CM Jagan On Land Titling Act : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది గొప్ప సంస్కరణ - తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్న జగన్
CM YS Jagan On AP Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Land Titling Act) అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ అవుతుందని సీఎం జగన్ అన్నారు. హిందూపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆయన… ప్రతిపక్షాలు చేసే ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
CM Jagan On Ap Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్… ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ యాక్ట్ తో సొంత ఆస్తులపై ప్రజలకు హక్కులు లేకుండా పోతాయని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు.
ఇవాళ( శనివారం) హిందూపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్…ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్(Ap Land Titling Act) పై మాట్లాడారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో గొప్ప సంస్కరణ అవుతుందని చెప్పారు.
భూ వివాదాల వల్ల రైతులు, ప్రజలందరూ కూడా అధికారులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉందని జగన్(YS Jagan) గుర్తు చేశారు. ప్రజలు ఎవరూ కూడా ఎవరి చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి రాకూడదని అభిప్రాయపడ్డారు. ఈ భూములపై ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని స్పష్టం చేశారు.
భూ యజమాని వద్దే ఆస్తి పత్రాలు ఉంటాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు (Chandrababu)ప్రచారాలు నమ్మవద్దని కోరారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ఫిజికల్ కాపీలు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు కార్డ్-2 సాఫ్ట్ వేర్ తో 9 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్లు చేసిన తర్వాత భూయజమానులకు డాక్యుమెంట్లు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కార్డ్-2 సాఫ్ట్ వేర్ అమలు జరుగుతోంది” అని సీఎం జగన్ గుర్తు చేశారు.
పత్రాలల్లో తప్పులు ఉండకూడదనే ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని సీఎం జగన్(CM YS Jagan) చెప్పారు. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఫిజికల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ యాక్ట్(Ap Land Titling Act) విషయంలో ప్రతిపక్షాలు చేసే ప్రచారాలను అసలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
ఏపీ భూహక్కుల చట్టం - ఏముందంటే..?
గతేడాదిలోనే ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం(AP land titling Act 2023) అమల్లోకి వచ్చింది. ఏపీ భూహక్కుల చట్టం అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.512 జారీ చేసింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో 2023 నవంబరులో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ చట్టం ద్వారా భూ యజమానులు, కొనుగోలుదారులకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఏపీ భూహక్కుల చట్టం ప్రకారం స్థిరాస్తి హక్కుల రిజిస్టర్ రూపొందిస్తారు. దీంతో స్థిరాస్తిని భూయజమాని తప్ప మరొకరు విక్రయించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదని చట్టంలో పేర్కొంది.
రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్తులకు శాశ్వత రిజిస్టర్, వివాద రిజిష్టర్, కొనుగోలు రిజిస్టర్ రూపొందింస్తారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరణ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వంలో ఏపీ ల్యాండ్ అథారిటీ ఉంటుంది. ఈ అధికారి మండల స్థాయిలో ల్యాండ్ టైట్లింగ్ అధికారులను నియమిస్తారు.
ల్యాంట్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వస్తే.. భూములపై యాజమాన్య హక్కులు ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందుల రావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ హక్కులు లేని వారికి ఇది పెద్ద సమస్యగా మారుంతుందని అంటున్నారు. హక్కులు లేకపోయినప్పటికీ చాలా మంది పేదవాళ్లు… అనేక ప్రాంతాల్లో భూములను సాగు చేసుకుంటున్నారని, వారంతా కూడా పోజిషన్ లో ఉన్నారని అంటున్నారు. చాలా ఏళ్లుగా వారు సాగు చేసుకుంటున్నప్పటికీ… హక్కులు రాలేదని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి వారి విషయంలో ప్రభుత్వం ఏం చెబుతుందనేది వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.