SIT Report on AP Violence : ఏపీలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక- పోలీసుల నిర్లక్ష్యం, రాజకీయ నేతల పాత్రపై విచారణ!
SIT Report on AP Violence : ఏపీలో ఇటీవల జరిగిన అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను డీజీపీకి అందజేసింది. అయితే పూర్తిస్థాయి విచారణకు మరికొంత సమయం ఇవ్వాలని సీఈసీని సిట్ కోరనుంది.
SIT Report on AP Violence : ఏపీలో పోలింగ్ రోజున, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం అయ్యింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చెలరేగిన హింసపై విచారణకు ఏర్పాటు చేసిన 13 సభ్యుల సిట్ బృందం క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తు అనంతరం సిట్ బృందం ప్రాథమిక నివేదికను సోమవారం ఉదయం 10 గంటలకు డీజీపీకి అందించింది. అలాగే సీఎస్, సీఈసీకి కూడా ఈ నివేదికను అందించనున్నారు. అయితే పూర్తి స్థాయి నివేదికను ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని సీఈసీని సిట్ కోరనుంది. రెండ్రోజుల్లో ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన సిట్ బృందం బాధితులు, రాజకీయ పార్టీల నేతలు, స్థానికులు, పోలీసులను విచారించింది. అల్లర్లపై నమోదు అయిన కేసులను పరిశీలించింది. పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అల్లర్లు చెలరేగాయని సిట్ అధికారులు దర్యాప్తులో గుర్తించారు.
కేసుల నమోదుపై సిట్ సూచనలు
అల్లర్లపై స్థానిక పోలీసులకు సిట్ పలు సూచనలు చేసింది. కేసులు నమోదుపై ఆదేశాలు ఇచ్చింది. ఘర్షణలతో ప్రమేయం ఉన్న రాజకీయ పార్టీల నేతల అరెస్ట్ పై కూడా సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. అల్లర్లతో సంబంధం ఉన్న వారిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు, విచారణ విషయాలను సిట్ బృందం ఆరా తీసింది. అయితే కొందరు అధికారులు హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కూడా నిర్లక్ష్యం వహించి ఆలస్యంగా వెళ్లినట్లు సిట్ గుర్తించింది. కొందరు పోలీసు అధికారులు స్థానిక రాజకీయ నేతలతో కుమ్మక్కైనట్లు సిట్ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే సిట్ నివేదికలో ఉన్న పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కొత్తగా 12 మందికి పోస్టింగ్
ఏపీలో ఇటీవల చెలరేగిన హింసాత్మక ఘటనలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు పోలీసు ఉన్నతాధికారులపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అల్లర్లను నిలువరించడంలో విఫలమయ్యారన్న కారణంతో ఈసీ పలువురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇలా బదిలీ అయిన వారి స్థానాల్లో కొత్త వారిని నియమిస్తూ ఈసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురికి డీఎస్పీలుగా, ఏడుగురికి ఇన్‌స్పెక్టర్లుగా మొత్తంగా 12 మందికి పోస్టింగ్ ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చింది. నరసరావుపేట డీఎస్పీగా ఎం.సుధాకర్‌రావు, గురజాల డీఎస్పీగా సీహెచ్. శ్రీనివాసరావు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడు, తిరుపతి స్పెషల్ బ్రాంచ్‌కు ఎం.వెంకటాద్రిని నియమించింది.
పిఠాపురం, కాకినాడ సిటీలో అల్లర్లు- నిఘా వర్గాల రిపోర్ట్
ఏపీలో కౌంటింగ్ సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఈసీని అలర్ట్ చేసింది. కౌంటింగ్ కు ముందు, తర్వాత కూడా ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘానికి నిఘా వర్గాలు రిపోర్ట్ ఇచ్చాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో కాకినాడ, పిఠాపురం సమస్యాత్మక ప్రదేశాలపై ఈసీ నిఘా పెట్టింది. ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటపై దృష్టి పెట్టింది. ఘర్షణలు ప్రేరేపించే వ్యక్తులపై నిఘా పెట్టాలని పోలీసులను ఆదేశించింది. అలాగే జిల్లాల కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఘర్షణలకు పాల్పడినా, అల్లర్లు సృష్టించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అల్లర్లు సృష్టించిన వారిని జిల్లా నుంచి బహిష్కరిస్తామన్నారు.
సంబంధిత కథనం