Bollywood: బాలీవుడ్ క్లాసిక్ చిత్రానికి 27ఏళ్ల తర్వాత సీక్వెల్.. సంతోషంలో ఫ్యాన్స్
Border 2 - Sunny Deol: బార్డర్ చిత్రానికి ఎట్టకేలకు సీక్వెల్ వస్తోంది. ఈ బార్డర్ 2 మూవీని అధికారికంగా ప్రకటించారు హీరో సన్నీ డియోల్. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివరాలివే..
Border 2: బాలీవుడ్‍లో బార్డర్ సినిమా ఒకానొక గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. 1997లో రిలీజైన ఈ చిత్రం కమర్షియల్‍గా బంపర్ బ్లాక్‍బస్టర్ అవడంతో పాటు కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచింది. ఇండియా - పాకిస్థాన్ 1971 యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ ఎపిక్ వార్ చిత్రంలో సన్నీ డియోల్ హీరోగా నటించారు. బార్డర్ సినిమాలోని 'సందేశే ఆతే హై’ పాట ఇప్పటికీ అప్పుడప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత బార్డర్ చిత్రానికి సీక్వెల్ రావడం ఖరారైంది.
ప్రకటించిన సన్నీ డియోల్
బార్డర్ 2 సినిమాను సన్నీ డియోల్ నేడు (జూన్ 13) అధికారికంగా ప్రకటించారు. తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో ఓ వీడియో పోస్ట్ చేసి అనౌన్స్ చేశారు. “27 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట కోసం ఓ సైనికుడు మళ్లీ తిరిగి వచ్చేస్తున్నాడు. ఇండియా బెగ్గెస్ట్ వార్ సినిమా బార్డర్ 2 రానుంది” అని సన్నీ డియోల్ ప్రకటించారు. ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు.
బార్డర్ 2 మూవీ చిత్రానికి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. టీ సిరీస్, జేపీ ఫిల్మ్స్ పతాకాలపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ఇన్‍స్టాగ్రామ్‍లో వెల్లడించారు సన్నీ డియోల్.
బార్డర్ మూవీ గురించి..
బార్డర్ సినిమా 1997 జూన్ 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి జేపీ దత్తా దర్శకత్వం వహించారు. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సైనికుల దేశభక్తి, పోరాటంతో పాటు వారి ఇబ్బందులు, ఇంటికి దూరంగా ఉంటూ పడే వేదనను కూడా మేకర్స్ చూపించారు.
బార్డర్ అప్పట్లో సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది. రూ.10కోట్ల లోపు బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం రూ.65 కోట్లకుపైగా దక్కించుకొని సూపర్ హిట్‍గా నిలిచింది. ముఖ్యంగా ఓ క్లాసిక్ చిత్రంగా అందరికీ గుర్తుండిపోయింది.
బార్డర్ సినిమాలో సన్నీ డియోల్‍తో పాటు జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి, అక్షయే ఖన్నా, రాఖీ గుల్జార్, పూజా భట్, టబు, పునీత్ ఇసార్, సుదేశ్ బెర్రీ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా హైలైట్‍గా నిలిచింది. ఎమోషనల్‍గా ఈ మూవీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.
బార్డర్ చిత్రాన్ని జేపీ తద్దా, భన్వర్ సింగ్ నిర్మించారు. అనూ మాలిక్, ఆదేశ్ శ్రీవాత్సవ సంగీత అందించారు. ఈ చిత్రంలోని సందేశే ఆతే హై పాట క్లాసిక్‍గా నిలువగా.. మిగిలిన సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. అత్యుత్తమ జాతీయ సమగ్రత సినిమాగా బార్డర్‌కు నేషనల్ అవార్డు దక్కింది. సందేశే ఆతే హై పాటకు బెస్ట్ లిరిసిస్ట్‌గా జావేద్ అక్తర్‌కు జాతీయ అవార్డు లభించింది. మేరే దుష్మన్ పాటకు ఉత్తమ గాయకుడిగా హరిహరన్.. అవార్డు అందుకున్నారు.
ఐాకానిక్‍గా నిలిచిన ఈ బార్డర్ మూవీకి ఇప్పుడు 27ఏళ్ల తర్వాత సీక్వెల్ వస్తుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఎగ్జైటెడ్‍గా ఉన్నామంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
గతేడాది 2023లో గదర్ 2 చిత్రంతో సన్నీ డియోల్ బ్లాక్‍బస్టర్ సాధించారు. 2001లో వచ్చిన గాదర్‌కు సీక్వెల్‍గానే ఈ మూవీ వచ్చింది. గాదర్ 2 చిత్రం రూ.650 కోట్లకు పైగా వసూళ్లతో బంపర్ హిట్ అయింది.
టాపిక్