Anil Ravipudi: దర్శకరత్న దాసరి జయంతి వేడుకలు.. ఐపీఎల్‌పై అనిల్ రావిపూడి కాంట్రవర్సీ కామెంట్స్
Dasari Birth Anniversary Celebrations Anil Ravipudi: దర్శకరత్న దాసరి నారాయణ రావు జయంతి వేడుకలకు ఘనంగా నిర్వహించారు. మే 19న ఆయన గుర్తుగా డైరెక్టర్స్ డే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌పై డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెంట్స్ చేశారు.
Dasari Birth Anniversary Celebrations: దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పాల్గొన్నారు.
వీరితోపాటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత సి కల్యాణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింనగర్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి, నిర్మాత ప్రసన్నకుమార్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.
ఫిలింఛాంబర్ ప్రాంగణంలోని దాసరి నారాయణరావు విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్‌ను ఈ నెల అంటే మే 19న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆ ఈవెంట్ డేట్ పోస్టర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
"దాసరి గారి జయంతి సందర్భంగా డైరెక్టర్స్ డేను ఇండోర్‌లో జరుపుకునేవాళ్లం. పెద్ద ఈవెంట్‌లా ఎందుకు చేయడం అని నాకు అనిపించేది. కానీ, దాసరి గారి గొప్పదనం ప్రపంచానికి తెలియాలంటే భారీ ఈవెంట్‌గానే చేయాలని వీరశంకర్ చెప్పిన మాటతో ఏకీభవిస్తున్నాను" అని ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.
"ఈ కార్యక్రమానికి పెద్ద దర్శకులంతా ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. వాళ్లు వస్తే హీరోలు వస్తారు. అప్పుడే ఈవెంట్ సక్సెస్ అవుతుంది. ఈ దిశగా ప్రయత్నం చేస్తున్న దర్శకుల సంఘం కమిటీని, కల్చరల్ కమిటీని అభినందిస్తున్నాను" అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.
"మే 19న డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఆ రోజు ఐపీఎల్ మ్యాచ్ ఉంది. నేను ఇటీవల ఐపీఎల్ గురించి మాట్లాడిన మాటలు తప్పుగా కన్వే అయ్యాయి. ఐపీఎల్ చూడండి, సినిమాలూ చూడండి, నేనూ ఐపీఎల్ చూస్తుంటాం. నేను మాట్లాడింది అపార్థం చేసుకోవద్దు" అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు.
"దర్శకరత్న దాసరి గారి జయంతి రోజు ప్రతిసారీ మనమంతా ఇలాగే కలవాలని కోరుకుంటున్నా. డైరెక్టర్స్ డే ఈవెంట్ కోసం మా దర్శకులంతా సిద్ధమవుతున్నాం. స్కిట్స్, మంచి మంచి పోగ్రామ్స్ చేయబోతున్నాం. ఇది మన సంఘం కోసం, మన సభ్యుల సంక్షేమం కోసం చేస్తున్నది. ఈ కార్యక్రమం ద్వారా పోగయ్యే ప్రతి రూపాయి డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులకు ఉపయోగపడుతుంది" అని అనిల్ రావిపూడి తెలిపారు.
"దాసరి గారు దర్శకుల సంఘానికే కాదు అన్ని సినీ కార్మిక సంఘాలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ముందుకొచ్చేవారు. సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండేవారు" అని దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ తెలిపారు.
"దాసరి గారి 151 సినిమా సందర్భంగా 151 మంది దర్శకులకు సన్మానం జరిపారు. ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్న కళాతపస్వి కె విశ్వనాథ్ గారు దాసరి గారి పుట్టినరోజుని డైరెక్టర్స్ డేగా జరపాలని సూచించారు. ఇద్దరు పెద్ద దర్శకుల మధ్య ఉన్న అనుబంధానికి గుర్తు ఈ సంఘటన. డైరెక్టర్స్ డే ఈవెంట్‌ను ఈ నెల 19వ తేదీన జరబోతున్నాం. ఈ ఈవెంట్ సక్సెస్ కోసం మన యంగ్ డైరెక్టర్స్ అందరూ శ్రమిస్తున్నారు. వాళ్లందరికీ నా థ్యాంక్స్ చెబుతున్నా" అని వీర శంకర్ చెప్పారు.