T20 World Cup 2024: విరుచుకుపడిన టోర్నడో: ప్రపంచకప్ వామప్ మ్యాచ్ రద్దు
T20 World Cup 2024 - USA Tornado: టీ20 ప్రపంచకప్‍కు టర్నోడోలు అడ్డంకులు కలిగించేలా కనిపిస్తున్నాయి. టోర్నడో బీభత్సం వల్ల ఓ వామప్ మ్యాచ్ రద్దయింది.
T20 World Cup 2024: తొలిసారి టీ20 ప్రపంచకప్ టోర్నీకి అమెరికా ఆతిథ్యమిస్తోంది. టీ20 ప్రపంచప్ 2024 మెగాటోర్నీ వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరగనుంది. జూన్ 2న ఈ మెగాటోర్నీ ఆరంభం కానుంది. అయితే, టీ20 ప్రపంచకప్‍కు ముందు ప్రస్తుతం వామప్ మ్యాచ్‍లు జరుగుతున్నాయి. అయితే, టోర్నడోలు అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ రాకాసి గాలుల వల్ల ఓ వామప్ మ్యాచ్ రద్దయింది.
మ్యాచ్ క్యాన్సల్
డల్లాస్‍లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో నేడు (మే 28) ఆతిథ్య అమెరికా, బంగ్లాదేశ్ మధ్య ప్రపంచకప్ వామప్ మ్యాచ్ జరగాల్సింది. అయితే, టోర్నడో విరుచుకుపడటంతో ఈ మ్యాచ్ రద్దయింది.
టోర్నడో వల్ల స్టేడియం చాలా దెబ్బతినింది. మైదానంలో ఏర్పాటు చేసిన ఓ పెద్ద స్క్రీన్‍ను ఈ భారీ గాలి ధ్వంసం చేసేసింది. స్డేడియం పైకప్పు కూడా డ్యామేజ్ అయింది. సుమారు గంటకు 128 కిలోమీటర్ల వేగంతో అక్కడ గాలి వీచింది.
టోర్నడో వల్ల స్టేడియం ధ్వంసం అవడంతో డల్లాస్ స్టేడియంలో అమెరికా, బంగ్లాదేశ్ మ్యాచ్ సాధ్యం కాలేదు. ఇంకా టోర్నడో హెచ్చరికలు ఉండటంతో వామప్ మ్యాచ్‍లకు గండంగా మారింది.
అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, కెంటుకీ సహా చాలా చోట్ల వారం రోజులుగా టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. వీటి వల్ల 23 మంది వరకు మరణించారు. చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇంకా కొన్ని చోట్ల టోర్నడోల ప్రమాదం ఉందనే హెచ్చరికలు వచ్చాయి.
టీ20 ప్రపంచకప్‍లో టీమిండియా కూడా ఓ వామప్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 1వ తేదీన బంగ్లాదేశ్‍తో న్యూయార్క్ వేదికగా వామప్ మ్యాచ్‍లో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‍కు టోర్నడోల ప్రభావం ఉండదు.
జూన్ 2 నుంచి జూన్ 29వ తేదీ వరకు వెస్టిండీస్, అమెరికా వేదికలుగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. గ్రూప్ మ్యాచ్‍లు ఆ రెండు దేశాల్లో సంయుక్తంగా జరగనున్నాయి. ఆ తర్వాత సూపర్-8, సెమీస్, ఫైనల్స్ వెస్టిండీస్‍లోనే జరుగుతాయి. ఓ ఐసీసీ టోర్నీకి అమెరికా తొలిసారి ఆతిథ్యమిస్తోంది. ఈ టోర్నీ కోసం కొత్తగా స్టేడియాలు కూడా నిర్మించింది.
న్యూయార్క్‌లో భారత ఆటగాళ్లు
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ కోసం ఇప్పటికే కొందరు టీమిండియా ప్లేయర్లు, కోచింగ్ సిబ్బంది అమెరికాకు వెళ్లారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్‍ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శివం దూబే సహా మరికొందరు ప్లేయర్లు న్యూయార్క్‌కు వెళ్లారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా కోచింగ్ సిబ్బంది కూడా వెళ్లారు.
ప్రస్తుతం న్యూయార్క్ స్టేడియంలో భారత ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే కుదిరినప్పుడు సిటీ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. న్యూయార్క్‌లో దిగిన ఫొటోలను రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, అర్షదీప్ కూడా జ్యూస్ తాగుతూ సెల్ఫీలు తీసుకున్నారు.
జూన్ 5న ఐర్లాండ్‍తో మ్యాచ్‍తో టీ20 ప్రపంచకప్ వేటను భారత్ మొదలుపెట్టనుంది. ఆ తర్వాత పాకిస్థాన్‍తో జూన్ 9న సమరం ఉండనుంది. గ్రూప్ దశలో అమెరికా (జూన్ 12), కెనడా (జూన్ 15)తోనూ తలపడనుంది టీమిండియా. ఆ తర్వాత సూపర్-8 మ్యాచ్‍లు ఉంటాయి.