T20 World Cup Winners: టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్స్ ఇవే.. ఇప్పుడు ఏ గ్రూపులో ఏ టీమ్ ఉందో చూడండి
T20 World Cup Winners: టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభానికి టైమ్ దగ్గరపడింది. మరి ఈ నేపథ్యంలో గతంలో ఈ మెగా టోర్నీ గెలిచిన టీమ్స్ ఏవి? ప్రస్తుతం ఆయా టీమ్స్ ఏ గ్రూపులో ఉన్నాయో చూడండి.
T20 World Cup Winners: టీ20 వరల్డ్ కప్ 2024 జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరగనున్న సంగతి తెలుసు కదా. భారత కాలమానం ప్రకారం చూస్తే జూన్ 2 ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఈసారి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా వరల్డ్ కప్ నిర్వహిస్తున్నాయి. దీంతో చాలా వరకు మ్యాచ్ లు మన టైమ్ జోన్ ప్రకారం ఉదయం 6 గంటలకు లేదంటే రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి.
టీ20 వరల్డ్ కప్ 2024 గ్రూప్స్
టీ20 వరల్డ్ కప్ 2024లో మొత్తం 20 టీమ్స్ పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు టీమ్స్ ఉంటాయి.
గ్రూప్ ఎ - ఇండియా, పాకిస్థాన్, కెనడా, ఐర్లాండ్, యూఎస్ఏ
గ్రూప్ బి - ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్
గ్రూప్ సి - న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, పపువా న్యూ గినియా, ఉగాండా
గ్రూప్ డి - సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్
ప్రతి గ్రూపులో ఒక్కో టీమ్ మిగిలిన అన్ని టీమ్స్ తో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అంటే గరిష్ఠంగా అన్ని మ్యాచ్ లు గెలిచిన జట్టుకు 8 పాయింట్లు వస్తాయి. ఒక్కో గ్రూపు నుంచి రెండు టీమ్స్ సూపర్ 8 స్టేజ్ కు వెళ్తాయి. సూపర్ 8లో రెండు గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. అందులో ఒక్కో గ్రూపు నుంచి రెండేసి టీమ్స్ సెమీఫైనల్స్ కు వెళ్తాయి.
టీ20 వరల్డ్ కప్ 2024 వేదికలు
టీ20 వరల్డ్ కప్ 2024 వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ లోని మొత్తం 9 స్టేడియాల్లో జరుగుతాయి. అందులో ఆరు వెస్టిండీస్ లో, మూడు అమెరికాలో ఉన్నాయి. వెస్టిండీస్ లో సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, కెన్సింగ్టన్ ఓవల్, ప్రావిడెన్స్ స్టేడియం, డారెన్ సామి క్రికెట్ గ్రౌండ్, ఆర్నోస్ వేల్ స్టేడియం, బ్రియాన్ లారా క్రికెట్ అకాడెమీ స్టేడియాల్లో మ్యాచ్ లు జరుగుతాయి.
ఇక అమెరికాలో సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్, నాసౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గ్రాండ్ ప్రాయిరీ స్టేడియంలో మ్యాచ్ లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 29న బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరుగుతుంది.
టీ20 వరల్డ్ కప్ విజేతలు
2007 టీ20 వరల్డ్ కప్ - ఇండియా (ఫైనల్లో 5 పరుగులతో పాకిస్థాన్ పై విజయం)
2009 - పాకిస్థాన్ (ఫైనల్లో శ్రీలంకపై 8 వికెట్లతో గెలుపు)
2010 - ఇంగ్లండ్ (ఫైనల్లో ఆస్ట్రేలియాపై 7 వికెట్లతో విజయం)
2012 - వెస్టిండీస్ (శ్రీలంకపై 36 పరుగులతో గెలుపు)
2014 - శ్రీలంక (ఫైనల్లో ఇండియాపై 6 వికెట్లతో విజయం)
2016 - వెస్టిండీస్ (ఫైనల్లో ఇంగ్లండ్ పై 4 వికెట్ల విజయం)
2021 - ఆస్ట్రేలియా (ఫైనల్లో న్యూజిలాండ్ పై 8 వికెట్లతో గెలుపు)
2022 - ఇంగ్లండ్ (ఫైనల్లో పాకిస్థాన్ పై 5 వికెట్ల విజయం)