Team India at Perth: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. అందులో భాగంగా శుక్రవారం (నవంబర్ 22) నుంచి పెర్త్ లో తొలి టెస్టు ఆడబోతోంది. గత రెండు పర్యటనల్లోనూ 2-1తో సిరీస్ విజయాలు సాధించిన టీమిండియాకు ఈసారి దానిని రిపీట్ చేయడం అంత సులువుగా కనిపించడం లేదు. పెర్త్ లో తొలి టెస్టుతోనే అసలుసిసలు సవాలు మొదలు కానుంది.
పెర్త్ అంటే సాధారణంగా వాకా (వెస్టర్న్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్) గ్రౌండ్ గుర్తుకు వస్తుంది. కానీ ఈసారి మ్యాచ్ ఆప్టస్ స్టేడియంలో జరగనుంది. గతంలో ఇక్కడ ఒకే ఒక్క టెస్టు మాత్రమే ఇండియా ఆడింది. అయితే ఇక్కడ కూడా బౌన్సీ పిచ్ ఉండనుంది. వాకాలాగే కండిషన్స్ ఉన్నా.. టీమిండియాకు సవాలుగా మారనుంది.
గతంలో వాకాలోనూ టీమిండియా నాలుగు టెస్టులు ఆడింది. అందులో కేవలం ఒకదాంట్లో గెలవగా.. ఆస్ట్రేలియా మూడింట్లో విజయం సాధించింది. 2008లో ఇర్ఫాన్ పఠాన్ ఆల్ రౌండ్ నైపుణ్యంతో ఇండియా 72 పరుగులతో గెలిచింది.
ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా 1977 - 2 వికెట్లతో గెలిచిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా 1992 - 300 పరుగులతో గెలిచిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా 2008 - 72 పరుగులతో గెలిచిన ఇండియా
ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా 2012 - ఇన్నింగ్స్ 37 పరుగులతో గెలిచిన ఆస్ట్రేలియా
ఇక ఇప్పుడు మ్యాచ్ జరగబోయే ఆప్టస్ స్టేడియంలో ఇండియా 2018లో ఒక మ్యాచ్ ఆడింది. అందులో విరాట్ కోహ్లి సెంచరీ చేసినా.. ఆస్ట్రేలియానే 146 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇలా మొత్తంగా పెర్త్ లో ఐదు టెస్టులాడిన టీమిండియా ఒకే ఒక్క దాంట్లోనే గెలిచింది.
క్రికెట్ చరిత్రలో అత్యంత దుమారం రేపిన వివాదాల్లో ఒకటి హర్భజన్, సైమండ్స్ మధ్య జరిగిన మంకీగేట్ వివాదం. 2008 పర్యటనలో ఈ పెర్త్ టెస్టు జరగడానికి ముందు సిడ్నీలో ఆ ఘటన జరిగింది. ఆ మ్యాచ్ లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురవగా.. ఆ వెంటనే పెర్త్ లో జరిగిన టెస్టులో ఇండియా సంచలన విజయంతో దీటుగా బదులిచ్చింది.
ఇప్పటి వరకూ ఇక్కడ ఇండియా గెలిచిన ఏకైక మ్యాచ్ అదే. ఆ మ్యాచ్ లో ఇర్ఫాన్ పఠాన్ ఐదు వికెట్లు తీయడంతోపాటు రెండు ఇన్నింగ్స్ కలిపి 74 రన్స్ చేశాడు. దీంతో ఇండియన్ టీమ్ 72 పరుగులతో విజయం సాధించింది. సిడ్నీ టెస్టులో హర్భజన్ తనను మంకీ అన్నాడని, అది జాతి వివక్ష కిందికే వస్తుందని సైమండ్స్ తోపాటు ఆస్ట్రేలియా టీమ్ అంతా రచ్చరచ్చ చేసింది.
ఈ ఘటనలో హర్భజన్ పై రెండు టెస్టుల నిషేధం కూడా విధించారు. అంతేకాదు ఆ మ్యాచ్ లో అంపైరింగ్ తప్పిదాలతోనూ ఇండియా నష్టపోయింది. అయితే ఆ సిడ్నీ టెస్టు వెంటనే పెర్త్ లో జరిగిన మ్యాచ్ లో ప్రతీకారం తీర్చుకొని దెబ్బకు దెబ్బ కొట్టింది.