Directors Day 2024: బేబీ నిర్మాత 10 లక్షల విరాళం.. డైరెక్టర్స్ డే వేడుకలు.. స్టార్ హీరోలు, డైరెక్టర్స్ హాజరు!
Dasari Narayana Rao Directors Day: దిగ్గజ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణ రావు జయంతి సందర్భంగా డైరెక్టర్స్ డే వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
Directors Day 2024: దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి అయిన మే 4వ తేదీని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఇప్పటికీ నాలుగుసార్లు డైరెక్టర్స్ డేను సెలబ్రేట్ చేశారు. ఈ ఏడాది 5వ డైరెక్టర్స్ డే వేడుకలను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ వివరాలను డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్లో వివరించారు.
"దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతిని మొదటిసారి ఎఫ్ఎన్సీసీలో ఘనంగా నిర్వహించాం. అప్పుడు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ వంటి డైరెక్టర్స్ అంతా స్కిట్స్ చేసి ప్రోగ్రాం సక్సెస్ చేశారు. రాఘవేంద్రరావు, చిరంజీవి గారు అతిథులుగా పాల్గొన్నారు. కరోనా వల్ల రెండేళ్లు డైరెక్టర్స్ డే సెలబ్రేట్ చేయలేకపోయాం. ఆ తర్వాత మళ్లీ ఎఫ్ఎన్ సీసీలో ఈ కార్యక్రమం నిర్వహించాం" అని డైరెక్టర్ వీర శంకర్ తెలిపారు.
"ఇప్పుడు ఐదోసారి ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున డైరెక్టర్స్ డే నిర్వహించబోతున్నాం. ఇలా స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ఈవెంట్ ద్వారా ఫండ్ రైజింగ్ చేసి డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం మిడ్ డే మీల్స్, అసోసియేషన్‌కు కొత్త బిల్డింగ్ నిర్మాణం, వయసు పైబడిన దర్శకులకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం" అని డైరెక్టర్ వీర శంకర్ పేర్కొన్నారు.
"ప్రోగ్రామ్ నిర్వహణకు ఈసారి కల్చరర్ కమిటీ ఏర్పాటు చేశాం. ఆ కమిటీలో అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, నందిని రెడ్డి, అనుదీప్ కేవీ, విజయ్ కనకమేడల వంటి డైరెక్టర్స్ ఉంటారు. 15 వేల మంది ప్రజల దాకా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాం. డైరెక్టర్స్ అసోసియేషన్ కోసం బేబీ సినిమా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ 10 లక్షల రూపాయలు ఇవ్వడం సంతోషకరం. సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం" అని వీర శంకర్ చెప్పారు.
"ఈసారి డైరెక్టర్స్ డేను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నాం. ఈ ఈవెంట్ డీటెయిల్స్ విని నేను సర్ప్రైజ్ అయ్యాను. తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్‌కు ఇదొక బెంచ్ మార్క్ ఈవెంట్ కాబోతోంది. ఎంత బిజీగా ఉన్నా.. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటున్నా" అని డైరెక్టర్ నందినీ రెడ్డి తెలిపారు.
"తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ 2.ఓ అనుకునేలా ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ ఈవెంట్ గురించి చెప్పగానే త్రివిక్రమ్, సుకుమార్ లాంటి పెద్ద డైరెక్టర్స్ అందరూ సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చారు. ఇండస్ట్రీలో ప్రతి హీరోను కలుస్తున్నాం. వాళ్లంతా ఫ్యామిలీస్‌తో కలిసి ఎల్బీ స్టేడియంలో జరగనున్న సెలబ్రేషన్స్‌కు రావాలి. మన అసోసియేషన్ సభ్యుల సంక్షేమంతో పాటు ఇలాంటి బిగ్ ఈవెంట్స్ నిర్వహించడం సంతోషంగా ఉంది" అని బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ పేర్కొన్నారు.
"డైరెక్టర్స్ డే ఈవెంట్ గురించి వీరశంకర్ గారు ఫోన్ చేసి చెప్పారు. ఈ కార్యక్రమం పర్పస్ ఆయన చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అందరు దర్శకుల కెరీర్ గొప్పగా ఉండదు. కొందరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు. అలాంటి వారికి అండగా నిలబడేందుకు ఈ ప్రోగ్రాం ద్వారా వచ్చిన ఫండ్‌ను ఉపయోగించబోతున్నాం. డైరెక్టర్స్ అందరూ ముందుకొస్తున్నారు. ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ డైరెక్టర్స్ డే ఈవెంట్లో పాల్గొనాలని కోరుతున్నా" అని ఖుషీ డైరెక్టర్ శివ నిర్వాణ అన్నారు.