IND vs SA World Cup 2023: గర్జించిన టీమిండియా.. దక్షిణాఫ్రికా చిత్తుచిత్తు.. భారత్‍కు వరుసగా ఎనిమిదో గెలుపు
IND vs SA World Cup 2023: వన్డే ప్రపంచకప్‍లో టీమిండియా మరో భారీ విజయాన్ని సాధించింది. దక్షిణాఫ్రికాను భారీ తేడాతో భారత్ ఓడించింది. దీంతో వరల్డ్ కప్‍లో వరుసగా ఎనిమిదో గెలుపును నమోదు చేసుకుంది.
IND vs SA World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో టీమిండియా మరోసారి గర్జించింది. దక్షిణాఫ్రికాను భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. వరల్డ్ కప్‍లో భారత్ వరుసగా ఎనిమిదో విజయం సాధించింది. అజేయ యాత్రను కొనసాగించింది. దీంతో ఇప్పటికే సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న టీమిండియా.. పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‍ను పక్కా చేసుకుంది. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా నేడు (నవంబర్ 5) కోల్‍కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‍లో భారత్ 243 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాపై గ్రాండ్‍గా గెలిచింది.
భారత బౌలర్ల విజృంభణతో 327 పరుగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది. ఒక్క దక్షిణాఫ్రికా బ్యాటర్ కూడా కనీసం 20 పరుగులు చేయలేకపోయారు. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో సత్తాచాటి సఫారీ జట్టు బ్యాటింగ్ లైనప్‍ను దెబ్బ తీశాడు. కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ చెరో రెండు, మహమ్మద్ సిరాజ్ ఓ వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. భారత స్టార్ విరాట్ కోహ్లీ (101 నాటౌట్) తన పుట్టిన రోజున 49వ వన్డే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ అత్యధిక వన్డే సెంచరీల అపూర్వ రికార్డును సమం చేశాడు. కోహ్లీతో పాటు శ్రేయస్ అయ్యర్ (77) రాణించటంతో టీమిండియా భారీ స్కోరు చేసింది.
తిప్పేసిన జడేజా
దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (5)ను రెండో ఓవర్లోనే ఔట్ చేసి భారత్‍కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు పేసర్ మహమ్మద్ సిరాజ్. సఫారీ కెప్టెన్ టెంబా బవూమా (11)ను భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌల్డ్ చేశాడు. వాండర్ డుసెన్ (13), ఐడెన్ మార్క్ రమ్ (9)ను మహమ్మద్ షమీ ఔట్ చేశాడు. కాసేపటికే హెన్రిచ్ క్లాసెన్ (1), డేవిడ్ మిల్లర్ (11)ను జడేజా పెవిలియన్‍కు పంపాడు. దీంతో 59 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి వేగంగా పతనమైంది దక్షిణాఫ్రికా.
కేశవ్ మహారాజ్ (7), కగిసో రబాడ (6)ను కూడా ఔట్ చేసి ఐదు వికెట్లు తీసుకున్నాడు జడ్డూ. మార్కో జాన్సెన్ (14) కాసేపు నిలిచి ఈ మ్యాచ్‍లో దక్షిణాఫ్రికా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సఫారీ బ్యాటింగ్ లైనప్‍లో ఒక్క బ్యాటర్ కూడా కనీసం 20 పరుగుల మార్క్ చేరలేకపోయారు. ఏడుగురు సింగిల్ డిజిట్‍కే పరిమితం అయ్యారు. మొత్తంగా భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా 83 పరుగులకే చాపచుట్టేసింది.
టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా అదరగొట్టింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 24 బంతుల్లో 40 పరుగులతో మెరుపు ఆరంభం ఇచ్చాడు. విరాట్ కోహ్లీ అజేయ శతకంతో కదం తొక్కాడు. శ్రేయస్ అయ్యర్ 87 బంతుల్లో 77 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చివర్లో సూర్యకుమార్ యాదవ్ (22), రవీంద్ర జడేజా (29 నాటౌట్) వేగంగా ఆడారు.
అగ్రస్థానం పక్కా..
వన్డే ప్రపంచకప్‍లో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‍ల్లో అన్నీ గెలిచింది భారత్. 16 పాయింట్లతో పట్టికలో టాప్ ప్లేస్‍ను పక్కా చేసుకుంది. గ్రూప్ దశలో నెదర్లాండ్స్‌తో మరో మ్యాచ్‍ను టీమిండియా ఆడాల్సి ఉంది. దక్షిణాఫ్రికా 8 మ్యాచ్‍ల్లో ఆరు గెలిచి 12 పాయింట్లతో రెండో ప్లేస్‍లో ఉంది. మిగిలిన ఇంకో మ్యాచ్‍లో విజయం సాధించినా దక్షిణాఫ్రికా రెండో ప్లేస్‍లోనే ఉండనుంది. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్‍కు అర్హత సాధించాయి. సెమీస్‍లో మిగిలిన రెండు ప్లేస్‍ల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ పోటీ పడుతున్నాయి.
సంబంధిత కథనం