Virat Kohli: సచిన్‍ను సమం చేసిన విరాట్ కోహ్లీ.. పుట్టిన రోజున చరిత్రాత్మక శతకం
Virat Kohli - IND vs SA: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును భారత స్టార్ విరాట్ కోహ్లీ సమం చేశాడు. తన పుట్టిన రోజునే అద్భుతమైన శతకంతో అపూర్వమైన ఘనత సాధించాడు.
Virat Kohli - IND vs SA: భారత క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన సందర్భం సాకారమైంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (49 వన్డే శతకాలు).. అత్యధిక వన్డే సెంచరీల రికార్డును టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సమం చేశాడు. తన పుట్టిన రోజునే విరాట్ కోహ్లీ 49వ వన్డే శకతం చేసి ఈ అద్భుతం చేశాడు. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా దక్షిణాఫ్రికాతో నేడు (నవంబర్ 5) జరుగుతున్న మ్యాచ్‍లో భారత స్టార్, రన్ మెషీన్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు. వన్డే కెరీర్లో తన 49వ శకతాన్ని పూర్తి చేసుకున్నాడు. ఎవరూ సాధ్యం కాదనుకున్న సచిన్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును కింగ్ కోహ్లీ చేరాడు. సరికొత్త చరిత్రకు మరో అడుగు దూరంలో ఉన్నాడు.
49 వన్డే సెంచరీలను సచిన్ టెండూల్కర్ 451 వన్డే ఇన్నింగ్స్‌ల్లో చేశాడు. అయితే, విరాట్ కోహ్లీ.. 49 శతకాలను 277 వన్డే ఇన్నింగ్స్ (289వ మ్యాచ్)ల్లోనే చేరుకున్నాడు. తన 35వ పుట్టిన రోజైన నేడు ఈ అపూర్వ సెంచరీ చేశాడు కోహ్లీ.
ఈ మ్యాచ్‍లో 119 బంతుల్లో విరాట్ కోహ్లీ సెంచరీకి చేరాడు. కోహ్లీ శతకం పూర్తికాగానే ఈడెన్ గార్డెన్ మైదానం అభిమానుల హర్షధ్వానాలతో మోతెక్కిపోయింది. అభిమానులు తమ స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ లైట్లతో మెరిపించారు. మొత్తంగా ఈ మ్యాచ్‍లో 121 బంతుల్లో 101 పరుగులు చేశాడు కోహ్లీ. బ్యాటింగ్‍కు కష్టంగా ఉన్న పిచ్‍పై నిలకడగా ఆడి టీమిండియాకు మంచి స్కోరు అందించాడు.
సచిన్ అత్యధిక వన్డే శతకాల రికార్డును విరాట్ కోహ్లీ సమం చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కింగ్ కోహ్లీని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 50వ వన్డే సెంచరీని కూడా ఇదే ప్రపంచకప్‍లో కోహ్లీ చేస్తాడని నమ్మకంగా చెబుతున్నారు. చాలా మంది ప్రముఖులు కూడా కోహ్లీని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.