India vs Pakistan: టీ20 ప్రపంచకప్‍లో ఇండియా, పాకిస్థాన్ సమరం జరిగే స్టేడియం ప్రారంభం.. లాంచ్ చేసిన పరుగుల వీరుడు-t20 world cup india vs pakistan match venue nassau county cricket stadium launched usain bolt attended ind vs pak ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Pakistan: టీ20 ప్రపంచకప్‍లో ఇండియా, పాకిస్థాన్ సమరం జరిగే స్టేడియం ప్రారంభం.. లాంచ్ చేసిన పరుగుల వీరుడు

India vs Pakistan: టీ20 ప్రపంచకప్‍లో ఇండియా, పాకిస్థాన్ సమరం జరిగే స్టేడియం ప్రారంభం.. లాంచ్ చేసిన పరుగుల వీరుడు

Chatakonda Krishna Prakash HT Telugu
May 16, 2024 10:48 AM IST

India vs Pakistan T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‍లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడే వేదిక సిద్ధమైంది. ఈ స్టేడియం అధికారికంగా లాంచ్ అయింది. ఈ లాంచ్ కార్యక్రమానికి జమైకా చిరుత ఉసేన్ బౌల్ట్ కూడా హాజరయ్యారు.

India vs Pakistan: టీ20 ప్రపంచకప్‍లో ఇండియా, పాకిస్థాన్ సమరం జరిగే స్టేడియం ప్రారంభం.. లాంచ్ చేసిన పరుగుల వీరుడు
India vs Pakistan: టీ20 ప్రపంచకప్‍లో ఇండియా, పాకిస్థాన్ సమరం జరిగే స్టేడియం ప్రారంభం.. లాంచ్ చేసిన పరుగుల వీరుడు

IND vs PAK T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 సమరానికి సమయం ఆసన్నమవుతోంది. జూన్‍లో వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ఈ మెగాటోర్నీ జరగనుంది. అమెరికా తొలిసారి ఓ ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిస్తోంది. దీంతో అక్కడ కొత్త స్టేడియాల ఏర్పాటు జరుగుతోంది. జూన్ 2వ తేదీన ఈ టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. కాగా, ఈ టోర్నీలో అందరూ ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మధ్య మహా పోరు జూన్ 9వ తేదీన జరగనుంది. ఈ మ్యాచ్ కోసం న్యూయార్క్‌లో స్టేడియం సర్వం సిద్ధమైంది. ఈ స్టేడియాన్ని ఐసీసీ నేడు లాంచ్ చేసింది.

వేదిక ఇదే

టీ20 ప్రపంచకప్ కోసం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నసావూ క్రౌంటీ క్రికెట్ ఇంటర్నేషనల్ స్టేడియం కొత్తగా నిర్మితమైంది. ఈ వేదికలోనే గ్రూప్‍-ఏలో ఉన్న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ పోరు కోసం క్రికెట్ అభిమానంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ టికెట్లు ఎప్పుడో భారీ ధరలకు అమ్ముడుపోగా.. ఆ మ్యాచ్ తేదీల్లో న్యూయార్క్ సిటీలో హోటళ్ల ధరలకు కూడా రెక్కలు వచ్చాయని తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‍లో ఇంతటి హైవోల్టేజ్ మ్యాచ్ జరగనున్న స్టేడియం నేడు (మే 16) లాంచ్ అయింది.

లాంచ్ ఈవెంట్‍లో ఉసేన్ బౌల్ట్

జమైకా చిరుత, ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ ఉసేన్ బౌల్ట్ టీ20 ప్రపంచకప్‍కు అంబాసిడార్‌గా ఉన్నారు. న్యూయార్క్‌లోని ఈ నసావూ కౌంటీ క్రికెట్ ఇంటర్నేషనల్ స్టేడియం లాంచ్ కార్యక్రమానికి ఈ అమెరికా పరుగుల వీరుడు కూడా హాజరయ్యారు. అలాగే, క్రికెట్ దిగ్గజాలు సర్ కర్ట్లీ ఆంబ్రోస్, లియమా ప్లంకెట్, షోయబ్ మాలిక్ సహా మరికొందరు ఈ లాంచ్ ఈవెంట్‍లో పాల్గొన్నారు. జాన్ స్ట్రార్క్స్, బార్టోలో కోలోన్‍తో పాటు కొందరు అమెరికా పాపులర్ క్రీడాకారులు కూడా ఈ ఈవెంట్‍కు వచ్చారు.

ఈ ఈవెంట్‍కు హాజరైన స్టార్లు ఓ పెద్ద బ్యాట్‍పై సంతకాలు చేశారు. ఈ ప్రపంచకప్‍లో భాగంగా ఆ స్టేడియంలో ఎనిమిది మ్యాచ్‍లు జరగనున్నాయి. ఆ మ్యాచ్‍ల సందర్భంగా ఈ బ్యాట్‍ను ప్రదర్శిస్తారు. జూన్ 3న శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ ఈ స్టేడియానికి మొదటిది కానుంది. జూన్ 9న టీమిండియా, పాకిస్థాన్ ఈ వేదికలో తలపడతాయి. ఈ స్టేడియం 34వేల సీట్ల కెపాసిటీని కలిగి ఉంది.

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ జూన్ 2వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. నాలుగు గ్రూప్‍లు ఉంటాయి. గ్రూప్ దశలో ప్రతీ గ్రూప్‍లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8 చేరతాయి. సూపర్-8లో అర్హత సాధించే నాలుగు జట్లు సెమీఫైనల్స్ చేరతాయి. సెమీస్‍లో గెలిచే టీమ్‍లు ఫైనల్‍లో తలపడతాయి. జూన్ 29న విండీస్‍లో బార్బడోస్‍లో తుదిపోరు జరుగుతుంది. 

ప్రపంచకప్ 2024 టోర్నీలో మొత్తంగా 55 మ్యాచ్‍లు ఉంటాయి. గ్రూప్ దశ మ్యాచ్‍లో అమెరికా, వెస్టిండీస్‍‍ల్లో జరుగుతాయి. అమెరికాలోని మూడు వేదికల్లో 16 మ్యాచ్‍లు ఉంటాయి. సూపర్-8, సెమీస్ ఫైనల్స్, ఫైనల్ వెస్టిండీస్‍‍లోనే జరుగుతాయి. జూన్ 5న ఐర్లాండ్‍తో మ్యాచ్‍తో ఈ ప్రపంచకప్‍లో టీమిండియా వేట మొదలుపెట్టనుంది.