Peddapalli Lok Sabha : కార్మికుడిగా కొప్పుల ప్రచారం, పైగా లోకల్ నినాదం - ఆసక్తికరంగా మారుతున్న 'పెద్దపల్లి' పోరు..!-brs mp candidate koppula eshwar is trying hard to win in peddapalli ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Peddapalli Lok Sabha : కార్మికుడిగా కొప్పుల ప్రచారం, పైగా లోకల్ నినాదం - ఆసక్తికరంగా మారుతున్న 'పెద్దపల్లి' పోరు..!

Peddapalli Lok Sabha : కార్మికుడిగా కొప్పుల ప్రచారం, పైగా లోకల్ నినాదం - ఆసక్తికరంగా మారుతున్న 'పెద్దపల్లి' పోరు..!

HT Telugu Desk HT Telugu
May 09, 2024 09:03 PM IST

Lok Sabha Polls in Telangana 2024 : పెద్దపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో సింగరేణిలో పని చేసిన నేపథ్యం ఉండటంతో కార్మికుడిగా మారి క్యాంపెయినింగ్ కు వెళ్తున్నారు. లోకల్, నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తీసుకువస్తుండటంతో కాంగ్రెస్ ను డైలామాలో పడేస్తున్నారు.

పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం
పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం

Peddapalli Lok Sabha Election 2024: వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదేళ్ళు ప్రభుత్వ చీఫ్ విప్ గా మరో ఐదేళ్ళు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. కానీ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనతికాలంలోనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తు ఎదురీదుతున్నారు మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్. 

రాజకీయాల్లోకి రాకముందు సింగరేణి కార్మికుడిగా ఈశ్వర్(Koppula Eshwar) పనిచేశారు.  పుట్టిపెరిగిన గోదావరిఖనిలో రాజకీయ ప్రస్తానం ప్రారంభించి… ప్రస్తుతం సింగరేణిలో కార్మికుడిగా ప్రచారం సాగిస్తున్నారు.

ఎస్సీ రిజర్వుడు స్థానమైన పెద్దపల్లి నుంచి పార్లమెంట్ కు పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్ సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన రామగుండం, మంచిర్యాల, చెన్నూరు, మంథని, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికుడిలా ప్రచారం చేస్తున్నారు. కాశీపేట 1 ఇన్ క్లైన్, 2 ఇన్ క్లైన్ మైనింగ్ లో సింగరేణి గని కార్మికులను కలిసి, పార్లమెంట్ అభ్యర్థిగా ఓ సింగరేణి కార్మిక బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని, 13న జరిగే పోలింగ్ లో కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని సింగరేణి కార్మిక కుటుంబాలను అభ్యర్థించారు. 

సింగరేణి కార్మిక బిడ్డగా ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిగా పిలిస్తే పలికే నాయకుడిగా ప్రజల కోసం పనిచేస్తున్న తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి  చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ ఆరంభం నుంచి కేసిఆర్ వెంట నడిచి ప్రత్యేక రాష్ట్ర సాధనకై రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశానని గుర్తు చేస్తున్నారు. ప్రజల కష్టాలు, సింగరేణి కార్మికుల ఇబ్బందులు తెలిసిన వ్యక్తిగా మీ ముందుకు వచ్చిన తనకు ఓటు వేసి గెలిపించాలని ఈశ్వర్ కోరుతున్నారు.

గెలిచిన వారంతా వలసవాదులే..

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి పోటీ చేసి గెలిచిన వారంత వలస వాదులేనని ఈశ్వర్ గుర్తు చేస్తున్నారు. స్థానికంగా ఉండే తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 

కాంగ్రెస్ నుంచి గతంలో వెంకటస్వామి ఆ తర్వాత ఆయన కొడుకు వివేక్, ఇప్పుడు వివేక్ కుమారుడు వంశీకృష్ణ పోటీ చేస్తున్నారని ప్రచారంలో చెబుతున్నారు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలని పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.    26 సంవత్సరాలు సింగరేణి కార్మికుడిగా పని చేసిన ఈ ప్రాంత వ్యక్తి గా అవకాశం కల్పించినట్లైతే ఈ ప్రాంతం అభివృద్ధి కోసం లేదా సమస్యలపై పోరాడే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

ఈశ్వర్ ప్రచారంతో కాంగ్రెస్ లో గుబులు

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుని గెలుపు ధీమాతో ఉంది.  అయితే కొప్పుల ఈశ్వర్ సాగిస్తున్న లోకల్ నాన్ లోకల్, వారసత్వ రాజకీయాల ప్రచారంతో గుబులు పట్టుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ దళితుడే అయినప్పటికి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆర్థికంగా బలమైన వ్యక్తిగా నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. 

ఇలాంటి పరిస్థితిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఘనవిజయం సాధించినప్పటికి ఈశ్వర్ సాగిస్తున్న ప్రచారంతో కాస్త కాంగ్రెస్ కు దెబ్బపడే అవకాశం ఉందని రాజకీయంగా చర్చ సాగుతుంది. 

ఖచ్చితంగా ప్రజలు వారసత్వ రాజకీయాలను, లోకల్ నాన్ లోకల్ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే రాజకీయంగా పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. మరీ ఈశ్వర్ ప్రచారం స్థానికత ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుందో చూడాలి..

రిపోర్టింగ్ - HT Telugu Correspondent K.V.REDDY, Karimnagar.

Whats_app_banner