Peddapalli Campaign: పెద్దపల్లిలో వింత ప్రచారం.. మెడలో బీరు సీసాలతో లోక్‌సభ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
Peddapalli Campaign: ఎన్నికల వేళ విచిత్రాలు జరుగుతాయి. ఓటర్ దేవుళ్ళను ప్రసన్నం చేసుకోడానికి అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు.
Peddapalli Campaign: ఓటర్లను ఆకట్టుకోడానికి హామీలు ఇవ్వడం... ప్రలోభాలకు గురిచేయడం కాదంటే కాళ్ళ వేళ్ళపడి బ్రతిమాలి ఓట్లు వేయించుకోవడం చేస్తారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా(డెమోక్రటిక్) అభ్యర్థి మోతే నరేష్ వింతగా ప్రచారం సాగిస్తున్నారు.
మెడలో ఖాళీ బీరు సీసాల దండ వేసుకొని, షర్ట్ కు కరెన్సీ జిరాక్స్ నోట్లు అంటించుకుని అయ్యా నీ బాంచన్ కాళ్ళు మొక్కుతా అంటు ఓటర్ల కాళ్ళ మొక్కుతు డబ్బుకు మద్యానికి ఓటు వేయొద్దని ప్రచారం చేస్తున్నాడు.
ఎన్నికల ప్రచారంలో ఐదు సంవత్సరాల జీవితం తాకట్టు పెట్టకు అనే కరపత్రం పంచుతూ ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ధర్మపురి లో మోతే నరేష్ ప్రచారం చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నరేష్ ఎంచుకున్న నినాదం బాగానే ఉన్నా, ఓటర్లు మాత్రం ఆయన ప్రచారానికి ఏమేరకు స్పందిస్తారనే చర్చ ఆసక్తికరంగా సాగుతుంది.
పెద్దపల్లిలో 42 మంది అభ్యర్థులు పోటీ…
మునుపెన్నడు లేని విధంగా ఈసారి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రదాన పార్టీలు కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ కృష్ణ, బిఆర్ఎస్ నుంచి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, బిజేపి నుంచి గోమాస శ్రీనివాస్ తోపాటు 30 మందికి పైగా స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ప్రధాన పార్టీల అభ్యర్థులు రోడ్ షోలు, జన జాతర, జన గర్జన సభలు నిర్వహిస్తుండగా స్వతంత్ర అభ్యర్థులు మాత్రం వింత వినూత్నంగా ప్రచారం చేస్తు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నికల బరిలో 42 మంది అభ్యర్థులు ఉన్నా ప్రధానంగా పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్యనే ఉంది. మూడో స్థానంలో బీజేపి అభ్యర్థి ఉంటారని స్థానికంగా ప్రజల మధ్య చర్చ జరుగుతోంది.
(రిపోర్టింగ్ కేవీ రెడ్డి,కరీంనగర్)