోసం అతడు ఏం చేశాడు?ఈ క్రమంలో ఏం కోల్పోయాడు అన్నది ఎమోషన్స్, ఫన్ రెండింటిద్వారా ఎక్కడ బోర్ కొట్టకుండా చెప్పడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఎక్కువగా డెప్త్‌గా వెళ్లకుండా సహజంగా లైటర్‌వేలోనే సిరీస్‌ను నడిపించడం బాగుంది. మెసేజ్ కూడా షుగర్ కోటేడ్‌లా సింపుల్‌గా ఉండేలా జాగ్రత్తపడ్డాడు తప్పితే లెక్చర్స్ ఇవ్వలేదు. అయితే కొన్ని చోట్ల అదే మైనస్‌గా కూడా మారింది.
లవ్‌స్టోరీ...
ఎన్నో కలలతో ఆఫీస్‌లో అడుగుపెట్టిన అరుణ్‌కుమార్ టీ మాస్టర్‌గా మారిపోవడం, ఒక్క ప్రాజెక్ట్ వర్క్ అయినా అసైన్ చేయమని తోటి ఉద్యోగులను బతిమిలాడే సీన్స్‌లో ఫన్ బాగానే జనరేట్ అయ్యింది. ముఖ్యంగా తన పేరు కారణంగా అరుణ్ పడే తిప్పలు నవ్వించాయి. ఆఫీస్ డ్రామాకు సమాంతరంగా అరుణ్, పల్లవి లవ్‌స్టోరీని నడిపించారు.
షాలిని ఎంట్రీ...
ఆ తర్వాత షాలిని క్యారెక్టర్ ఎంట్రీతోనే కథలో కాస్త వేగం పెరుగుతుంది. అరుణ్ తెలివితేటల్ని గ్రహించిన షాలిని అతడి ఐడియాల్ని వాడుకోవడం, క్లోజ్‌గా మూవ్ అయ్యే సీన్స్ ఒకే అనిపిస్తాయి. వాటిని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా రాసుకుంటే బాగుండేది. షాలిని కారణంగా అరుణ్‌కు పల్లవి దూరమయ్యే సీన్ కూడా కన్వీన్సింగ్‌గా లేనట్లు అనిపించింది.
కార్పొరేట్ వరల్డ్‌లోని ఉద్యోగులు పడే స్ట్రగుల్స్, వారి మనస్తత్వాల రియలిస్టిక్‌గా ప్రజెంట్ చేయడంలో కాస్తంత క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నట్లుగా అనిపించింది. ఐదు ఎపిసోడ్స్ నిడివి తక్కువే ఉండటం అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ సిరీస్‌కు కూడా ప్లస్సయ్యింది. ప్రధాన పాత్రధారుల ఇంట్రడక్షన్స్, ఎలివేషన్స్‌తో పేరుతో టైమ్ వేస్ట్ చేయకుండా నేరుగా కథను మొదలపెట్టడం కూడా బాగుంది.
నాచురల్ యాక్టింగ్...
అరుణ్‌కుమార్‌గా హర్షిత్‌రెడ్డి తన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. నాచురల్ యాక్టింగ్‌ను కనబరిచాడు. పల్లవిగా అనన్య శర్మ సింపుల్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. ఇంకాస్త ఎమోషనల్‌గా ఆమె క్యారెక్టర్‌ను రాసుకుంటే బాగుండేది. షాలినిగా డామినేషన్, స్వార్థం కలబోసిన పాత్రలో తేజస్వి మదివాడ కనిపించింది. మిగిలిన వారిలో కాకా పాత్రలో వాసు ఇంటూరి ఎక్కువగా హైలైట్ అయ్యాడు. హిందీ, తెలుగు మిక్స్ చేస్తూ చెప్పే అతడి డైలాగ్స్ కొన్ని చోట్ల నవ్విస్తాయి.
Ardhamaindha Arun Kumar Web Series Review- టైమ్ పాస్ సిరీస్...
అర్ధమయ్యిందా అరుణ్‌కుమార్ పర్‌ఫెక్ట్ టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్ సిరీస్. ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే ట్విస్ట్‌లు, బుర్రకు పదునుపెట్టే పజిల్స్ లేకుండా ఎండింగ్ వరకు సరదాగా నవ్విస్తూ ఆహ్లాదంగా సాగిపోతుంది.
రేటింగ్: 3/5