India vs Australia: ఆస్ట్రేలియాకు ఐపీఎల్ వేలం దెబ్బ.. పెర్త్ టెస్ట్ మధ్యలోనే వెళ్లిపోనున్న కోచ్-india vs australia perth test ipl 2025 mega auction daniel vettori to leave team to join sunrisers hyderabad ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Australia: ఆస్ట్రేలియాకు ఐపీఎల్ వేలం దెబ్బ.. పెర్త్ టెస్ట్ మధ్యలోనే వెళ్లిపోనున్న కోచ్

India vs Australia: ఆస్ట్రేలియాకు ఐపీఎల్ వేలం దెబ్బ.. పెర్త్ టెస్ట్ మధ్యలోనే వెళ్లిపోనున్న కోచ్

Hari Prasad S HT Telugu
Nov 19, 2024 10:07 AM IST

India vs Australia: ఆస్ట్రేలియాకు ఐపీఎల్ వేలం షాక్ తగలనుంది. ఈ మెగా వేలం నేపథ్యంలో ఆ టీమ్ కోచ్ డేనియల్ వెటోరి పెర్త్ టెస్ట్ మధ్యలోనే జట్టును విడిచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నాడు.

ఆస్ట్రేలియాకు ఐపీఎల్ వేలం దెబ్బ.. పెర్త్ టెస్ట్ మధ్యలోనే వెళ్లిపోనున్న కోచ్
ఆస్ట్రేలియాకు ఐపీఎల్ వేలం దెబ్బ.. పెర్త్ టెస్ట్ మధ్యలోనే వెళ్లిపోనున్న కోచ్

India vs Australia: టీమిండియాతో పెర్త్ లో శుక్రవారం (నవంబర్ 22) నుంచి ఆస్ట్రేలియా తొలి టెస్టు ఆడటానికి సిద్ధమవుతోంది. ఆ టెస్టు జరుగుతుండగానే మరోవైపు జెడ్డాలో ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. దీంతో ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ అయిన డేనియల్ వెటోరీ ఈ టెస్టు మధ్యలోనే జట్టును విడిచి వెళ్లనున్నాడు. అతడు సన్ రైజర్స్ హెడ్ కోచ్ గా ఉన్న విషయం తెలిసిందే.

ఐపీఎల్ వేలం.. పెర్త్ టెస్టుకు డుమ్మా

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ అయిన డేనియల్ వెటోరీ కొన్నాళ్లుగా ఆస్ట్రేలియా టీమ్ అసిస్టెంట్ కోచ్ గా ఉన్నాడు. అటు ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ కూడా అతడే. ఇప్పుడు ఇటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు, అటు ఐపీఎల్ మెగా వేలం ఒకేసారి జరుగుతుండటంతో టెస్టు వదలి వేలానికి వెళ్లనున్నాడు వెటోరీ. ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దాలో జరగనుంది.

పెర్త్ టెస్టు నవంబర్ 22 నుంచి 26 వరకు జరుగుతుంది. దీంతో తొలి రెండు రోజులు ఆస్ట్రేలియా జట్టుతోనే ఉండే వెటోరీ.. తర్వాత నవంబర్ 24, 25 తేదీల్లో మాత్రం వేలం కోసం జట్టును వీడనున్నాడు. సన్ రైజర్స్ హెడ్ కోచ్ కావడంతో జట్టు కోసం ప్లేయర్స్ ను కొనుగోలు చేయడంలో అతనిది కీలకపాత్ర. దీంతో అతనికి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో వెటోరీకి తాము పూర్తి సపోర్ట్ ఇస్తున్నట్లు ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది.

వీళ్లు కూడా అంతే..

ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచే కాదు.. బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోసం కామెంటేటర్లుగా ఉన్న రికీ పాంటింగ్, జస్టిన్ లాంగర్ లాంటి వాళ్లు కూడా తమ విధులను రెండు రోజులు పక్కన పెట్టి ఐపీఎల్ వేలం కోసం వెళ్లనున్నారు. పాంటింగ్ పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ కాగా.. లాంగర్ లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ గా ఉన్నాడు

డేనియల్ వెటోరీ 2022 నుంచి ఆస్ట్రేలియా టీమ్ అసిస్టెంట్ కోచ్ గా కొనసాగుతున్నాడు. అయితే ఇండియా, ఆస్ట్రేలియాలాంటి కీలకమైన టెస్టు సిరీస్ సమయంలోనే ఐపీఎల్ వేలం నిర్వహిస్తుండటం, దాని కోసం ఓ నేషనల్ టీమ్ కోచ్ టెస్టు మధ్యలోనే వెళ్తుండటం మాత్రం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఐపీఎల్ కు ప్రపంచ క్రికెట్ లో ఉన్న ప్రాధాన్యత ఎంతో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు జరగనున్న విషయం తెలిసిందే. తొలి టెస్టు నవంబర్ 22 నుంచి పెర్త్ లో ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా మూడో సిరీస్ పై కన్నేసిన టీమిండియా.. తొలి టెస్టుకు మాత్రం రోహిత్, శుభ్‌మన్ లాంటి ప్లేయర్స్ సేవలను కోల్పోయి, న్యూజిలాండ్ చేతుల్లో వైట్ వాష్ పరాభవంతో తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది.

Whats_app_banner