Bigg Boss 8 Telugu: రెచ్చగొట్టాలంటే వారిద్దరే: సోనియా.. హౌస్‍లో ఫుడ్ దొంగతనాలు.. నిఖిల్‍ను కొట్టేస్తానన్న నైనిక
Bigg Boss 8 Telugu: బిగ్‍బాస్ హౌస్‍లో ఫుడ్ కోసం కంటెస్టెంట్లు పోటీలు పడ్డారు. టాస్కుల్లో గెలిచి రేషన్ సొంతం చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఒకరు గెలుచుకున్న ఆహార పదార్థాలను మరొకరు దొంగిలించడం కూడా జరిగింది.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో ఆహారం కోసం కంటెసెంట్లు హోరాహోరోగా తలపడ్డారు. రేషన్ కోసం పోటీలు పడ్డారు. ఈ పోటీల్లో రెండు క్లాన్‍లకు సరుకులు లభించగా.. ఓ క్లాన్‍కు రేషన్ దక్కలేదు. ఆహార పదార్థాలను దొంగలించడం కూడా హౌస్‍లో జరిగింది. సులువుగా ఇద్దరు రెచ్చగొట్టగలరంటూ అభయ్‍తో సోనియా మాట్లాడారు. నేటి (సెప్టెంబర్ 11) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే..
ముందు షాపింగ్
క్లాన్‍లు రేషన్ సాధించే ప్రక్రియను బిగ్‍బాస్ వివరించారు. యాక్షన్ ఏరియాలో సూపర్ మార్కెట్‍లో ముందుగా ముగ్గురు చీఫ్‍లు షాపింగ్ చేయాలని అన్నారు. ఇతర చీఫ్‍లతో, క్లాన్‍లతో వాటిని పంచుకోకూడదని అన్నారు. ఏ క్లాన్ వారు వండుకున్న ఆహారాన్ని ఆ క్లానే తినాలని చెప్పారు. దీంతో చీఫ్ యష్మి, నైనిక, నిఖిల్ కావాల్సిన ఆహార పదార్థాలను బాస్కెట్‍లో వేసుకొని తెచ్చుకున్నారు.
రేషన్ కావాలంటే గెలువాల్సిందే..
షాపింగ్ చేశాక ఆ ఆహారాలను దక్కించుకునేందుకు రెండు అవకాశాలు ఇచ్చారు బిగ్‍బాస్. టాస్కుల్లో గెలిస్తేనే రేషన్ ఉంటుందని చెప్పారు. ముందుగా లెమన్ పిజ్జా గేమ్‍ను కంటెస్టెంట్లకు పెట్టారు. నిమ్మకాలను మేజ్ లోపల నుంచి బయటికి తీసి ఎక్కువ రౌండ్లు గెలుస్తారో ఆ క్లాన్ రేషన్ దక్కించుకుంటుందని నిబంధనలను అభయ్ చదివారు.
యష్మి క్లాన్ గెలుపు
మూడు క్లాన్‍ల తరఫున ఇద్దరిద్దరు కంటెస్టెంట్లు లెమన్ పిజ్జా గేమ్ ఆడారు. ఈ గేమ్‍లో యష్మి క్లాన్ విజయం సాధించింది. దీంతో ముందు వారి క్లాన్ రేషన్ దక్కించుకుంది. రేషన్‍ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని బిగ్‍బాస్ జాగ్రత్తలు చెప్పారు. మిగిలిన క్లాన్‍లతో ఆహారం షేర్ చేసే అవకాశం లేదంటూ సోనియా ఏడ్చేశారు.
మరో టాస్క్
నైనిక, నిఖిల్ క్లాన్‍లో ఒకరికే రేషన్ దక్కించుకుంటుందనే అవకాశం ఉంటుందని బిగ్‍బాస్ చెప్పారు. ‘కనిపెట్టు.. పరుగెత్తు’ అనే ఛాలెంజ్ ఇచ్చారు. చెప్పిన వస్తువులను గుర్తించి లివింగ్ ఏరియాకు తీసుకువచ్చిన క్లాన్‍కు రేషన్ దక్కుతుందని తెలిపారు.
ఈ టాస్కును తాను ఆడతానని నిఖిల్ అంటే.. కాదు నేనే ఆడతానని మణికంఠ మారాం చేశారు. రాక్ పేపర్ సిజర్స్ అడి మణి ఆడాలని నిర్ణయించుకున్నారు. నైనిక క్లాన్ నుంచి సీత, నిఖిల్ క్లాన్ నుంచి మణి పోటీ పడ్డారు.
