Gadar 2 in Parliament: గదర్ 2 సరికొత్త చరిత్ర.. కొత్త పార్లమెంట్ భవనంలో స్పెషల్ స్క్రీనింగ్
Gadar 2 in Parliament: గదర్ 2 సరికొత్త చరిత్ర సృష్టించింది. కొత్త పార్లమెంట్ భవనంలో ప్రదర్శించనున్న తొలి సినిమాగా నిలిచింది. శుక్రవారం (ఆగస్ట్ 25) నుంచి మూడు రోజుల పాటు ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ సాగనుంది.
Gadar 2 in Parliament: బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేసిన గదర్ 2 మూవీ ఇప్పుడు మరో చరిత్ర సృష్టించింది. బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ మూవీని కొత్త పార్లమెంట్ భవనంలో ప్రదర్శిస్తున్నారు. ఈ ఘనత సాధించిన తొలి సినిమాగా గదర్ 2 నిలిచింది. శుక్రవారం (ఆగస్ట్ 25) నుంచి మూడు రోజుల పాటు ఈ సినిమాను ఎంపీల కోసం ప్రదర్శించనున్నారు.
శుక్రవారం (ఆగస్ట్ 25) ఉదయం 11 గంటలకు గదర్ 2 తొలి షో వేశారు. రోజూ ఐదు షోల పాటు మూడు రోజుల పాటు గదర్ 2 స్పెషల్ స్క్రీనింగ్స్ ఉండటం విశేషం. ఈ సినిమాను నిర్మించిన జీ స్టూడియోస్ ఇప్పుడు పార్లమెంట్ లో మూవీ స్క్రీనింగ్స్ ఏర్పాటు చేసింది. సన్నీ డియోల్, అమీషా పటేల్ నటించిన గదర్ 2 మూవీ ఆగస్ట్ 11న రిలీజై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
22 ఏళ్ల కిందట గదర్ మూవీతో సక్సెస్ అందుకున్న అనిల్ శర్మే ఈ సీక్వెల్ నూ తెరకెక్కించాడు. తొలి రోజే సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. ఇండిపెండెన్స్ డే వీక్ మొత్తం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులను బ్రేక్ చేసింది. పాకిస్థాన్ ఆర్మీ నుంచి తన కొడుకును రక్షించుకునేందుకు తారా సింగ్ చేసే యుద్ధమే ఈ గదర్ 2 స్టోరీ. 1971లో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కించారు.
ఈ ఏడాది మొదట్లో వచ్చిన షారుక్ ఖాన్ మూవీ పఠాన్ బాక్సాఫీస్ రికార్డులను కూడా గదర్ 2 బ్రేక్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా రూ.525 కోట్లు వసూలు చేసింది. కేవలం ఇండియాలోనే రూ.543 కోట్లతో పఠాన్ మూవీ క్రియేట్ చేసిన రికార్డును బ్రేక్ చేసే దిశగా గదర్ 2 దూసుకెళ్తోంది.