Ramayana Movie: రణ్ బీర్, సాయి పల్లవిల రామాయణం చేయొద్దు.. సీరియల్ సీత దీపికా షాకింగ్ కామెంట్స్
Dipika Chikhlia About Ramayana Movie: రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రామాయణం సినిమాపై రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం సీరియల్‌లో సీతగా పేరు తెచ్చుకున్న దీపికా చిక్లియా కామెంట్స్ చేశారు. భారతీయ ఇతిహాసాల వివరణపై రియాక్ట్ అయ్యారు.
Dipika Chikhlia About Ramayana Movie: ఇండియాలో ఎన్నో రకాల రామాయణ గాథలు తెరకెక్కాయి. అందులో రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం సీరియల్ ఒకటి. ఈ సీరియల్‌లో సీతగా ప్రేక్షకుల మన్ననలు పొంది మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు నటి దీపికా చిక్లియా. అయితే, తాజాగా నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న రామాయణం మూవీపై స్పందించారు దీపికా చిక్లియా.
ఇతిహాసం గజిబిజి అవుతోంది
ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ.. "ప్రజలు రామాయణాన్ని చేయకూడదు. ఎందుకంటే వారు భారతీయ ఇతిహాసాన్ని గందరగోళానికి గురిచేస్తారు. నిజంగా చెప్పాలంటే రామాయణాన్ని మంచిగా చిత్రీకరిస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మేకర్స్ ప్రతిసారీ కొత్త కథను, కొత్త కోణాన్ని తీసుకురావాలని కోరుకుంటారు. దాంతో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఇతిహాసం గజిబిజి అవుతోంది. అందుకే మీరు ఈ సినిమాలు చేయకూడదని నేను భావిస్తున్నాను" అని చెప్పారు.
కొత్తగా చేయాలనుకుంటారు
అందుకు ఉదాహరణగా 2023లో వచ్చిన ప్రభాస్, కృతి సనన్‌తో ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాను చెప్పారు దీపికా చిక్లియా. "ఆదిపురుష్ సినిమాలో సీత పాతర్ చేసిన కృతి సనన్‌కు వారు పింక్ కలర్ శాటిన్ (చీర) ఇచ్చారు. అలాగే సైఫ్‌కి (ఆదిపురుష్‌లో రావణుడిగా నటించిన సైఫ్ అలీ ఖాన్) విభిన్నమైన రూపాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే వారు క్రియేటివ్‌గా ఏదైనా కొత్తగా, విభిన్నంగా చేయాలనుకుంటున్నారు. కానీ, చివరిగా ఏమవుతుంది.. రామాయణంకు ఉన్న ప్రాముఖ్యతను పాడు చేస్తున్నారు" అని నటి దీపికా చిక్లియా తెలిపారు.
చేసి పాడు చేయవద్దు
ప్రముఖ నటి మరియు రాజకీయ నాయకురాలు, "ఎవరైనా సరే మతపరమైన గ్రంథాలను తారుమారు చేయకూడదు. ఎవరైనా దీన్ని చేయాలని నేను అనుకోను. రామాయణం చేసే ఆలోచనను పక్కన పెట్టండి. ఏదో ఒకటి చేసి పాడు చేయవద్దు" అని నటి, రాజకీయ నాయకురాలు దీపికా చిక్లియా సలహా ఇచ్చారు. రామాయణం కంటే మేకర్స్ చేయగలిగే కథలు చాలా ఉన్నాయని దీపిక చెప్పుకొచ్చారు.
స్వాతంత్య్ర వీరుల గురించి
"చాలా మంది స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు. వారి గురించి చెప్పండి. స్వాతంత్ర్యం కోసం పరాక్రమంగా పోరాడిన చరిత్ర రాయని వీరులపై సినిమాలు తీయండి. కేవలం రామాయణం మాత్రమే ఎందుకు?" అని దీపిక చిక్లియా ప్రశ్నించారు. కాగా నితేష్ తివారీ రామాయణంలో రణ్ బీర్ కపూర్ రాముడిగా నటించడంపై రామానంద్ సాగర్ రామాయణం సీరియల్‌లో రాముడి పాత్ర చేసిన అరుణ్ గోవిల్ తన అభిప్రాయం చెప్పారు.
మంచి నటుడు
ఆర్టికల్ 370 మూవీ ప్రమోషన్స్‌లో అరుణ్ గోవిల్ కామెంట్స్ చేశారు. రాముడి పాత్రలో రణబీర్ నటించడాన్ని సమర్ధిస్తారా అని అడిగితే.. "రణబీర్ కపూర్ మంచి నటుడు. అవార్డు కూడా గెలుచుకున్నాడు. మంచి సంస్కారం ఉన్నవాడు. అతను ఆ పాత్రకు తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడని నాకు నమ్మకం ఉంది" అని అరుణ్ గోవిల్ తెలిపారు.
రామాయణంలోని పాత్రధారులు
ఇదిలా ఉంటే, నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం సినిమా 2025 దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీలో రాముడిగా రణ్ బీర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. వారితోపాటు యష్, సన్నీ డియోల్, లారా దత్తా కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.