యష్మి, మణి వాగ్వాదం
‘కనిపెట్టు.. పరుగెత్తు’ టూస్కులో మరమరాలను తీసుకొచ్చిన విషయంలో మణికంఠ, ఈ టాస్క్ సంచాలక్ యష్మి మధ్య వాగ్వాదం జరిగింది. 250 గ్రాముల మరమరాలను తీసుకురావాలని బిగ్‍బాస్ చెప్పారు. మణి 290 గ్రాములు తెచ్చినా.. యష్మి అంగీకరించలేదు. ఎవరికీ పాయింట్ రాలేదని తేల్చేశారు. దగ్గరగా ఉన్నది తీసుకోవాలని మణి అడిగినా..యష్మి అంగీకరించలేదు. కరెక్టుగా తీసుకొచ్చేందుకు రోబోలం కాదు అని మణి అసహనం వ్యక్తం చేశారు. నా ఇష్టం అంటూ యష్మి మాట్లాడారు. సంచాలక్ నిర్ణయమే ఫైనల్ అని తెగేసి చెప్పారు. చివరికి నైనిక క్లాన్ ఈ టాస్కులో గెలిచి, రేషన్ సొంతం చేసుకుంది. తనకు ఆ పాయింట్ ఇచ్చి ఉంటే టై అయ్యేదని మణి ఫైర్ అయ్యారు.
షేర్ చేసుకుంటాం
రేషన్‍ను తాము షేర్ చేసుకుంటామని సీత అన్నారు. నిఖిల్, మణికి కూడా రేషన్ ఇవ్వాలని కోరారు. ఫుడ్ కోసం కొట్టుకోవడం చాలా బాధగా ఉందంటూ సీత ఎమోషనల్ అయ్యారు.
నిఖిల్ క్లాన్‍కు రాగిపిండి
రెండు టాస్కుల్లో ఓడిన నిఖిల్‍ను షాపింగ్ చేసిన సరుకులను వెనక్కి ఇచ్చేయాలని బిగ్‍బాస్ ఆదేశించారు. ఆ తర్వాత నిఖిల్, మణికి కేవలం రాగిపిండి మాత్రమే ఇచ్చారు. వారమంతా అదే తినాలని చెప్పారు.
నైనిక క్లాన్‍పై తాను ఓడిపోవడం సంతోషంగానే ఉందని అభయ్‍తో నిఖిల్ చెప్పారు. కావాలనే ఓడిపోయామనేలా మాట్లాడారు. నైనిక క్లాన్‍కు ఫుడ్ రావడం ఆనందం అని చెప్పారు. పైసా వసూల్ పాటతో 10వ రోజు మొదలైంది.
హౌస్‍లో దొంగతనాలు
హౌస్‍లో ఫుడ్ దొంగతనమైందని నబీల్ అఫ్రిది అరిచారు. తమ క్లాన్ చికెన్‍ను ఎవరో కొట్టేశారని గగ్గోలు పెట్టారు. తాను అనుకుంటే అందరి కంటే ఎక్కువ దొంగతనం చేస్తానని చెప్పారు. ఈ క్రమంలో యష్మి క్లాన్ నుంచి కొన్నింటినీ దోచేశారు నబీల్. చికెన్ పీస్‍లు కొట్టేద్దామని అభయ్ కూడా ప్లాన్ చేశారు.
ఏడిస్తే కొట్టేస్తా
నైనిక వద్ద కూర్చొని నిఖిల్ మళ్లీ బాధపడ్డారు. దీంతో అతడిని ఎమోషనల్ ఫూల్ అని నైనిక అన్నారు. “ఎమోషనల్ ఫూల్ అని కాదు. నేను చిన్నతనం నుంచే అన్ని బాధ్యతలు తీసుకున్నా. నాకు ఆ క్రమంలో నన్ను నేను కోల్పోయా” అని నిఖిల్ అన్నారు. ఏడిస్తే కొట్టేస్తా అని నిఖిల్‍తో నైనిక అన్నారు. ఎమోషన్లను చూపించినా సమస్యే.. చూపించకపోయినా సమస్యే అని నిఖిల్ అన్నారు.
వేరే క్లాన్ నుంచి డ్రింక్స్ కొట్టేద్దామని నిఖిల్‍తో మణికంఠ అన్నారు. తనతో వస్తావా లేదా అని నిఖిల్‍తో వారించారు. దీంతో సైకోలా తయారయ్యావని నిఖిల్ చెప్పారు. ఆ తర్వాత నిఖిల్, మణి కోసం కూరగాయాలు పంపించిన బిగ్‍బాస్.. పచ్చివే తినాలని రూల్ పెట్టారు.
రెచ్చగొట్టాలంటే వారిద్దరే
హౌస్‍లో ఎదుటి వారిని రెచ్చగొట్టాలంటే విష్ణుప్రియ, నైనికనే అని అభయ్‍తో సోనియా అన్నారు. ప్రేరణ మెచ్యూర్డ్‌గా రెచ్చగొడుతుందని అభయ్ అంటే.. విష్ణు చీప్‍గా రెచ్చగొడుతుందని సోనియా చెప్పారు. తనకు నీరసంగా ఉందని కిందపడుకొని పొర్లారు మణికంఠ.