Post poll violence in AP : 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు కలెక్టర్‌గా బాలాజీ లఠ్కర్‌ - అల్లర్లపై 'సిట్' దర్యాప్తు-three new ips officers appointed in palnadu anantapur and tirupati followed by post poll violence in andhra pradesh ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Post Poll Violence In Ap : 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు కలెక్టర్‌గా బాలాజీ లఠ్కర్‌ - అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

Post poll violence in AP : 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు కలెక్టర్‌గా బాలాజీ లఠ్కర్‌ - అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

Maheshwaram Mahendra Chary HT Telugu
Published May 19, 2024 07:42 AM IST

Post poll violence in Andhra Pradesh: ఏపీ హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్‌ను నియమించింది. ఈ మేరకు సీఎస్ కు సమాచారం పంపింది.

ఏపీలో మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలు
ఏపీలో మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలు

Post poll violence in AP: ఏపీలో పోలింగ్‌ వేళ జరిగిన గొడవలు, దాడులను ఈసీ సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారుల నుంచి సమాచారం సేకరించిన ఈసీ… ఇటీవలే పలువురు అధికారులపై వేటు కూడా వేసింది.

ప్రధానంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పరిధిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ పని చేస్తున్న పలువురు ఉన్నతాధికారులపై వేటు వేసింది ఈసీ. అయితే ఈ స్థానాల్లో పని చేసేందుకు కొత్త వారిని సిఫార్సు చేసింది.

పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్, పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేష్‌ బాలాజీరావు లఠ్కర్,  అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్‌ రాజు పేర్లను సిఫార్సు చేస్తూ సీఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా ఏపీ సీఎస్…ఉత్తర్వులు ఇచ్చారు.  ఇందులో పేర్లు ఉన్న అధికారులు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల విధుల్లో ఉంటే ఆదివారం బాధ్యతలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సిట్ దర్యాప్తు ముమ్మరం….

మరోవైపు హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాలతో సిట్‌ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో సిట్‌ పని చేస్తోంది. ఇందులో మొత్తం13 మంది సభ్యులు ఉన్నారు.

సిట్ అధికారుల బృందం… హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో పర్యటిస్తోంది. అక్కడ నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తోంది. ప్రతి ఒక్క కేసుతో పాటు ఘటన వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. వీటి ఆధారంగా నివేదికను సిద్ధం చేసి సీఈసీకి పంపనుంది. రెండు రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని సీఈసీ ఆదేశించిన నేపథ్యంలో…. ఇవాళ లేదా రేపు నివేదిక అందే అవకాశం ఉంది. సిట్ దర్యాప్తు వేళ పలు పార్టీల నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. 

అధికారులపై ఈసీ వేటు….

అల్లర్ల నేపథ్యంలో ఏపీలో పలువురు అధికారులు కూడా బదిలీ అయ్యారు. పల్నాడు జిల్లా కలెక్టర్ ను ఈసీ బదిలీ చేసింది. ఇదే సమయంలో పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు పడింది. తిరుపతి ఎస్పీని బదిలీ చేయగా…శాఖపరమైన విచారణ జరపాలని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

పల్నాడు,అనంతపురం, తిరుపతి జిల్లాల పరిధిలోని మరో 12 మంది పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించింది. మరో 25 సీఆర్పీఎఫ్ కంపెనీ బలగాలను ఏపీలో మోహరించాలని ఈసీ నిర్ణయించింది.  దీంతో మరిన్ని బలగాలు ఏపీకి రానున్నాయి.

ఫలితాల విడుదల వేళ ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఈసీ దిశానిర్దేశం చేసింది. హింసాత్మక ఘటనల్లో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఈసీ ఆదేశించింది.

 

Whats_app_banner