Suryakumar Yadav: టీ20ల్లో నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన సూర్యకుమార్.. కొత్త నంబర్ వన్ ప్లేయర్ ఇతడే-suryakumar yadav lost number one rank in latest icc t20 rankings travis head new number one ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Suryakumar Yadav: టీ20ల్లో నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన సూర్యకుమార్.. కొత్త నంబర్ వన్ ప్లేయర్ ఇతడే

Suryakumar Yadav: టీ20ల్లో నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన సూర్యకుమార్.. కొత్త నంబర్ వన్ ప్లేయర్ ఇతడే

Hari Prasad S HT Telugu
Jun 26, 2024 03:49 PM IST

Suryakumar Yadav: టీ20 ర్యాంకుల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయాడు. తాజాగా ఐసీసీ బుధవారం (జూన్ 26) ఈ ర్యాంకులను రిలీజ్ చేసింది.

టీ20ల్లో నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన సూర్యకుమార్.. కొత్త నంబర్ వన్ ప్లేయర్ ఇతడే
టీ20ల్లో నంబర్ వన్ ర్యాంక్ కోల్పోయిన సూర్యకుమార్.. కొత్త నంబర్ వన్ ప్లేయర్ ఇతడే

Suryakumar Yadav: సుమారు ఏడు నెలలుగా టీ20ల్లో నంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తాజా ర్యాంకుల్లో మాత్రం రెండో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ తొలిసారి నంబర్ వన్ ర్యాంకు అందుకోవడం విశేషం. టీ20 వరల్డ్ కప్ 2024లో ఆస్ట్రేలియా సెమీస్ చేరకపోయినా.. హెడ్ మాత్రం రాణించాడు.

టీ20 ర్యాంకుల్లో టాప్ 5 వీళ్లే

టీ20ల్లో సూర్యకుమార్ హవా చాలా కాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అతడు గతంలోనూ కొన్నిసార్లు నంబర్ వన్ ర్యాంకులో ఉన్నా.. గతేడాది డిసెంబర్ నుంచి అదే స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. కానీ హెడ్ టాప్ ఫామ్ అతని ఆధిపత్యానికి చెక్ పెట్టింది. తాజా ర్యాంకుల్లో హెడ్ నాలుగు స్థానాలు ఎగబాకాడు. దీంతో సూర్య రెండో స్థానానికి పడిపోయాడు.

ఆ తర్వాత ఫిల్ సాల్ట్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ మూడు నుంచి ఐదు స్థానాల వరకు ఉన్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ టీ20 వరల్డ్ కప్ చివరి సూపర్ 8 మ్యాచ్ లోనూ ఇండియాపై 43 బంతుల్లోనే 76 రన్స్ చేశాడు. తమ టీమ్ ను గెలిపించడానికి ప్రయత్నించినా.. చివర్లో ఔటవడంతో ఆసీస్ కు ఓటమి తప్పలేదు. ఆ తర్వాత బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్థాన్ ఓటమితో ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది.

టీ20 వరల్డ్ కప్‌లో హెడ్ ఇలా..

గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్, వరల్డ్ కప్ ఫైనల్స్ లోనూ ఇండియా ఓటమికి కారణమైన ట్రావిస్ హెడ్.. ఈ ఏడాది ఐపీఎల్లోనూ సన్ రైజర్స్ జట్టు తరఫున టాప్ ఫామ్ కనబరిచాడు. అదే ఫామ్ ను టీ20 వరల్డ్ కప్ లోనూ కొనసాగించాడు. అతడు 7 మ్యాచ్ లలో 42 సగటుతో 255 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 158 కావడం విశేషం. ఈ టోర్నీలో 200కుపైగా రన్స్ చేసిన వాళ్లలో అత్యుత్తమ సగటు అతనిదే.

మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఈ వరల్డ్ కప్ లో ఆరు ఇన్నింగ్స్ లో 149 రన్స్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 139గా ఉంది. అయితే కోల్పోయిన నంబర్ ర్యాంకును సూర్య మళ్లీ దక్కించుకునే అవకాశం ఉంది. ఇంగ్లండ్ తో జరగబోయే సెమీఫైనల్లో రాణిస్తే సూర్య మళ్లీ టాప్ లోకి వెళ్లొచ్చు. హెడ్ కంటే కేవలం రెండు రేటింగ్ పాయింట్లే వెనుకబడ్డాడు.

బుమ్రా పైకి ఎగబాకినా..

ఈ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు వరుస విజయాలు సాధించి పెడుతున్న బుమ్రా కూడా తాజా ర్యాంకుల్లో ఏకంగా 44 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంకులో నిలిచాడు. అటు కుల్దీప్ యాదవ్ కూడా 20 స్థానాలు ఎగబాకి.. 11వ ర్యాంకు సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు.

ఇక ఆల్ రౌండర్ల విషయానికి వస్తే శ్రీలంక ప్లేయర్ హసరంగా టాప్ లోకి దూసుకొచ్చాడు. ఇన్నాళ్లూ ఆ స్థానంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ స్టాయినిస్ ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయాడు. ఇండియన్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మూడో స్థానంలో ఉన్నాడు.

Whats_app_banner