IND vs SA: టీమిండియా భారీ స్కోరు.. బర్త్ డే రోజున అద్భుత శతకంతో సచిన్‍ను చేరిన కోహ్లీ
IND vs SA World Cup 2023: దక్షిణాఫ్రికాతో మ్యాచ్‍లో భారత్ భారీ స్కోరు చేసింది. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీతో సచిన్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును సమం చేశాడు. ఆ వివరాలివే..
IND vs SA World Cup 2023: దక్షిణాఫ్రికాపై టీమిండియా భారీ స్కోరు చేసింది. భారత స్టార్ విరాట్ కోహ్లీ (121 బంతుల్లో 101 పరుగులు నాటౌట్; 10 ఫోర్లు) తన 35వ పుట్టిన రోజున అద్భుత శతకం చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యధిక వన్డే సెంచరీల (49) రికార్డును కోహ్లీ సమం చేశాడు. దీంతో వన్డే ప్రపంచకప్‍లో భాగంగా కోల్‍కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో నేడు (నవంబర్ 5) జరుగుతున్న మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్లో 49వ సెంచరీతో సత్తాచాటగా.. శ్రేయస్ అయ్యర్ (87 బంతుల్లో 77 పరుగులు) అర్ధ శతకంతో రాణించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (24 బంతుల్లో 40 పరుగులు) ధనాధన్ ఆరంభాన్ని ఇచ్చాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎంగ్డీ, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహారాజ్, షంషీకి చెరో వికెట్ దక్కింది. దక్షిణాఫ్రికా ముందు 327 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది భారత్.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‍కు దిగింది టీమిండియా. భారత కెప్టెన్ రోహిత్ శర్మ అదిరే ఆరంభం ఇచ్చాడు. 24 బంతుల్లోనే 40 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సూపర్ హిట్టింగ్ చేశాడు. దీంతో 4.3 ఓవర్లనే భారత్ స్కోరు 50 పరుగులకు చేరింది. అయితే, ఈ క్రమంలో ఆరో ఓవర్లో రోహిత్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ శుభ్‍మన్ గిల్ (23) కూడా కాసేపటి తర్వాత పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత భారత స్టార్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నిలకడగా ఆడారు. కఠినమైన పిచ్‍పై క్రమంగా పరుగులు రాబట్టారు. ఆచితూచి ఆడుతూనే వీలు దొరికినప్పుడు బౌండరీలు కొట్టారు. ఈ క్రమంలో 67 బంతుల్లో కోహ్లీ.. 64 బంతుల్లో శ్రేయస్ అర్ధ శతకాలకు చేరారు. హాఫ్ సెంచరీ చేశాక కాసేపు దూకుడుగా ఆడిన శ్రేయస్ ఔటయ్యాడు. మూడో వికెట్‍కు కోహ్లీ - అయ్యర్ 134 రన్స్ జోడించాడు.
శ్రేయస్ ఔటైనా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ అద్భుతంగా కొనసాగించాడు. కేఎల్ రాహుల్ (8) త్వరగానే ఔటయ్యాడు. అనంతరం 119 బంతుల్లో కోహ్లీ శతకానికి చేరాడు. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యధిక వన్డే సెంచరీల (49) రికార్డును కోహ్లీ సమం చేశాడు. సూర్య కుమార్ యాదవ్ (22), రవీంద్ర జడేజా (29 నాటౌట్) హిట్టింగ్ చేయడంతో భారత్‍కు భారీ స్కోరు వచ్చింది.