Rahul Dravid: ఆ కాల్ చేసినందుకు రోహిత్ శర్మకు చాలా థ్యాంక్స్: రాహుల్ ద్రవిడ్ ఎమోషనల్ స్పీచ్-thank you rohit sharma for phone call after odi world cup 2023 final says rahul dravid ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rahul Dravid: ఆ కాల్ చేసినందుకు రోహిత్ శర్మకు చాలా థ్యాంక్స్: రాహుల్ ద్రవిడ్ ఎమోషనల్ స్పీచ్

Rahul Dravid: ఆ కాల్ చేసినందుకు రోహిత్ శర్మకు చాలా థ్యాంక్స్: రాహుల్ ద్రవిడ్ ఎమోషనల్ స్పీచ్

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 02, 2024 04:12 PM IST

Rahul Dravid: టీ20 ప్రపంచకప్‍ను భారత్ కైవసం చేసుకున్నాక హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎమోషనల్ అయ్యారు. ఈ టోర్నీతో ఆయన హెడ్ కోచ్ స్థానం నుంచి తప్పుకున్నారు. ఈ తరుణంలో ద్రవిడ్ ఓ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.

Rahul Dravid: ఆ కాల్ చేసినందుకు రోహిత్ శర్మకు చాలా థ్యాంక్స్: రాహుల్ ద్రవిడ్ ఎమోషనల్ స్పీచ్
Rahul Dravid: ఆ కాల్ చేసినందుకు రోహిత్ శర్మకు చాలా థ్యాంక్స్: రాహుల్ ద్రవిడ్ ఎమోషనల్ స్పీచ్

భారత హెడ్‍కోచ్, దిగ్గజం రాహుల్ ద్రవిడ్ గంభీరంగా ఉంటూ భావోద్వేగాలను ఎక్కువ శాతం ప్రదర్శించరు. అయితే, గత వారం జూన్ 29న టీ20 ప్రపంచకప్‍ 2024 టైటిల్‍ను భారత్ కైవసం చేసుకున్నాక ద్రవిడ్ ఉప్పొంగిపోయారు. విరాట్ కోహ్లీ తీసుకొచ్చి చేతికి టైటిల్ అందించాక ద్రవిడ్ గట్టిగా అరిచారు. సంబరాలు చేసుకున్నారు. ప్లేయర్‌గా ఎంతో అద్భుతంగా ఆడినా మూడుసార్లు ద్రవిడ్‍కు ప్రపంచకప్ దక్కలేదు. హెడ్‍కోచ్‍గా మూడో ప్రయత్నంలో ప్రపంచకప్ దక్కింది. ప్లేయర్‌గా అందని ప్రపంచకప్ టైటిల్.. కోచ్‍గా అయినా రావడంతో ద్రవిడ్ చాలా సంతోషం వ్యక్తం చేశారు.

గతేడాది వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‍లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయాక హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చాలా ఫీలయ్యారు. కోచ్‍గా పదవీకాలం ముగియడంతో కాంట్రాక్ట్ కాలాన్ని పొడిగించుకునేందుకు ఇష్టపడలేదు. అయితే, గతేడాది నవంబర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఓ ఫోన్ కాల్‍తో కోచ్‍గా కొనసాగేందుకు ఆయన అంగీకరించారు. ఆ విషయాన్ని రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు స్వయంగా వెల్లడించారు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‍లో దక్షిణాఫ్రికాపై గెలిచాక భారత జట్టును ఉద్దేశించి ద్రవిడ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోనుండటంతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ వీడియోను బీసీసీఐ నేడు (జూలై 2) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

రోహిత్‍కు థ్యాంక్స్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు రాహుల్ ద్రవిడ్ థ్యాంక్స్ చెప్పారు. గతేడాది నవంబర్‌లో కాల్ చేసి కోచ్‍గా కొనసాగేందుకు ఒప్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. “నవంబర్‌లో కాల్ చేసి కొనసాగాలని నన్ను అడిగినందుకు చాలా థ్యాంక్స్ రో (రోహిత్ శర్మ). రోహిత్‍తో పాటు మీ అందరితో కలిసి పని చేసినందుకు నేను చాలా గౌరవంగా, సంతోషంగా భావిస్తున్నా. టైమ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. కెప్టెన్, కోచ్‍గా మేం ఇద్దరం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కొన్నిసార్లు పరస్పరం అంగీకరించుకున్నాం. కొన్ని నిర్ణయాలను విభేదించుకున్నాం. మీ అందరి గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది” అని ద్రవిడ్ అన్నారు.

దేశమంతా గర్విస్తోంది

కెరీర్లో పరుగులు, వికెట్లు లాంటి ఎక్కువగా గుర్తుండవని, ఇలాంటి సందర్భాలే చిరస్థాయిగా నిలిచిపోతాయని రాహుల్ ద్రవిడ్ అన్నారు. “నాకు నిజంగా మాటలు చాలడం లేదు. ఈ అద్భుతమైన జ్ఞాపకంలో నన్ను భాగం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భాలన్నీ మీరు గుర్తుంచుకుంటారని నేను అనుకుంటున్నా. పరుగులు, వికెట్ల గురించి కెరీర్లో ఎప్పుడు గుర్తుంచుకోరు. కానీ ఇలాంటి సందర్భాలను తప్పకుండా గుర్తుంచుకుంటారు” అని ద్రవిడ్ అన్నారు.

భారత జట్టు సాధించిన విజయం పట్ల దేశమంతా గర్విస్తోందని రాహుల్ ద్రవిడ్ అన్నారు. ఇందుకోసం అందరూ చాలా త్యాగాలు చేశారని చెప్పారు. “మీరు సాధించిన దానిపట్ల దేశమంతా గర్విస్తోందని మీకు తెలుసు. మీలో ప్రతీ ఒక్కరు త్యాగాలు చేశారు. కానీ ఈరోజు మీకు కుటుంబాలను చూడండి. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మన చిన్నతనం నుంచి ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్‍లో ఉండేంత వరకు ప్రతీ ఒక్కరు చేసిన త్యాగాల గురించి కూడా ఆలోచించాలి” అని ద్రవిడ్ అన్నారు.

రాహుల్ ద్రవిడ్ ఇక టీమిండియా హెడ్ కోచ్ స్థానం నుంచి తప్పుకోనున్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. రోహిత్ శర్మ మరోసారి అడిగినా ఈ సారి ద్రవిడ్ అంగీకరించలేదు. భారత జట్టుకు గౌతమ్ గంభీర్ కొత్త హెడ్ కోచ్‍గా వస్తారనే అంచనాలు ఉన్నాయి.

Whats_app_banner