City Hunter Review: సిటీ హంటర్ రివ్యూ.. ఓటీటీ లైవ్ యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
City Hunter Movie Review In Telugu: ఇటీవల ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన జపనీస్ మూవీ సిటీ హంటర్. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ 25న డైరెక్ట్ రిలీజ్ అయింది. మరి యాక్షన్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ఆకట్టుకుందా లేదా అనేది సిటీ హంటర్ మూవీ రివ్యూలో తెలుసుకుందాం.
City Hunter Review In Telugu: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ 25న నేరుగా విడుదలైన జపనీస్ సినిమా సిటీ హంటర్ (City Hunter 2024). లైవ్ యాక్షన్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఇదే టైటిల్‌తో ఇంతకుముందు వెబ్ సిరీస్ వచ్చింది. అది భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అనంతరం 2011లో అనైమ్ (యానిమేషన్‌లో ఇదొక రకం) సినిమాగా కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే మంచి ఆదరణ పొందింది.
ఇక తాజాగా నేరుగా ఓటీటీలోకి లైవ్ యాక్షన్ సినిమాగా సిటీ హంటర్‌ను తీసుకొచ్చారు. యూచి సాటో దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రోహీ సుజుకీ, మిసాటో మొరిటా, మసనోబు అండో, అసుకా హనమురా, మిసాకి అయామే తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి నేరుగా వచ్చిన ఈ లైవ్ యాక్షన్ క్రైమ్ కామెడీ సినిమా ఎలా ఉందో సిటీ హంటర్ రివ్యూలో (City Hunter Review 2024) తెలుసుకుందాం.
కథ:
టోక్యోలోని షింజుకు సిటీలో రియో సైబా (రోహీ సుజుకీ), తన బెస్ట్ ఫ్రెండ్ హిదేయుకి మకిమురా (మసనోబు అండో) కలిసి ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతుంటారు. వీరిని కాంటాక్ట్ కావడానికి సిటీలోని స్టేషన్‌లో ఉన్న ఓ బ్లాక్ బోర్డ్‌పై XYZ అని రాయాలి. అలా తప్పిపోయిన తన సోదరి కురుమి (అసుక హనమురా)ని వెతికిపెట్టమని రియోను కోరుతుంది. ప్లే బాయ్ అయిన రియో ఒప్పుకుంటాడు. మరోవైపు సిటీలో ప్రజలు ఓ డ్రగ్ ద్వారా ఊహించని విధంగా (జాంబీ తరహాలో) చనిపోతుంటారు.
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్
ఈ క్రమంలోనే తన బెస్ట్ ఫ్రెండ్ మకిమురాను తన సోదరి కౌరీ (మిసాటో మొరిటా) ముందే డ్రగ్ సోకిన వ్యక్తి హత్య చేస్తాడు. తన స్నేహితుడిని ఎందుకు చంపారు? దానికి కారణం ఏంటీ? కురుమి ఎవరు? తాను రియో నుంచి ఎందుకు పారిపోతుంటుంది? రియో, కౌరీ చేసిన ఇన్వెస్టిగేషన్ ఏంటీ? చివరికీ వీరు ఏం తెలుసుకున్నారు? అసలు మకిమురా ఎవరు? అతని తండ్రి గతం ఏంటీ? అందరూ విచిత్రంగా ప్రవర్తించడానికి గల కారణమైన ఏంజెల్ డస్ట్ అనే డ్రగ్ కథ ఏంటీ? దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటీ? వంటి థ్రిల్లింగ్ విషయాలు తెలియాలంటే సిటీ హంటర్ చూడాల్సిందే.
విశ్లేషణ:
సిటీ హంటర్ ఒక లైవ్ యాక్షన్ కామెడీ మూవీ. తన సోదరి కురుమి తప్పిపోయిందని చెప్పే సీన్‌తో సినిమా స్టార్ట్ అవుతుంది. ప్రారంభం కావడంతోనే మంచి యాక్షన్ సీక్వెన్స్‌తో వేగంగా కథలోకి వెళ్తుంది మూవీ. అంతేకాకుండా రియో సైబా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయ్యేలా ఓ సీన్ చూపిస్తూనే తన సామర్థ్యాలు ఏంటో యాక్షన్ సీక్వెన్స్‌తో చాలా బాగా అర్థమయ్యేలా చూపించారు. రియో నుంచి తాను కాపాడలనుకున్న కురుమి సూపర్ పవర్స్ ఉన్న వుమెన్‌లా పారిపోవడం, తన బ్యాగ్ నుంచి కొన్ని ఇంజెక్షన్స్ పడిపోవడంతో ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.
ఆకట్టుకునే ట్విస్ట్స్
మొదటి యాక్షన్ సీక్వెన్స్ పూర్తయ్యేలోపే అన్ని క్యారెక్టర్స్ గురించి ఎస్టాబ్లిష్ చేసేశారు. తర్వాత మకిమురా చనిపోవడం, తనకు తన సోదరి కౌరీకి ఉన్న అనుబంధంతో ఎమోషనల్ ట్రాక్ ఎక్కుతుంది. ఆ వెంటనే తన ప్లే బాయ్ చేష్టలతో, కామెడీతో రియో ఆకట్టుకోవడం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. స్టోరీ, అందులోని ట్విస్ట్స్ చాలా బాగున్నాయి. అయితే, కొన్ని చోట్ల మాత్రం సీన్లు గెస్ చేసేలా ఉన్నాయి. క్లైమాక్స్ పర్వాలేదు.
అదొక్కటే మైనస్
యాక్షన్ సీన్స్ మాత్రం హైలెట్ అని చెప్పొచ్చు. అయితే, కొంచెం ఓవర్ ది టాప్ అనిపిస్తాయి. సినిమా చూస్తున్నంతసేపు చియాన్ విక్రమ్ నటించిన ఇంకొక్కడు మూవీ గుర్తొస్తుంది. అయితే, ఈ 2016లో వచ్చిన ఈ మూవీ కంటే ముందే 2011లో అనైమ్ సినిమాగా సిటీ హంటర్ వచ్చింది. అదే స్టోరీతో మళ్లీ తీయడం, ఇదివరకు అదే కాన్సెప్ట్‌తో సినిమా చూడటం కాస్తా మైనస్ అనుకోవచ్చు.
మంచి టైమ్ పాస్ మూవీ
City Hunter Movie Review 2024: ఇక రియోగా నటించిన రోహీ సుజుకీ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ప్లే బాయ్‌గా, మంచి ఫ్రెండ్‌గా, కామెడీ పరంగా, యాక్షన్ సీన్స్‌లో ప్రతి ఒక్కదాంట్లో అదరగొట్టాడు. అతని స్క్రీన్ ప్రజన్స్ చాలా ఎంగేజ్ చేస్తుంది. ఇక మిగతా పాత్రలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే.. సిటీ హంటర్ మంచి టైమ్ పాస్ మూవీ. అయితే, భాషతో సంబంధం లేదనుకుంటే మాత్రం జపనీస్‌లో ఉన్న ఈ సిటీ హంటర్‌ను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఎంజాయ్ చేయొచ్చు.