Pakistan: “బాబర్ చేసిన పెద్ద తప్పు అదే”: పాక్ కెప్టెన్‍పై మాజీ స్టార్ ఫైర్-why babar azam gave ball to nawaz former pakistan captain wasim akram questions ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pakistan: “బాబర్ చేసిన పెద్ద తప్పు అదే”: పాక్ కెప్టెన్‍పై మాజీ స్టార్ ఫైర్

Pakistan: “బాబర్ చేసిన పెద్ద తప్పు అదే”: పాక్ కెప్టెన్‍పై మాజీ స్టార్ ఫైర్

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 28, 2023 05:30 PM IST

Pakistan - ODI World Cup 2023: దక్షిణాఫ్రికా చేతిలో పాకిస్థాన్ ఉత్కంఠ పోరులో పరాజయం పాలైంది. దీంతో ప్రపంచకప్‍లో వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే, ఈ మ్యాచ్‍లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తీసుకున్న ఓ నిర్ణయాన్ని దిగ్గజం వసీం అక్రమ్ ప్రశ్నించారు. ఆ వివరాలివే..

బాబర్ ఆజమ్
బాబర్ ఆజమ్ (PTI)

Pakistan - ODI World Cup 2023: ప్రస్తుత వన్డే ప్రపంచకప్‍లో పాకిస్థాన్ జట్టు ఘోరమైన ప్రదర్శన చేస్తోంది. వరుసగా నాలుగు మ్యాచ్‍ల్లో ఓడి సెమీ ఫైనల్ ఆశలను దాదాపు గల్లంతు చేసుకుంది. దక్షిణాఫ్రికాతో శుక్రవారం (అక్టోబర్ 27) జరిగిన మ్యాచ్‍లో పాకిస్థాన్ ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. ఓడిపోయే పరిస్థితి నుంచి కోలుకొని చివరి వరకు పోరాడినా బాబర్ ఆజమ్ సేనకు పరాజయం తప్పలేదు. అయితే, 48 ఓవర్‌ను స్పిన్నర్ మహమ్మద్ నవాజ్‍కు కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇవ్వడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దక్షిణాఫ్రికా గెలుపు కోసం 18 బంతుల్లో 5 పరుగులు చేయాల్సి ఉండగా.. ఒక వికెట్ మాత్రమే చేతిలో ఉండింది. ఆ సమయంలో 48వ ఓవర్‌ను పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. స్పిన్నర్ మహమ్మద్ నవాజ్‍కు ఇచ్చాడు. ఈ ఓవర్ తొలి బంతికే సఫారీ టేలెండర్ షంసి సులువుగా సింగిల్ తీశాడు. ఇక, రెండో బంతికి దక్షిణాఫ్రికా బ్యాటర్ కేశవ్ మహారాజ్ సింపుల్‍గా ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు. దీంతో పాక్ ఓడిపోయింది. అయితే, బాగా బౌలింగ్ చేస్తున్న ఉసామా మీర్‌కు కాకుండా 48వ ఓవర్‌ను నవాజ్‍కు బాబర్ ఎందుకు ఇచ్చాడనే విమర్శలు వస్తున్నాయి. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా ఈ విషయంపైనే బాబర్ ఆజమ్‍ను ప్రశ్నించాడు.

48వ ఓవర్‌ను ఒసామా మిర్‌కు కాకుండా నవాజ్‍కు ఇవ్వడమే బాబర్ ఆజమ్ చేసిన అతిపెద్ద తప్పు అని అక్రమ్ అభిప్రాయపడ్డాడు. “జట్టు ఓడిపోయినప్పుడు విమర్శలు రావడం సహజం. చివరి ఓవర్‌ను నవాజ్‍కు ఇచ్చారు. నాకు తెలుసు దేశమంతా తప్పు నవాజ్‍దే అని అంటుంది. కానీ ఆ సమయంలో ఉసామా మిర్‌కు రెండు ఓవర్లు మిగిలే ఉన్నాయి. ఆ మ్యాచ్‍లో ఎవరు బాగా బౌలింగ్ చేశారు? ఉసామా మిర్. గూగ్లీలతో టెయిలెండర్లను ఎవరు బోల్తా కొట్టించేలా కనిపించారు? ఉసామా. తొలి మూడు, నాలుగు ఓవర్లను సరిగా వేయకపోయినా.. ఆ తర్వాత అతడు రెండు వికెట్లను తీసుకున్నాడు. కానీ, నవాజ్‍కు బాబర్ ఎందుకు ఆ ఓవర్ ఇచ్చాడో నాకు అర్థం కావడం లేదు. నవాజ్‍కు ఆత్మవిశ్వాసం అంతగా లేదు. అతడు బంతిని రిలీజ్ చేసే పాయింట్‍ను బట్టి చూస్తే బాల్ లెగ్ సైడ్‍కు వెళుతుంది. మా కెప్టెన్ చేసిన అతిపెద్ద తప్పు ఇదే” అని వసీం అక్రమ్ చెప్పాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‍లో పాకిస్థాన్ ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. ఓ దశలో సఫారీ జట్టు సునాయాసంగా గెలుస్తుందని అనిపించింది. అయితే, పాక్ బౌలర్లు పుంజుకొని వెంటవెంటనే వికెట్లు తీశారు. అయితే, చివరికి దక్షిణాఫ్రికానే ఉత్కంఠ పోరులో గెలిచింది. షాదాబ్ ఖాన్ గాయపడటంతో ఈ మ్యాచ్‍లో కంకషన్ సబ్‍స్టిట్యూట్‍గా బరిలోకి దిగాడు ఉసామా మిర్. రెండు వికెట్లు తీశాడు.

Whats_app_banner

సంబంధిత కథనం