Aa Okkati Adakku Glimpse: ఇది పాన్ ఇండియా ప్రాబ్లం మీద మూవీ: ఆ ఒక్కటీ అడక్కు అంటున్న అల్లరి నరేష్
Aa Okkati Adakku Glimpse: అల్లరి నరేష్ పాన్ ఇండియా మూవీ కాదు.. పాన్ ఇండియా ప్రాబ్లం మీద మూవీ చేస్తున్నాడు. ఆ ఒక్కటీ అడక్కు అంటూ 32 ఏళ్ల కిందట తన తండ్రి తీసిన సినిమా టైటిల్ తోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Aa Okkati Adakku Glimpse: ఆ ఒక్కటి అడక్కు.. 32 ఏళ్ల కిందట అంటే 1992లో రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఈవీవీ సత్యనారాయణ తీసిన సినిమా. అప్పట్లో ఇది సూపర్ డూపర్ హిట్. ఇప్పుడిదే టైటిల్ తో ఈవీవీ తనయుడు అల్లరి నరేష్ మరో సినిమా తీస్తున్నాడు. ఈ మూవీ గ్లింప్స్ శుక్రవారం (ఫిబ్రవరి 16) రిలీజైంది. మరోసారి తనదైన స్టైల్లో నవ్వులు పంచడానికి నరేష్ వచ్చేస్తున్నాడు.
అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు
సుమారు నిమిషంన్నర గ్లింప్స్ వీడియోతోనే ఆ ఒక్కటీ అడక్కు మూవీ స్టోరీ ఏంటో చెప్పేశారు మేకర్స్. తన పెళ్లి విషయం మాత్రం అడగొద్దంటున్నాడు అల్లరి నరేష్. మల్లీ అంకం డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. చాలా రోజుల తర్వాత మరోసారి అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ తో రాబోతున్నాడు.
ఆ మధ్య నాంది, ఉగ్రంలాంటి సీనియస్ మూవీస్ తోపాటు నా సామిరంగలాంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ ప్లే చేసిన అల్లరి నరేష్.. తన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో ఆ కామెడీనే పంచడానికి వస్తున్నాడు. అయితే ఈ సినిమాకు ఆ ఒక్కటీ అడక్కు అంటూ తన తండ్రి తీసిన మూవీ పేరే పెట్టి నరేష్ ఆశ్చర్య పరిచాడు.
ఆ ఒక్కటీ అడక్కు గ్లింప్స్
శుక్రవారం (ఫిబ్రవరి 16) రిలీజైన ఈ ఆ ఒక్కటీ అడక్కు మూవీ గ్లింప్స్ విషయానికి వస్తే.. అద్దం ముందు నిలబడి హ్యాండ్సమ్ గా తయరవుతున్న అల్లరి నరేష్ ముందుగా కనిపిస్తాడు. ఆ తర్వాత దోసెలు వేస్తున్న అతని తల్లి వచ్చి.. పెద్దోడా బయటి వాళ్లు అడిగితే ఏం సమాధానం చెబుతావు రా అని అడుగుతుంది. దీంతో అతడు ఆవేశంలో పొయ్యి మీద ఉన్న పెనం తీసుకొని బయటకు వెళ్తాడు.
అక్కడ ఒక్కో ఇంటి ముందు కూర్చున్న ఒక్కో వ్యక్తి ఒక్కో భాషలో పెళ్లెప్పుడు చేసుకుంటావ్ అని అడుగుతారు. ఆ పెనాన్ని పట్టుకొని అలాగే ఆవేశంగా ముందుకు కదులుతుంటాడు మన హీరో. చివరగా వెన్నెల కిశోర్ వచ్చి.. ఇన్ని భాషల్లో అడుగుతున్నారు.. ఇది పాన్ ఇండియా మూవీయా అని అడుగుతాడు. ఇది పాన్ ఇండియా మూవీ కాదు.. పాన్ ఇండియా ప్రాబ్లం మీద మూవీ అని చెప్పి వెళ్లిపోతాడు.
లిఫ్ట్ ఎక్కిన అల్లరి నరేష్ ను ఇంతకీ పెళ్లెప్పుడు అని వెన్నెల కిశోర్ కూడా అడుగుతాడు. ఆ ఒక్కటీ అడక్కు అని నరేష్ అనడంతో వీడియో ముగుస్తుంది. ఫన్నీగా సాగిన ఈ గ్లింప్స్ వీడియో ఈ మూవీ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పింది. పెళ్లి వయసు దాటిపోతున్న యువతకు ఆ పెళ్లే పాన్ ఇండియా ప్రాబ్లెం అని ఈ చిన్న వీడియో ద్వారా మేకర్స్ చెప్పకనే చెప్పారు.
ఆ ఒక్కటీ అడక్కు మూవీని రాజీవ్ చిలక ప్రొడ్యూస్ చేస్తున్నాడు. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అల్లరి నరేష్ నటిస్తున్న ఈ సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.